బెంగాల్ టు గోవా.. మమత నయా స్కెచ్

Bengal to Goa Mamata Naya Sketch

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్ను ఇప్పుడు గోవా పై పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటినుంచి అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే తూర్పు తీరంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న మమతా బెనర్జీ పశ్చిమ తీరంలో కూడా కమలం పార్టీని దెబ్బతీసేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించిన మమత జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు చేసేందుకు కూడా రెడీ అయ్యారు. ఇందుకోసం ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మమత భేటీ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ దెబ్బ తీయాలంటే బలమైన కూటమి అవసరమని ఇందుకోసం బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలన్నారు దీదీ. అదే సమయంలో బీజేపీని ఇతర రాష్ట్రాల్లో కూడా దెబ్బతీసేలా మమత మెగా ప్లాన్ వేశారు.

బెంగాల్ తో దగ్గర పోలికలు ఉన్న గోవా రాష్ట్రం పై ఇప్పుడు మమత దృష్టి సారించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీని కోలుకోలేని దెబ్బ తీయాలనేది మమత ప్లాన్. గోవాలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. ప్రజల్లో ఎంతో గుర్తింపు ఉన్న మనోహర్ పారికర్ వంటి కీలక నేత ప్రస్తుతం బీజేపీకి లేకపోవడం అతి పెద్ద మైనస్. దీంతో ఇప్పుడు స్టార్ క్యాపెయినర్ కోసం కమలం పార్టీ పెద్దలు వేట కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో గోవా కోటలో పాగా వేసేందుకు దీదీ ప్లాన్ చేశారు. ఇప్పటికే గోవాలో పరిస్థితులను పరిశీలించాలంటూ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలను గోవా పంపారు మమతా. ఓ వైపు భవానీపూర్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన మమతా… గోవాపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రయిన్‌తో పాటు… మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రసూన్ బెనర్జీలకు ఈ బాధ్యత అప్పగించిన మమతా… అక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కూడా మమతా ఆదేశించారు. అలాగే బెంగాల్‌లో తనకు హ్యాట్రిక్ విజయం దక్కేలా చేసిన ఖేలా హోబే నినాదాన్ని మరోసారి గోవాలో ప్రయోగిస్తున్నారు దీదీ.

బెంగాల్‌కు గోవాకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఫుట్‌బాల్ క్రీడకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాగే మత్య్ససంపద పై ఆధారపడి జీవనం సాగించే వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో పశ్చిమ తీరంలో పాగా వేయాలని మమతా బలంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు కూడా మమతా గాలం వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు టీఎంసీ గూటికి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి. ఏదీ ఏమైనా మోదీ హవాకు బ్రేక్ కొట్టాలని దీదీ బలంగానే కంకణం కట్టుకున్నట్లున్నారు.