ఏపీకి రాజధాని ఏదీ.. అసలేం జరుగుతోంది..?

AP Capital Latest News
AP Capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదీ. ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరైనా సరే తెలంగాణ రాజధాని ఏదీ అంటే హైదరాబాద్ అనేస్తారు. అలాగే తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, ఒడిశాకు భువనేశ్వర్, మహారాష్ట్రకు ముంబై.ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం… అసలు రాజధాని అంటే… అదేమిటీ అనేలా పరిస్థితి మారిపోయింది. అవును నిజమే… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ అనేది ఎవరికీ తెలియటం లేదు. రికార్డుల పరంగా మాత్రమే ప్రస్తుతానికి అమరావతి ఉంది. కానీ అది కూడా ఎంత కాలం ఉంటుందో అర్థం కాని పరిస్థితి.

2014లో నవ్యాంధ్రలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం… ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం విజుయవాడ, గుంటూరు మధ్యలోని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. ఇందుకోసం 33 వేల ఎకరాలను కూడా చంద్రబాబు సర్కార్ సేకరించింది. అందులో శాశ్వత నిర్మాణాలకు భారీ ప్రణాళిక రూపొందించింది. అలాగే పరిపాలన కోసం తాత్కాలిక భవనాలను నిర్మించింది. హైకోర్టు, శాసనసభ, మండలి, సచివాలయం నిర్మించేసి అందులో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ రాష్ట్రంలో రాజధాని విషయంలో గందరగోళానికి తెరలేపింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలని సీఎం జగన్ ప్రతిపాదించారు. అంతే నాటి నుంచి అమరావతి ప్రాంత రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేస్తూనే ఉన్నారు. అటు ఇదే విషయంపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు కూడా నడుస్తున్నాయి.

అయితే తాజాగా కేంద్ర ఇంధన శాఖ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం… మరోసారి ఉత్కంఠకు తెరలేపింది. కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు… సమాధానం ఇచ్చిన కేంద్ర ఇంధన శాఖ… రాష్ట్రాలు, రాజధానులు అంటూ ఓ జాబితాను విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ పక్కన వైజాగ్ అని ముద్రించారు. అసలు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా, గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకుండా… ఇలా ఎలా ముద్రిస్తారని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో… వెంటనే మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అది కేవలం ముఖ్య నగరాల జాబితా మాత్రమే అని వెల్లడించింది. కానీ ఇప్పుడు కేంద్ర ఇంధన శాఖ రిలీజ్ చేసిన జాబితాను పట్టుకుని… వైసీపీ నేతలు మరింత దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి కేంద్రం కూడా అంగీకారం తెలిపిందని… త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వాట నిజమవుతుందో.. లేదో చూడాలి మరి.