ఇంతకీ ఎవరీ ప్రత్యేక ఆహ్వానితులు…?

AP High Court Suspends GO on TTD Board Special Invitees

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేల మంది భక్తులు, కోట్లల్లో ఆదాయం… శ్రీవారికి ఎన్నో వేడుకలు, కైంకర్యాలు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న ధార్మిక సంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అగ్రస్థానంలో ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు ఈ ధార్మిక సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బోర్డును కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ బోర్డు ఆధ్వర్యంలోనే తిరుమలలో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సర్వాత్రా విమర్శలకు దారి తీస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఏకంగా 34 మందిని సభ్యులుగా నియమించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం కూడా రేగింది. జంబో బోర్డు అంటూ ప్రతిపక్ష నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు.

ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేయడంపై వైసీపీ సర్కార్ తీరును తప్పుబట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ప్రకటించిన అందులో ఛైర్మన్‌తో పాటు మరో 24 మందిని బోర్డు సభ్యులుగా ప్రకటించింది. అంతటితో ఆగని జగన్ సర్కార్.. కొత్త విధానానికి తెర లేపింది. అదే ప్రత్యేక ఆహ్వానితులు అనే పేరుతో ప్రత్యేకంగా మరో 50 మందిని బోర్డు సభ్యులుగా నియమించింది ఏపీ సర్కార్. అయితే వారు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని ప్రభుత్వం వెల్లడించింది. కేవలం బోర్డు సభ్యులుగా మాత్రమే వ్యవహరిస్తారని ప్రకటించింది. దీనిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని… దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని… పిటిషన్లు అందులో పేర్కొన్నారు. టీటీడీ బోర్డు ప్రతిష్ఠ, స్వతంత్రతను దెబ్బతీసేలా ప్రభుత్వం జీవోలు జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే ఇదంతా తప్పుడు ఆరోపణలని… నిబంధనలకు అనుగుణంగానే నియామకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం… ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగ నిలుపుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.