మహారాష్ట్రలో జలవిలయం

మహారాష్ట్రను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటికే ముంబై మహానగర వాసులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. రెండు రోజుల్లో వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది మృతి చెందినట్లు ఉద్ధవ్ ఠాక్రే సర్కారు వెల్లడించింది. కొల్హాపూర్, నాగ్ పూర్, రాయ్ గఢ్, థానే సహా పలు పట్టణాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. సుమారు లక్ష మంది పునరావాస కేంద్రాల్లో ఆసరా పొందుతున్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు.