రమ్య హత్య వెనక..???

నిండా 20 ఏళ్లు కూడా రాని ఆడపిల్లలు కత్తి పోట్లకు బలైపోతున్నారు. సినిమాలో మర్డర్ సీన్ వస్తేనే కళ్లు మూసుకునే ఆ పిల్లలు .. కళ్లెదురుగా కత్తి కనపడగానే వణికిపోతున్నారు. తను నమ్మిన.. తనకు తెలిసిన స్నేహితుడే రాక్షసుడిలా తెగబడుతుంటే ఏం చేయాలో తెలియక ఆర్తనాదాలు చేస్తున్నారు. చట్టాలు చాలా ఉన్నాయి. పోలీసులు చాలామంది ఉన్నారు. అయినా ఈ హత్యలు ఎందుకు ఆగటం లేదు? రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప అసలు సమస్య ఏంటో గుర్తించి ఆ హత్యలు ఆగేలా మాత్రం చేయలేకపోతున్నారు.

తాము ఏదైనా చేయొచ్చు. ఆడపిల్లలు మాత్రం తాము చెప్పినట్లు వినాలనే మగ దురహంకారమే దీనికి కారణం. చాలామంది ఆడపిల్లలు తిరిగి చెడతారు.. వారి చేతికి మొబైల్ ఫోన్స్ వచ్చాయ చెడిపోతున్నారు.. చిన్న వయసులోనే ప్రేమలంటూ తిరిగి. కోరి చావును తెచ్చుకుంటున్నారు. ఇలాంటివన్నీ కామన్ గా మనకు వినపడుతూ ఉంటాయి. కాని అవే పనులు మగపిల్లలు కూడా చేస్తారు.. వారినెవరు ఇలా నడిరోడ్డుపై కత్తితో పొడవటం లేదే. ఏ ఆడపిల్ల కత్తి పట్టుకుని రోడ్డుపైకి రావటం లేదే దీనికి సమాధానం ఉండదు.

మగవాడు తాను ఎంతమందినైనా ప్రేమించొచ్చు. తాను పెళ్లి చేసుకుని కూడా ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవచ్చు. ఆఫ్ కోర్స్ సుప్రీంకోర్టు కూడా ఇష్టపడితే ఎవరితో ఎవరైనా ఎఫైర్ పెట్టుకోవచ్చని క్లారిటీ ఇచ్చేసింది. అందుకే మరింత రెచ్చిపోతున్నారు ఇంట్లో సమస్య ఉండి బయట మరొకరిని ఇష్టపడొచ్చు దానిని అర్ధం చేసుకోవచ్చు. కాని అదే పని ఆడది చేసిందంటే చాలు రచ్చ రంబోలా చేస్తారు. వారికి ఒక న్యాయం.. ఆడవారికి మరో న్యాయం.

ఇది తరతరాలుగా మన వ్యవస్ధపై ముద్ర వేసిన మగదురహంకారపు లక్షణం అది. అందుకే టీనేజ్ లో ఉన్న పిల్లలు ఇప్పుడొచ్చిన ఇంటర్ నెట్ సోషల్ మీడియాతో తొందరగా కనెక్ట్ అయిపోతున్నారు. తోడు కావాలనుకునేవారు మగ కావొచ్చు, ఆడ కావొచ్చు స్పీడుగా ముందుకెళుతున్నారు. కాని ఇక్కడ సోషల్ మీడియా మధ్యలో ఉండటంతో అసలు స్వరూపాలు ఒకరికొకరికి తెలియవు. కలుసుకున్నాక అసలు సంగతులు తెలుస్తాయి. అబ్బాయి యాటిట్యూడ్ ఏంటో అర్ధమవుతుంది.

అప్పుడు దాకా కలలు కన్న అమ్మాయి షాకవుతుంది. భయపడుతుంది.. వాడిని దూరం పెట్టాలని చూస్తుంది. అప్పటిదాకా ఆ పిల్ల తనదే అనుకున్నవాడు దానిని తట్టుకోలేకపోతున్నాడు.. రాక్షసుడిలా మారుతున్నాడు.. తనకు నచ్చకపోతే అదే పిల్లను దూరం పెట్టి మరో పిల్ల కోసం ట్రై చేస్తాడు. కాని తనను ఆడపిల్ల దూరం పెడితే మాత్రం ఊరుకోడు అదే దురహంకారం నచ్చలేదు అన్నప్పుడు వదిలేయాలి కాని ఇగో దారుణంగా దెబ్బ తింటుంది. ఫ్రెండ్స్ ముందు అప్పటిదాకా పిట్ట పడింది నాకు.. లవర్ ఉంది నాకు అంటూ కాలరెగరేసినవాడు మొహం చూపించలేను అనే ఫీలింగ్ లో కి వెళ్లిపోతాడు. అంతే వాడి విచక్షణ నశిస్తుంది. నరరూప రాక్షసుడిగా మారిపోతాడు.ఆ పిల్లను అంతం చేయడానికి సిద్ధమైపోతున్నాడు. ప్రతి కేసులోనూ దాదాపు ఇదే జరుగుతుంది.

ఒక మగవాడి సంగతి పూర్తిగా అర్ధమయ్యేవరకు అడుగు ముందుకేయకూడదనే సంగతి ఆడపిల్లలు అర్ధం చేసుకోవాలి. అలాగే ఆడపిల్లల మనసు మారినప్పుడు.. దానిని కన్సిడర్ చేసి.. పక్కకు తప్పుకోవడమే మంచిదనే సంగతి మగపిల్లలు అర్ధం చేసుకోవాలి. టీనేజ్ పిల్లలు నిజాలకు, భ్రమలకు తేడా తెలుసుకునే రోజులు వస్తాయని ఆశిద్దాం.. ఇలాంటి దారుణ హత్యలు ఇక జరగకుండా ఉండాలని కోరుకుందాం.