రేపే ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీపై క్లారిటీ..!

AP cabinet meeting tomorrow Clarity on assembly

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ వర్షాకాల సమావేశాలపై తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 5 లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేశాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి అలాంటి విమర్శలు రాకుండా జగన్ సర్కార్ ముందు జాగ్రత్త పడుతోంది. ఈ నెల 23 నుంచి 5 లేదా 10 రోజుల పాటు శాసనసభా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.

ప్రస్తుతం జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇందుకోసం పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఇప్పటికే అన్ని పత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీటిని సభలోనే సమాధానం ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇక వర్షాల వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇప్పటికే జనసేన పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. వీటికి కూడా సభలో వివరణ ఇవ్వనుంది జగన్ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రతిపక్షం చేసే విమర్శలకు సభలో ఘాటుగా బదులివ్వాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోయాయి. అలాగే ప్రేమోన్మాదుల చేతుల్లో యువతులు బలవుతున్నారు. ఇలాంటి వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని… అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించేలా రేపటి మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు జగన్. ప్రస్తుతం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. అయితే కొవిడ్ కారణంగా పాఠశాలల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇక తెలంగాణ రాష్ట్రంతో ఉన్న జల జగడం, విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ సర్కార్ నీటి వాడకం, ఏపీ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు అడ్డుకునేందుకు తెలంగాణ చేస్తున్న ఫిర్యాదులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

వీటితో పాటు ఇప్పటికే శాసనమండలి చైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంది. ఇప్పటికే ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నప్పటికీ… కేవలం నలుగురి పేర్లు మాత్రమే సీఎం జగన్ దృష్టిలో ఉన్నాయి. వారికి మాత్రమే ఛాన్స్ దక్కుతుందని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ… మంత్రివర్గ సహచరుల అభిప్రాయం కూడా జగన్ తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.