డైలీ ఓ పది నిమిషాల ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది?

10 minutes meditation benefits,

మీకు తెలుసా ధ్యానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? మనం పనిచేసే చోట ఒత్తిడిని తగ్గించుకోవడానికి , మన కెరీర్ మరింత గొప్పగా ఉండటానికి, అంతేనా ఏకాగ్రతను పెంచుకోవడానికి, మానసిక ఒత్తిడులను తగ్గించుకోవడానికి, అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి… అబ్బో..ఇలా చెప్పుకుంటే పోతే చాట భారతంలా మారిపోతుంది. డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్ప్, మెంటర్లు సైతం మెడిటేషన్ చేయమని చెబుతున్నారంటేనే ధ్యానం ఇంపార్టెన్స్ అర్ధం చేసుకోవచ్చు. రోజుకు పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఎంతోమంచిదని పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి. ధ్యానం ఏకాగ్రతను పెంచే మెదడులో మార్పులకు కారణమవుతుందని చెబుతున్నాయి.

డాక్టర్ వెన్స్‌చెక్ అనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆశ్రమంలో కొన్నిరోజులు ఉన్నారు. ఆ సమయంలో ధ్యానం చేసిన తర్వాత కూడా, మనసుపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దీనిని తెలుసుకోవడం కోసం..డాక్టర్ వెన్స్‌చెక్ 10 మంది విద్యార్థులపై 8 వారాల పాటు పరిశోధన చేశారు. దీనిలో ధ్యానంపై పరిశోధనకు ముందు విద్యార్థుల మనస్సు కుదురుగా లేదని .. పరిశోధన తర్వాత, మెదడులో ఏకాగ్రత పెరిగినట్లు గుర్తించారు.

ఎలా ధ్యానం చేయాలి..

నిజానికి ఎలా ధ్యానం చేయాలి? దీన్ని ఎలా ప్రారంభించాలి? నేలపై కూర్చోవాలా? ఏదైనా మంత్రం జపించాలా? ఇలా చాలా ప్రశ్నలు అందరికీ వస్తాయి. మెడిటేషన్ చేయడానికి ఎలా సౌకర్యంగా అనిపిస్తే, అలా చేయడం మంచిది. ముందుగా శ్వాసమీద ధ్యాస పెట్టడం, మీకు నచ్చిన ప్రదేశాన్ని కళ్ల ముందు ఊహించుకోవడం, ఓంకారాన్ని స్మరించడం ఇలా ఎలా అయినా మనసును కంట్రోల్ లోకి తీసుకోవాలి. ధ్యానం ప్రారంభించినపుడు చాలా సాధన అవసరం. ఇది అందరికీ కష్టంగా ఉంటుంది. జిమ్ కు వెళ్లిన మొదటి రోజే పది కిలోలు బరువు తగ్గలేం కదా..అలాగే ధ్యానం మొదలు పెట్టిన ఒక్కరోజులోనే ఏకాగ్రత కుదరదు. కానీ ఒక్కసారి కాన్ససన్ ట్రేషన్ కుదిరి మెడిటేషన్ రుచి చూసారంటే ఇక జీవితంలో ధ్యానాన్ని విడిచిపెట్టలేరు.

ధ్యానం వల్ల ఉపయోగాలు..

మెడిటేషన్ చేయడం వల్ల ఇప్పుడు జరిగే వాటి మీద ఫోకస్ చేయడం.. నెగటివ్ ఎమోషన్స్‌ని దూరం చేసుకోవడం ఈజీ అవుతుంది. క్రియేటివిటీని పెంచడమే కాకుండా.. ఇమేజినేషన్‌ పవర్ ని కూడా పెంచుతుంది. ప్రతి రోజూ మెడిటేషన్ చేయడం వల్ల సహనం పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన స్కిల్స్ ఏర్పడతాయి. వీటి వల్ల కెరీర్ లో ముందుకు వెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. హృదయ సంబంధిత సమస్యలు, హైబ్లడ్ ప్రెషర్, నిద్రలేమి సమస్యలు, టెన్షన్, యాంగ్జైటీ మొదలైన వాటిని తగ్గించడంలో మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు మానసికంగా ప్రశాంత దొరకడంతో ముఖంపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. నేచురల్ ఫేషియల్ లా పనిచేసి ఫేస్ లో గ్లో పెరుగుతుంది.

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా లేదా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడేవాళ్లకి మెడిటేషన్ చేయడం వల్ల ఎంతో ఉపయోగముంటుంది. అయితే వీళ్లు నిపుణుల సహాయంతో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి.