వీళ్లకి కలబంద మంచిది కాదట..

Aloe vera is not good for them

 

ఒకప్పుడు కలబంద ప్రతి ఇంటి ముందు ఉన్నా దాని ప్రయోజనాలు తెలియక చాలామంది వాడేవారు కాదు. కానీ ఇప్పుడు చాలామంది ప్రత్యేకంగా అలొవేరాను పెంచుకుంటున్నారు. కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మం.. జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ కలబంద బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు అధికంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం కలబందను అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

అలొవెరాలో కెరోటిన్‌, సి, ఇ, బి విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాల నివారణకు అలొవెరాను ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడమే కాకుండా.. ముడతలు, మొటిమలు.. జుట్టు రాలడం.. చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇక శరీరంలో అధిక వేడి ఉన్నవారు రోజూ కలబంద జ్యూస్ ను తీసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ శ్రుతిమించి తీసుకుంటే కూడా ప్రమాదమేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నవారు కలబందను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలట. అలాగే… కొన్ని వ్యాధులు ఉన్నవారు అస్సలు తీసుకోవద్దని అంటున్నారు.

గర్భిణీలు కలబందను అస్సలు తినకూడదు. ఇది గర్భాశయ సంకోచాలతో సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భస్రావం, పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా కలబందను తీసుకోవద్దు. ఇది మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. అలాగే.. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కలబందను అస్సలు తీసుకోవద్దు. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు కలబందకు దూరంగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు కలబంద తీసుకుంటే సమస్య మరింతే పెరుగుతుంది.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కలబంద తీసుకోవద్దు. ఒక వేళ తినాలనుకుంటే ముందుగా డాక్టర్ సలహాలు తీసుకోవాలి. కొన్నిసార్లు దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం మరింత ఆడ్రినలిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, హృదయ స్పందన సక్రమంగా లేని సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.