అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు చెయ్యెత్తి మొక్కాల్సిన సామాన్యుడు

An YoungGuy Teaching a Lesson to Hungry

 

  • నిండా 30ఏళ్లు లేని ఆపద్భాంధవుడు

  • ఆకలికి గుణపాఠం నేర్పుతున్న యువవ్యాపారవేత్త

  • చిక్కని చీకటిలో అన్నం ప్యాకెట్లతో పరుగులు

  • సేవ చేయటమే తప్ప పబ్లిసిటీ కోరుకోని రెస్టారెంట్ ఓనర్

  • మహ్మద్‌ నూరుద్దీన్ మధిర తరపున మా సలామ్‌

మనుషులు అన్నిచోట్లా ఉంటారు. మన మనుషులు కొన్ని చోట్ల ఉంటారు. కానీ మనసున్న మనుషులు మాత్రం మట్టిలో మాణిక్యాలే. భూతద్దం వేసి వెతికినా, అంజనం గీసి వెతుకులాడినా దొరికేది కొందరే.అలాంటి ఒక వాట్స్‌ యాప్ తరం స్ఫూర్తిపాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 10 రూపాయలు సహాయం చేసినట్లు కలరింగ్ ఇచ్చి 10వేల రూపాయలు విలువ చేసే ఫ్రీ పబ్లిసిటీ కోసం అర్రులు చాచే “అర్భకులు” ఉన్న ఈరోజుల్లో…. కెమెరాకన్నుకు చిక్కకుండా తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్న ఒక యువకుడి దాతృత్వాన్ని ఒకసారి మనసుతో చదువుకుందాం.

We Love You మహమ్మద్ నూరుద్దీన్
We Love You మహమ్మద్ నూరుద్దీన్

#శివారున రెస్టారెంట్…అయితేనేం ఊరంతటికి ఆపన్నహస్తం

“మహమ్మద్‌ నూరుద్దీన్‌” ఇలా చెబితే ఎవరు ఇతను? అంటూ ప్రశ్నించవచ్చు కానీ “ప్యారడైజ్‌ రెస్టారెంట్ ఓనర్‌” అని చెబితే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. మధిర మార్కెట్ యార్డుకు సమీపంలో తలెత్తుకున్న “ప్యారడైజ్‌ రెస్టారెంట్” సరిగ్గా సంవత్సరం క్రితం ప్రారంభమైంది. వరల్డ్ ఫేమస్‌ అయిన “హైదరాబాద్ ప్యారడైజ్‌” అని పేరు పెడితే సరిపోతుందా? ఆ స్ధాయిలో బిర్యానీ టేస్ట్ ఉంటుందా? ఇదంతా ఎందుకు అండి.. అసలు ఈ కంపులో ఇక్కడ రెస్టారెంట్ నడుస్తుందా?అని ఎగతాళి చేసిన వారు లెక్కలేనంత మంది. కానీ ప్రారంభించిన కొన్నిరోజుల్లోనే… “వాహ్‌ సూపర్ టేస్ట్ గురూ” అంటూ బిర్యానీ ప్రేమికులు, నాన్‌ వెజ్‌ ప్రియులు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు అంటే దానికి ఏకైక కారణం మహమ్మద్ నూరుద్దీన్‌ అలియాస్ పండు. ఇదేంటి సేవ, ఆపన్నహస్తం అంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు ప్యారడైజ్‌ రెస్టారెంట్ గురించి బ్రాండింగ్ చేస్తున్నారనే సందేహం మీకు వస్తే…… విజయగర్వం నెత్తికెక్కాక పునాదిని మర్చిపోకూడదు అనేదే సమాధానం. విమర్శలను తట్టుకుని, నిందలను ఎదిరించి ఎదిగిన తత్వం నిండా 30ఏళ్లు కూడా లేని మహమ్మద్‌ నూరుద్దీన్ అలియాస్ పండు సొంతం. అందుకే “నిలబడలేవు అన్న చోటే కస్టమర్లు తలెత్తుకుని చెప్పుకునేలా” చేసాడు. విజయాన్ని వెంటేసుకు తిరుగుతున్నా సరే ఎక్కడా గర్వం లేకుండా, ఇగో తనకు ఇంచ్‌ దూరంలో లేకుండా జాగ్రత్త పడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సహాయం చేయటమే తెల్సిన వ్యక్తిత్వం
సహాయం చేయటమే తెల్సిన వ్యక్తిత్వం

#చీకటి పడితే చాలు చివుక్కుమనే మనస్సు..!

తన రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు తృప్తిగా భోంచేస్తే, లొట్టలు వేసుకుంటూ బిర్యానీని ఆరగిస్తే నూరుద్దీన్‌ పొంగిపోతాడు. ఫుడ్‌ చాలా బావుంది బాస్‌ అంటూ కితాబిస్తే వినయంగా తీసుకుంటాడు. ఎందుకో తెలుసా “కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్” అసలు సిసలైన ప్రొగ్రెస్ రిపోర్ట్ అని తెలుసుకున్నవాడు కనుక. ప్రశంసలు అందుకుని కాలర్‌ ఎగరేయని వ్యక్తిత్వం ఇతనిది. సంపాదనలో కొంత భాగమైనా సరే సమాజానికి ఉపయోగపడాలి, పడి తీరాల్సిందే అని బలంగా నమ్మే వ్యక్తిత్వం మహమ్మద్‌ నూరుద్దీన్‌ సొంతం.అందుకే చిక్కటి చీకటి కమ్మేస్తున్నప్పుడు పేదల కడుపును కోసే “ఆకలి కొడవలి” కోత ఇతడిని మెలిపెడుతుంది. ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న కొన్ని ఫుడ్ ప్యాకెట్లు, మరికొన్ని బిర్యానీ ప్యాకెట్లను బ్యాగ్‌లో నింపుకుని వెళ్లిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు, ఎవరికోసం బయలుదేరాడో అడిగినా చెప్పడు. చిన్న చిరునవ్వుతో బదులిచ్చేసి.. తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఏ అభాగ్యులను అయితే ఆకలి వేధిస్తుందో, రోజు పూర్తి అయ్యే ఘడియల్లో ఎవరైతే ఖాళీ కడుపు తోడుగా నిద్రతో యుద్ధం చేస్తుంటారో..అలాంటి అన్నార్తుల వద్దకు ఒంటరిగానే వెళ్తాడు నూరుద్దీన్‌. వారి నుంచి కృతజ్ఞతలు కూడా ఆశించకుండా…సహాయం చేసి వీడ్కోలు తీసుకునే సింప్లిసిటీకి చిరునామా మన మధిర ప్యారడైజ్ రెస్టారెంట్ యజమాని మహమ్మద్ నూరుద్దీన్‌.

మధిర ప్యారడైజ్ రుచికి ఫిదా అయిన బిర్యానీ లవర్స్!
మధిర ప్యారడైజ్ రుచికి ఫిదా అయిన బిర్యానీ లవర్స్!

#పబ్లిసిటీకి చోటు ఇవ్వడు..ప్రేమకు లొంగిపోతాడు!

దుబాయ్‌ లో ఉద్యోగం వదులుకుని వచ్చిన “మహమ్మద్‌ నూరుద్దీన్‌” మధిరలో రెస్టారెంట్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. అనుకోని అవాంతరాలు, లెక్కలేనన్ని విమర్శలు ముప్పేటదాడి చేసాయి. గెలిస్తే పదిమందికి సహాయపడదాం లేదంటే ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుందామని అనుకున్నాడట మహమ్మద్‌ నూరుద్దీన్‌. గెలుపు దరి చేరకపోయినా సరే ఏడాది నుంచి అభాగ్యులు, కష్టజీవుల ఆకలి తీరుస్తూనే ఉన్నాడు. అయినా సరే ఎవరికి చెప్పడు, చెప్పుకోడు, చెప్పలేదు కూడా. నిజం చెప్పాలంటే తన స్నేహితుల్లో కూడా…ఇతను చేసే సహాయం చాలా మందికి తెలియదు. తెలిసిన వారు, తెలుసుకున్న వారు బయటకు చెబితే ఊరుకోడు. ఎందుకో తెలుసా…ఇది మన బాధ్యత అంటాడు, మంచి బట్టలు,కోరుకున్న తిండి, సకల సదుపాయాలు మన కాళ్లముందు ఉన్నాయి, లేని వారికి మనవంతు సహాయం చేయటం తప్పనిసరి బాధ్యత అంటాడు. అయినా నేను చేసే సహాయం ఒక చిన్న ఇసుకరేణువంత అంటూ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని… అప్పుడే పుణికి పుచ్చుకున్న వ్యక్తి నూరుద్దీన్‌. వ్యక్తి కాదు మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం మధిర మణిమాణిక్యం మన “మహమ్మద్‌ నూరుద్దీన్‌”

#విమర్శకు ధైర్యం…ప్రశంసకు మనసు ముఖ్యం

నిజంగా నిజం మాట్లాడుకుంటే ఇలా రాస్తున్నామని మహమ్మద్‌ నూరుద్దీన్‌కు తెలియదు. తెలిస్తే ఎక్కడ రాయనివ్వడో అనే సందేహం, మంచి గురించి మనకు తెలిసినా రాయకపోతే అది ద్రోహం. అందుకే మంచికి, మనసున్న మనిషికి, మహోన్నత వ్యక్తిత్వానికి అక్షరరూపం ఇచ్చాం. తను ఎంత సహాయం చేస్తాడో తన వారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్న నిండు మనిషికి మా అక్షరాలతో సలామ్‌ చెప్పాం. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్న కష్టకాలంలోనూ, కాలం పగపట్టి వేటాడుతున్న విపరీత పరిస్ధితుల్లోనూ…తనకు లేకున్నా ఆపదలో ఉన్నవారికి సహాయపడిన సంధర్భాలు సాక్ష్యాలతో సహా తెలిసినా….తన అనుమతి తీసుకోకుండా రాయటం సరికాదని తలవంచుతున్నాం..పట్టెడన్నం పెట్టే వ్యక్తులకు మాత్రమే కాదు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనసులకు చేతులెత్తి నమస్కారం చేస్తుంది Journo Team….వీలు చేసుకుని “మహమ్మద్‌ నూరుద్దీన్‌”ను అభినందిస్తారని,మీ ప్రేమతో ప్రోత్సహిస్తారని ఆశిస్తూ…..Vijaysadhu (Editor in Chief)