-
ఇది కథకాదు గుండెను మెలితిప్పే వ్యధ
-
ఢిల్లీలో 19 బాంబు పేలుళ్లు, 50మంది మృతులు
-
35 కేసులు,150 అబద్ధపు సాక్ష్యాలు
-
చేయని నేరానికి కఠిన కారాగార శిక్ష
-
థర్డ్ డిగ్రీకి మించిన చిత్రహింసలు
-
ముడ్డిలో పెట్రోల్ పోసి…అంగానికి కరెంట్ షాక్
-
14ఏళ్లజైలు తర్వాత నిర్ధోషిగా విడుదల
-
ఇది శత్రువులు కూడా అనుభవించకూడని నరకం
మేమూ మనుషులమే… ఈ వాక్యాన్ని మళ్లీ చదవండి. మేమూ మనుషులమే అనుకునేవారు మాత్రమే కాదు మనసున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన నిజ జీవితకథ ఇది. కథ అంటే కల్పించి రాస్తున్నది కాదు. అబద్దాలకు కలరింగ్ వేసి నిజాలనే పూత పూయించి మార్కెట్లోకి తీసుకువచ్చి అమ్మే ముడి సరుకు కాదు. ఇది తడి ఉన్న గుండెను మెలిపెట్టే కథ… గుండె గదులను బరువెక్కించే కన్నీటి వ్యధ. అందుకే మళ్లీ చెబుతున్నాను. ఇది మనుషులు చదవాల్సిన కథ. మనసున్న మనుషులు చదివితీరాల్సిన వ్యధ.

#ఆ అవకాశం నాకెలా వచ్చిందంటే?
సరిగ్గా రెండేళ్ల క్రితం… 99టీవికి నేను Output Editorగా పనిచేస్తున్న రోజులు. సూపర్ ప్రైమ్ టైమ్ 9PM బులెటిన్‌ను ప్లాన్ చేస్తున్న సమయంలో మిత్రుడి నుంచి ఫోన్ కాల్. ప్రఖ్యాత “సియాసత్” అనే ఉర్ధూ దినపత్రికలో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న సిరాజ్ అనే మిత్రుడి కాల్ అది. నాకు ఒక సహాయం చేయాలి. చివరి ప్రయత్నంగా నీకు కాల్ చేసాను, ఒక ఇంటర్వ్యూ నువ్వు చేయాలి, నువ్వే చేసి తీరాలి అనేది సిరాజ్ ఆదేశం. సరే చేస్తాను, వివరాలు చెప్పు అని అడుగుతున్నా సరే వినిపించుకోవట్లేదు సిరాజ్. ముందు నాకు మాట ఇవ్వు సాధు. అప్పుడే వివరాలు చెబుతానని బలవంతపెడుతున్నాడు. ఏదైనా అవసరం ఉంటే తప్పితే కాల్ చేయని సిరాజ్ అలా పట్టుపట్టేసరికి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తానని మాట ఇచ్చాను. నమ్మకం కుదిరిందో ఏమో… అప్పుడు చెప్పాడు Framed As Terrorist అనే పుస్తక రచయిత మహ్మద్ అమీర్‌ఖాన్‌ను ఇంటర్వ్యూ చేయాలని… సిరాజ్ మాటలు విన్న నాకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే అప్పటికే మహ్మద్ అమీర్‌ఖాన్ గురించి నేను చదివి ఉన్నాను. 14ఏళ్లు జైల్లో ఉండి వచ్చిన “ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్”, “ముంబై బాంబు పేలుళ్ల మాస్టర్ మైండ్” అనే ట్యాగ్ లైన్స్ తగిలించుకున్న అమీర్‌ఖాన్ ప్రయాణం, ప్రస్ధానం అంతా తలకెక్కించుకున్నాను. అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయాలని సిరాజ్ అడగగానే కాస్త స్టన్ అయినప్పటికి…వెంటనే ఓకే చెప్పేసాను.

#నేను మాత్రమే ఎందుకు?
ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, టెర్రరిస్ట్ అంటూ నేషనల్ మీడియా కొన్నాళ్లు గగ్గోలు పెట్టిన వ్యక్తే మహ్మద్ అమీర్‌ఖాన్. అలాంటి వ్యక్తి 14ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి వస్తే సాధారణంగా మీడియా ఎగబడాలి కదా? ఇంటర్వ్యూలు నేను చేస్తానంటే నేను చేస్తానంటూ రిపోర్టర్లు కొట్టుకోవాలి కదా? అలా ఎందుకు ఇక్కడ జరగలేదు? పరిటాల రవిని చంపానంటూ ప్రకటించుకున్న మొద్దుశీనును ఇంటర్వ్యూ చేసి కాలర్ ఎగరేసుకున్న ఛానల్స్ నుంచి రేప్ నిందితులను ఎన్కౌంటర్ చేయాల్సిందే అని కాలమ్స్ రాసే న్యూస్ పేపర్ల వరకు ఎందుకని మహ్మద్ అమీర్‌ఖాన్ ఇంటర్వ్యూ చేయట్లేదు? అప్పటికే చేసేసారా, అందరూ చేసిన తర్వాతే నాకు ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చిందా? నేను కాల్ చేస్తే తప్పితే టచ్‌లోకి రాని సిరాజ్ ఎందుకని మాట తీసుకుని మరీ ఇంటర్వ్యూ చేయాలని అడిగాడు.. ఎన్నో సందేహాల మబ్బులు, మరెన్నో ప్రశ్నాస్త్రాలు కాసేపు నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసాయి. తెలుగు మీడియాలో వేరే ఎవరూ చేయని సాహసాన్ని నేను మాత్రమే ఎందుకు చేసానో, అంత హై రిస్క్ ఎందుకు తీసుకున్నానో తెలుసుకునే ముందు “పగవాడికి కూడా రాకూడదని కోరుకునే నరకం” మహ్మద్ అమీర్‌ఖాన్ వ్యధ చదవండి.
#కళ్లతో కాదు మనసుతో చదివితీరాల్సిందే..!
అది 1996 డిసెంబర్-1997 అక్టోబర్ మధ్య కాలం. అక్టోబర్ 26 సాయంత్రం 7 గంటలకు దేశరాజధాని ఢిల్లీలోని హర్ దయాళ్ సింగ్ రోడ్డు మీద కరోల్ బాగ్‌లో రోషన్ డి కుల్ఫీ వద్ద బాంబు పేలింది. ముక్కలుగా తెగిపడిన దేహాలు, పదుల సంఖ్యలో బాధితులు. 1996 డిసెంబర్ నుంచి 1997 అక్టోబర్ మధ్య కాలంలో మొత్తంగా 19 చోట్ల బాంబులు పేలాయి. కట్ చేస్తే 1998, 27 ఫిబ్రవరిన అంటే…దాదాపు నాలుగునెలల తరువాత FIR నమోదు చేసారు ఢిల్లీ పోలీసులు. మరి… బాంబుపేలుళ్లతో సంబంధం ఉన్న వారినే అరెస్ట్ చేసారా అంటే అదీ లేదు. ఒక అమాయకుడు, ఒక నిర్భాగ్యుడిని అరెస్ట్ చేసారు. అతడే మహ్మద్ అమీర్‌ఖాన్. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి టాబ్లెట్స్ తీసుకు వచ్చేందుకు రాత్రి సమయంలో వెళ్తున్నఅమీర్ఖాన్ను కిడ్నాప్ చేసింది ఒక గ్యాంగ్. నోరు మూసేసి, జీపులోకి తోసేసి, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకుపోయిందా గ్యాంగ్. కాసేపటికి తెలిసింది అమీర్‌కు…. వాళ్లు సుపారీ తీసుకుని కిడ్నాప్ చేసే గ్యాంగ్ కాదు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అని.

#ముడ్డిలో పెట్రోల్ పోసి…మర్మాంగానికి కరెంట్ షాక్
ఆ రాత్రి నుంచి మహ్మద్ అమీర్‌ఖాన్‌కు నరకం అంటే ఏమిటో చూపించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మీరు ఎవరో అనుకుని ఎవరినో తీసుకువచ్చినట్లు ఉన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని మొత్తుకుంటున్నా సరే వినలేదు. ఢిల్లీ బాంబుపేలుళ్లకు నువ్వే మాస్టర్ మైండ్, నీకు పాకిస్ధాన్‌తో కాంటాక్ట్స్ ఉన్నాయి. నువ్వు ISI తీవ్రవాదివి అంటూ ఆరోపించారు. అంతే కాదు పచ్చిబూతులతో విరుచుకుపడ్డారు. నేరం ఒప్పుకోమంటూ వేధించారు. మనిషి అనే దయ లేకుండా కొట్టారు. బూటుకాళ్లతో తన్నారు. గుండు సూదులతో గుచ్చారు. గోళ్లు పీకారు. అమీర్ దేహానికైన గాయాల నుంచి నెత్తురు కారుతున్నా కనికరించలేదు. పైగా గాయాలమీద ఐస్ ముక్కలు పెట్టారు. పచ్చి మిరపకాయలను చీల్చి..ఆ రసాన్ని గాయాల్లో కూరారు. దాహం దాహం అని మూలుగుతుంటే నోట్లో ఉచ్ఛ పోసారు. సర్ఫ్ కలిపిన నీళ్లను తాగించారు. అంగానికి కరెంట్ షాక్ ఇచ్చారు. తలకిందులుగా వేలాడదీసి ముడ్డిలో పెట్రోల్ పోసారు. అలా వెళ్లిన పెట్రోల్… పేగులను నిలువునా చీల్చేసింది. అయినా సరే అమీర్‌ఖాన్ నేరం ఒప్పుకోలేదు. అంతగా వేధిస్తున్నాసరే దయచేసి నన్ను వదిలేయండి, నాకే పాపం తెలియదు అంటూ కన్నీళ్లు ఇంకెలా వేడుకున్నాడు.
#ఎందుకు అమీర్‌ఖాన్ మాత్రమే టార్గెట్?
అమీర్‌ను అనధికారిక కస్టడీలోకి తీసుకున్న 6నెలలకు అధికారికంగా ప్రకటించారు పోలీసులు. అమీర్‌ఖాన్ “ఢిల్లీ పేలుళ్లకు మాస్టర్ మైండ్”, ది “మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్” అంటూ ప్రెస్‌మీట్ పెట్టేసారు ఢిల్లీ పోలీసులు. పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాది అంటూ అమీర్‌ఖాన్ ను చూపించారు. అంతే.. అప్పటి వరకు కళ్లనే భూతద్దాలుగా చేసుకున్న అమీర్‌ఖాన్ కుటుంబసభ్యుల గుండెల్లో బాంబు పేలినట్లైంది. యా అల్లా, ఇంత ఘోరమా అంటూ కుప్పకూలిపోయారు అంతా. కానీ వారి ఆవేదనను ఈ సమాజం పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని వ్యక్తిగా కంటే… వేరేకోణంలో ఈ సమాజం చూస్తుంది. ముందు అతను లేదా ఆమె మతాన్ని చూస్తుంది. నిందితులు హిందువైతే వారి కులం పరిగణిస్తాం. కేవలం కులమతాల ఆధారంగా మాత్రమే నేరాన్ని మోపేస్తాం. సరిగ్గా అదే రీతిలో అమీర్‌ఖాన్ నిందితుడు అనే సరికి అందరూ నమ్మేసారు. ఎందుకంటే అతను ముస్లిం కనుక. చిత్రహింసలు పెట్టి, వందలాది తెల్లకాగితాల మీద, డజన్లకొద్దీ డైరీల మీద సంతకాలు తీసుకుని తప్పుడు కేసుల్లో అమీర్‌ఖాన్‌ను ఇరికించారు ఢిల్లీ పోలీసులు. 150 మంది చేత దొంగ సాక్ష్యాలు చెప్పించి, తప్పుడు ఉత్తరాలు సృష్టించి, 19 చోట్ల బాంబులు పెట్టాడనే ఆరోపణలతో 14ఏళ్లు జైల్లో నిర్భంధించారు.
#ఇంతకీ అమీర్ చేతులకు నెత్తురు అంటుకుందా లేదా?
అమీర్ యవ్వనం అంతా జైల్లోనే గడిచింది. ఇలా అనటం కంటే….చీకటిగదుల్లో, ఇనుప ఊచల వెనుక, ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకదశ మగ్గిపోయింది,ముగిసింది అనటం సబబు. ఎందుకంటే ఆరోపణలు మోపిన ఢిల్లీ పోలీసులు .. అమీర్‌ఖాన్… మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని నిరూపించేందుకు మాత్రం బలమైన సాక్ష్యాలు చూపించలేకపోయారు. దీంతో 19 కేసుల నుంచి అమీర్‌ఖాన్‌కు విముక్తి లభించింది. 14ఏళ్ల తర్వాత అంటే 2012లో విడుదల అయ్యాడు అమీర్‌ఖాన్. ఒక్కసారిగా జైలు వెలుపల ఉన్న అసలు సిసలైన ప్రపంచాన్ని చూసేసరికి ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. కానీ జైలు జీవితం నేర్పిన పాఠంతో అమీర్ పరిపూర్ణ మానవుడయ్యాడు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆశయంతో అనేక స్వచ్ఛంధ సంస్ధలతో చేతులు కలిపాడు. హక్కుల సంఘాలతో కలిసి అభాగ్యుల కోసం, బాధితుల కోసం పోరాడుతున్నాడు. న్యాయసూత్రాలకు లాకప్‌లో పోలీసులు, కోర్టుల్లో కొందరు మెజిస్ట్రేట్లు ఎలా తిలోదకాలు ఇస్తారో, ఎలా న్యాయానికి కర్మకాండలు నిర్వహిస్తున్నారో తెలియచెప్పాలనుకున్నాడు. తన కథను, వ్యథను అంతా కలిపి FRAMED AS A TERRORIST అనే పుస్తకం రాసాడు అమీర్‌ఖాన్.

#అమీర్‌ఖాన్ కదా హీరో… మరి నేనెవరు?
14ఏళ్లు జైలు నిర్భంధం తరువాత, నిర్ధోషిగా విడుదలైన తర్వాత నార్త్ మీడియా అమీర్‌ఖాన్‌ను ఇంటర్వ్యూ చేసింది. అమీర్‌కు జరిగింది అన్యాయం అని ఘోషించింది. తమ డిపార్ట్మెంట్ పరువును నడిరోడ్డుకు ఈడుస్తున్నట్లుగా ఉండటంతో, ఒక అభాగ్యుడి జీవితాన్ని తమ డిపార్ట్మెంట్ ఎలా నాశనం చేసిందనే దుర్మార్గాన్ని చూపిస్తుండటంతో అలర్ట్ అయ్యారు ఢిల్లీ పోలీసులు. అమీర్‌ఖాన్ ఇంటర్వ్యూలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీస్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమీర్‌ఖాన్‌తో ఇంటర్వ్యూలు చేసిన వారి మీద కేసులు పెట్టారు కూడా. అప్పటి నుంచి అమీర్‌ఖాన్ అంటేనే యావత్ మీడియా అంటరానితనం పాటిస్తోంది. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు అమీర్‌ఖాన్. ప్రఖ్యాత నల్సార్ యూనివర్సిటీలో ఒక సెమినార్‌కు చీఫ్ గెస్ట్ అతడు. ఉత్తరాదిలో అందరికి దక్షిణాదిలో కొందరికి మాత్రమే తెలిసిన అమీర్ గాధను తెలుగుమీడియా ద్వారా కోటానుకోట్లమందికి తెలియచేద్దామనుకున్నారు నిర్వాహకులు. కానీ ఇక్కడా అదే పరిస్ధితి. అమీర్‌ఖాన్ ఇంటర్వ్యూలు చేస్తే ఊరుకునేది లేదని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA అనధికార హెచ్చరికలు జారీ చేసిందని విన్నాను. అందుకే వేరెవ్వరూ అమీర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుసుకున్నాను. ఛాలెంజ్ తీసుకోవటమే జర్నలిజం కనుక… ఏదైనా సరే, ఏమైనా సరే అమీర్‌ఖాన్ అంతరంగాన్ని ఆవిష్కరించాల్సిందేనని డిసైడ్ అయ్యాను. అలా రెండేళ్ల క్రితం “కన్నీటి వ్యథ” అనే టైటిల్‌తో మహ్మద్ అమీర్‌ఖాన్ ఇంటర్వ్యూ చేసాను. అప్పుడు మాత్రమే కాదు ఇప్పటి వరకు దక్షిణభారతదేశంలో ఎవరూ అమీర్‌ఖాన్‌ను ఇంటర్వ్యూ చేసే ధైర్యం చేయలేదు. NIA,టాస్క్‌ఫోర్స్ పోలీసుల హెచ్చరికలు ఆ రేంజ్లో ఉన్నాయి మరి.
#వెంటాడే పోలీసులు, వేధించే కేసులు
అమీర్‌ఖాన్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యాక…మీడియా మిత్రులు అంతా నా సేఫ్టీ గురించి బాధపడ్డారు. ఇక విజయ్ సాధు పని అయిపోయింది, వాడిని తీహార్ జైలుకు తరలించండం పక్కా అంటూ సంబురాలు చేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు విమర్శకులు, శత్రువులు. 99టివీ ఛైర్మన్‌ను కూడా భయపెట్టారు. బీ కూల్ బాస్.. ఏదైనా సరే నేను ఫేస్ చేస్తానని భరోసా ఇచ్చినా సరే ఆయన టెన్షన్ పడుతూనే ఉన్నారు. నా మొబైల్ నెంబర్ ట్యాపింగ్‌లో ఉంచారని తెలుసుకున్నాను. నా కదలికలపైన నిఘా ఉంచారు. నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్నారు. తన డ్యూటీ తను చేసే జర్నలిస్ట్ వద్ద ఏముంటుంది? ఏం దొరుకుతుంది చెప్పండి. ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకుంటే మంచిది అనే సున్నిత హెచ్చరికలు 99టీవీ ఛైర్మన్‌కు వచ్చాయంతే. అలా ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ది మాస్టర్ మైండ్ ఆఫ్ ఢిల్లీ బ్లాస్ట్స్ అనే బ్రాండింగ్ మోపబడి, 14ఏళ్లు జైలులో మగ్గిపోయి, కడిగిన ముత్యంగా బయటకు వచ్చిన ఒక అమాయక ముస్లిం అమీర్‌ఖాన్‌ను ఇంటర్వ్యూ చేసిన ఘనత సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు నాకు మాత్రమే దక్కింది. ఇది ఒకింత గర్వమే అయినా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నందుకు గర్వాన్ని మించిన ఆత్మసంతృప్తి. టూ ది పాయింట్.. ఇప్పుడు అమీర్‌ఖాన్ ఎపిసోడ్ అంతా ఎందుకు రాసానంటే…. మూడేళ్ల క్రితం ఇంగ్లీష్‌లో వచ్చిన మహ్మద్ అమీర్‌ఖాన్ ఆత్మకధ “FRAMED AS A TERRORIST” ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడు అతి త్వరలో “తీవ్రవాది ముద్ర” అనేపేరుతో తెలుగులో అనువాదం అయి, మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ కొద్దిపాటి సంతోషాన్ని నిన్న నాతో పంచుకున్నాడు అమీర్‌ఖాన్. తీవ్రవాది ముద్ర అనే పుస్తకం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో కొంత బాలకార్మిక వ్యవస్ధను నిర్మూలన కోసం పనిచేస్తున్న NGOలకు విరాళంగా ఇద్దామని డిసైడ్ అయినట్లు చెప్పాడు. ఎంత సంతోషం వేసిందో ఈ మాట వినేసరికి.. మీరంతా మనసున్నవాళ్లు, అందుకే అతి త్వరలో విడుదల కాబోయే “తీవ్రవాది ముద్ర” పుస్తకాన్ని కొని చదవండి, ఎందుకంటే డిల్లీలో మాత్రమే కాదు యావత్ దేశంలో పోలీసు, న్యాయవ్యవస్థ ఎంత దారుణంగా ఉందో సాక్ష్యాలతో సహా రుజువు చేసే పుస్తకం ఇది కనుక.. By విజయ్ సాధు ( Editor In Chief)