మరణం ఒకటే…వేటాడుతున్న అనుమానాలు ఎన్నో?

Blacksheep behind The Lady doctor Sucide?
Blacksheep behind The Lady doctor Suicide?
  • ఇది బూడిదైపోయిన ఓ “అబల వ్యధ”

  • లోకానికి తెలియని మరో “అయేషా మీరా” కధ

  • 3నెలల క్రితం యువ లేడిడాక్టర్‌ అనుమానాస్పద మృతి

  • ఆత్మహత్య అంటూ ప్రచారం..కానీ అనుమానాస్పదం!

  • “అదృశ్యశక్తి” బెదిరింపులే బాధితురాలి కుటుంబ మౌనానికి కారణమా?

  • తన హాస్పిటల్ వైద్యురాలి మరణంలో Dr.కోటారాంబాబు పాత్ర ఏమిటి?

  • రీపోస్ట్ మార్టమ్ చేస్తే హంతకుడు దొరికిపోతాడా? అందుకే శవానికి దహనక్రియలు?

  • హంతకులు ఎవరు?ఎవరిని కాపాడేందుకు ఈ రాజీ?

  • ఈ పాపంలో ఎవరి వాటా ఎంత?ఎవరి పాపం‌ ఎంత?

ఏ మరణం అయినా సరే విషాదాన్ని నింపుతుంది. ఏ అర్ధాంతర ముగింపు అయినా సరే గుండెను కోసేస్తుంది.కానీ ఇప్పుడు చదవబోయే ఒక మరణగాధ మాత్రం లెక్కలేని ప్రశ్నలను మానవత్వం మీదకు సంధిస్తుంది. సున్నితమనస్కులను అయితే కుదిపేస్తుంది. భద్రత ఒడిలో సేదతీరాల్సిన ఒక యువ వైద్యురాలి భవితదీపం అంత అర్ధాంతరంగా ఆరిపోయినందుకు ఒకింత ఆవేదనను, ఆమె మృతికి కారణమైన ఆ అదృశ్యశక్తులను శిక్షించితీరాలనే ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేస్తుంది. అలా చదివి ఇలా వదిలేసే వారికి ఆ యువవైద్యురాలిది మరణమే…కానీ మనసున్న మనుషులకు మాత్రం ఇది తప్పకుండా తేలాల్సిన డెత్ మిస్టరీనే….!

చనిపోయేలా వేధించారా? చంపేసారా?
చనిపోయేలా వేధించారా? చంపేసారా?

#నేపాల్‌లో మెడిసిన్ చదువు…వత్సవాయిలో వైద్యం

అది 13-08-2021,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా వత్సవాయి టౌన్ పోలీసులకు ఒక అర్జెంట్ కాల్. స్ధానిక “అరుణ హాస్పిటల్‌” వైద్యురాలు మరణించింది. ఆమె మృతదేహం ఉరికి వేలాడుతోంది అనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. విషయం తెలుసుకున్న వెంటనే వత్సవాయి పోలీసులు ఘటనాస్ధలికి వెళ్లారు. నిజమే, ఆ హాస్పిటల్‌లో వైద్యురాలిగా పనిచేసే ఒక యువతి జీవచ్ఛవంగా కన్పించింది. ఆమె పేరు భీమనాధం మౌనికారెడ్డి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం, మేరుపూడి ఆమె స్వగ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మౌనికారెడ్డికి చదువుకోవాలనే ఆశ బలంగా ఉండేది.అందుకే ఎన్నో అవరోధాలను జయించింది. నేపాల్‌లో MBBSపూర్తి చేసింది. ఎవరు రిఫరెన్స్ ఇచ్చారో తెలియదు, మరెవరైనా బలవంతపెట్టారో తెలియదు కానీ వత్సవాయి అరుణ హాస్పిటల్‌లో వైద్యురాలిగా చేరింది. హాస్పిటల్‌కు వచ్చే రోగులను ప్రేమగా పలుకరించేది. తనకున్న పరిజ్ఞానంతో వైద్యం చేసేది. హాస్పిటల్‌లో పనిచేసే సిబ్బందితో కూడా అత్యంత ఆప్యాయతా అనురాగాలతో ఉండేది. ఏమో బహుశా ఈ ప్రేమమూర్తిని చూసి విధికి కన్ను కుట్టిందేమో కానీ…సరిగ్గా 3నెలల క్రితం అంటే 13-08-2021 నాడు సాయంత్రం 4గంటలకు బలవంతంగా ఉసురుతీసుకుంది.పోలీసులు నమోదు చేసిన క్రైం నెంబర్ 468/2021 u/s ప్రకారం మౌనికారెడ్డి ఆత్మహత్య చేసుకుంది? నమోదు అయిన సెక్షన్ CRPC-174ప్రకారం “మౌనికారెడ్డి మరణం” నేటికి అనుమానాస్పదమే.

అర్హత సాధించని "మౌనికారెడ్డి" నియామకం వెనుక వ్యూహం ఏమిటి?
అర్హత సాధించని “మౌనికారెడ్డి” నియామకం వెనుక వ్యూహం ఏమిటి?

#మౌనికారెడ్డికి మరణానికి, “అరుణ హాస్పిటల్‌కు” లింక్‌ ఏమిటి?

మౌనికారెడ్డి MBBSచదువుకుంది నేపాల్‌లో, కన్సల్టెంట్‌గానో లేక ప్రాక్టీస్‌ కోసమో వచ్చిందేమో కృష్ణాజిల్లా వత్సవాయికి. ఇదెలా సాధ్యం? గుంటూరు జిల్లాకు చెందిన మౌనికారెడ్డికి కృష్ణాజిల్లా వత్సవాయిలో ఎవరైనా బంధువులు ఉన్నారా? పోనీ పరిచయస్ధులు ఉన్నారా అనేది చెప్పగలిగేది డిస్కస్ చేయబోయే ముందు.. అసలు వత్సవాయిలో ఉన్న ఆ “అరుణ హాస్పిటల్‌” ఎవరనేది తెలుసుకోవాలి. ఖమ్మంజిల్లా మధిరలో KVRఎమర్జెన్సీ హాస్పిటల్‌ యజమానులైన డాక్టర్ కోటా రాంబాబు, డాక్టర్ కోటా అరుణకుమారిలే కృష్ణాజిల్లా వత్సవాయిలోని “అరుణ హాస్పిటల్‌” యజమానులు కూడా. పేరుకే వీరిద్దరూ అక్కడ డాక్టర్లు కానీ…పేషేంట్లకు ట్రీట్‌మెంట్ అందించేది మాత్రం మౌనికారెడ్డినే . మరి మౌనికారెడ్డికి చట్టపరంగా రోగులకు వైద్యం చేసే అర్హత MBBSపూర్తిచేయడంతో వచ్చేసిందా? అనే అనుమానం మీకు వస్తే….. చట్టం ఏం చెబుతుందో తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విదేశాల్లో MBBS పూర్తి చేసి పట్టా చేతపట్టుకుని ఇండియాలో వైద్యం చేస్తాం, వ్యాధులన్ని నయం చేసేస్తామంటే చట్టం ఒప్పుకోదు. విదేశాల్లో MBBS పూర్తి చేసిన వారు ఎవరైనా సరే… ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే తప్పనిసరిగా FMGEఅనే పరీక్ష రాయాల్సిందే,తప్పకుండా ఉత్తీర్ణులు కావాల్సిందే. FMGEఅంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్.. ఇక్కడ తమ ప్రతిభ నిరూపించుకుంటేనే,ఈ పరీక్షలో పాస్ అయితేనే… భారత ప్రభుత్వం ప్రాక్టీస్‌కు అనుమతినిస్తుంది.FMGEలో పాస్ కాకుండా ప్రాక్టీస్ ప్రారంభిస్తే…చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. మరి నేపాల్‌లో కేవలం MBBSపూర్తి చేసిన మౌనికారెడ్డి FMGEలో ఉత్తీర్ణత సాధించిందా అంటే….నో,నాట్ ఎట్ ఆల్…మౌనికారెడ్డి చనిపోయేనాటికి FMGE రెండు సార్లు రాస్తే ఫెయిల్ అయింది. అంటే భారత ప్రభుత్వ చట్టాలను ఎడమకాలి కింద తొక్కి పెట్టి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడే అలవాటు ఉన్న డాక్టర్‌ కోటా రాంబాబు… మౌనికారెడ్డిని బలిపశువుగా మార్చాలనుకున్నాడనేది ఇక్కడ క్లియర్ కట్. అది కాకపోతే FMGE పాస్ కాని మౌనికారెడ్డిని డాక్టర్‌గా నియమించుకోవటం ఏమిటి? అర్హత లేని ఆమెతో రోగులకు ట్రీట్‌మెంట్ ఇప్పించడం ఏమిటి?అడిగేవాడెవడు? అడ్డుకునేవాడెవడు అనే విర్రవీగేతనమే ఇందుకు కారణమని తెలిసిందే. ఖమ్మంజిల్లా DMHO అనుమతి ఇవ్వకున్నా కోవిడ్-19 పేషేంట్లకు వైద్యం పేరుతో నిలువుదోపిడీ చేస్తే…తెలంగాణ మంత్రి KTRకు ట్విట్టర్ ద్వారా సుగ్గల ఉమేష్ అనే యువకుడు ఫిర్యాదు చేసిన ఘటన కూడా తెలిసిందే కదా?ఇది కనుక బయటకు వస్తే హాస్పిటల్ పరువు పోతుంది, నా హాస్పిటల్ సీజ్ చేస్తారు దయచేసి కాపాడు అని Dr.కోటా రాంబాబు బతిమిలాడుకుంటే బాధితుడు ఉమేష్ దయతలిచి మాట మార్చాడు. ( ఇదంతా అబద్దం అని ఎవరైనా వాదిస్తే…తల దించుకునే ఆధారం Journo Team చూపిస్తుంది. “కేటీఆర్ ట్వీట్ ఎపిసోడ్”లో ఎన్ని లక్షలు చేతులు మారాయో, ఖమ్మం కలెక్టర్ నుంచి MRO వరకు ఎందరిని మోసం DR. కోటా రాంబాబు మోసం చేసాడో సాక్ష్యాలతో సహా చూపిస్తాం. ఇది Journo Team బహిరంగసవాల్ )

ఆమె "మరణరహస్యం" తేలేది ఎప్పుడు?
ఆమె “మరణరహస్యం” తేలేది ఎప్పుడు?

#చలాకీకి చిరునామా అయిన మౌనికారెడ్డి ఎలా చనిపోయిందంటే..?

మౌనికారెడ్డి చనిపోయే రోజు 13-08-2021 మధ్యాహ్నాం నాటికి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆమె చలాకీగానే ఉంది. ఆరోజు షాపింగ్‌ కూడా చేసింది. కట్ చేస్తే…2గంటలు గడిచిన తర్వాత అంటే 4గంటల కల్లా “అరుణహాస్పిటల్” డాక్టర్ మౌనికారెడ్డి ఉరివేసుకుని చనిపోయింది అనే వార్త దావానలంలా వత్సవాయితో పాటు ఆ పరిసర గ్రామాలను చుట్టుముట్టేసింది. ఆమె మరణవార్త తెలియగానే హాస్పిటల్ సిబ్బంది బావురుమన్నారు.ఆమెతో పరిచయం ఉన్నవారు కుంగిపోయారు. ఇక ఆమె కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. ఘటనాస్ధలికి వచ్చిన పోలీసులు ఆమె డెడ్‌బాడీని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.14-08-2021 నాడు అంటే ఆమె మరణించిన మరుసటి రోజు జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్‌లో నెంబర్‌ 142 పేరుతో “మౌనికారెడ్డి శవానికి” పోస్ట్ మార్టమ్ నిర్వహించారు వైద్యులు. అంతే కాదు డాక్టర్ మౌనికారెడ్డి శరీరంలోని కొన్ని అవయువ భాగాలను రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మౌనికారెడ్డి మెడ చుట్టూ 1.5 సెంటిమీటర్ల వ్యాసార్ధంతో “లిగేచర్ మార్క్‌” ఉందని పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో రాసారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాధమికంగా ధృవీకరించారు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన వైద్యులు. ఇక్కడితో కథ కంచికి చేరిందని అనుకోవద్దు అసలు కథ ప్రారంభం కాబోయేది ఇక్కడే..!

#మౌనికారెడ్డి చనిపోయిందా లేక చంపేసారా?

డాక్టర్ మౌనికారెడ్డి చనిపోయేముందు ఒక లేఖ రాసిందని “జర్నోటీమ్‌” తెలుసుకుంది. అది ఆమె రాసిన సూసైడ్ నోట్ అని ఆఫ్‌ ది రికార్డ్ చెప్పారు వత్సవాయి పోలీసులు.ఇంతకీ ఆమె రాసిందని చెబుతున్న సూసైడ్‌ నోట్‌లో ఏముంది? 27ఏళ్లకే బలవంతంగా మరణించాల్సిన అవసరం మౌనికారెడ్డికి ఎందుకువచ్చింది? తన చావుకు కారణం ఎవరు అని, ఏ కారణం అని మౌనికారెడ్డి రాసింది? అప్పటి వరకు చలాకీగా ఉన్న ఆమె, నవ్వుతూ నవ్విస్తూ ఉన్న ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఇంతకీ సూసైడ్‌ నోట్‌లో ఉన్న చేతిరాత ఆమెదేనా? ఒకవేళ ఆమెదే అనుకుందాం,ఆమె రాసిందా లేదా ఎవరైనా బలవంతంగా రాయించారా? ఆ చేతిరాత మౌనికారెడ్డిదే అని కచ్చితంగా చెప్పటానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలమబ్బులు ఒక్కసారిగా కమ్మేస్తాయి. మరెన్నో అనుమానాలను మీదకు విసిరేసి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.ఇది తెలియాలంటే మౌనికారెడ్డి రాసిందని చెబుతున్న “సూసైడ్ నోట్‌” చూడాలి. అంతే కాదు రీజనల్‌ ఫోరెన్సిక్ ల్యాబ్‌ నుంచి రిపోర్ట్‌ పరిశీలించాలి.ఆ రిపోర్ట్స్ ఎలాగూ అధికారికంగానే జర్నోటీమ్‌ సంపాదిస్తుంది కానీ…ఇక్కడే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి మెగాట్విస్ట్ ఉంది. సెక్షన్ 174 CRPC ప్రకారం “అనుమానాస్పద మృతికి కారణం పక్కాగా తేలేవరకు ఏ శవాన్ని కాల్చకూడదు. తదుపరి దర్యాప్తు కోసం, మరెన్నో అనుమానాలను నివృత్తి చేయటం కోసం ఆ డెడ్‌బాడీని భద్రపరచాలి లేదా ఖననం చేయాలి. కానీ మౌనికారెడ్డి డెత్ మిస్టరీ అధికారికంగా తేలకముందే ఆమె డెడ్‌బాడీని దహనం చేసారు…అంటే కాల్చేసారు” ఆమె కుటుంబసభ్యులు.

Blacksheep behind The Lady doctor Sucide?

#మౌనికారెడ్డి డెడ్‌బాడీ కాల్చేయటం వెనుక అతిపెద్ద కుట్ర?

అది 2007 డిసెంబర్ 27. కొన్నిరోజుల్లో రానున్న నూతన సంవత్సరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న “అయేషా మీరా”ను హత్య చేసారు దుండగులు. పలుమార్లు అత్యాచారం చేసి ఆపై అయేషామీరాను చంపేసారు అనే ఆరోపణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమేకాదు యావత్ భారత్‌ను నివ్వెరపోయేలా చేసింది. ఓ మాజీమంత్రి కుటుంబానికి “అయేషామీరా” హత్యతో సంబంధం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నప్పటికీ… చివరికి “సత్యం” అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. కొన్నేళ్ల తర్వాత “సత్యం” నిర్ధోషి అని తేలటంతో…. మళ్లీ అయేషామీరా కేసును దర్యాప్తు చేసే బాధ్యత CBIకు ఇచ్చింది. అయితే ఈ కేసు దర్యాప్తు సిబిఐకు సవాల్‌గా మారటంతో కోర్టును ఆశ్రయించారు.అత్యంత కీలకమైన సమాచారం, ఫైల్స్,రికార్డులు ఏకంగా విజయవాడ కోర్టులోనే ధ్వంసం కావడంతో.. చేసేది లేక అయేషామీరా డెడ్‌బాడీకి రీపోస్ట్‌మార్టమ్‌ చేయాలని నిర్ణయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 12ఏళ్ల తర్వాత అంటే 14-12-2019నాడు అయేషామీరా డెడ్‌బాడీకి రీ పోస్ట్ మార్టమ్‌ నిర్వహించారు సిబిఐ అధికారులు.ఇది అయేషామీరా వ్యధ. 2007లో మరణించిన అయేషా మీరాకు,ఆ కేసుకు…13-08-2021 న మరణించిన భీమనాధం మౌనికారెడ్డికి,ఈ కేసుకు లింక్‌ ఏంటో తెలుసా..? రోకలిబండతో కొట్టి,ఆపై పలుమార్లు అత్యాచారం చేసి చంపేసారని ప్రాధమికంగా నిర్ధారించినప్పటికి అయేషా మీరా డెడ్‌బాడీని “దహనం” చేయలేదు. కేవలం ఖననం చేసారంతే. అంటే ఒక మరణంపై అనేక అనుమానాలు ముసురుకున్నప్పుడు అసలునిజం ఏమిటో తేలేవరకు.. ప్రాధమిక సమాచారం, ప్రైమరీ రిపోర్టులు ఇచ్చింది ప్రభుత్వాధికారులే అయినా సరే… శవాన్ని భద్రపరచాలి లేదా ఖననం చేయాలి. అలా ఖననం చేసారు కనుకే 12ఏళ్ల తర్వాత అయినా అయేషామీరా డెడ్‌బాడీకి రీ పోస్ట్ మార్టమ్‌ చేయగలిగారు. మరి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు అయినప్పటికి…రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ నుంచి రిపోర్టులు రాకుండానే,వచ్చిన రిపోర్టులు సరైనవా లేవా? అవి..అన్ని అనుమానాలను తీరుస్తాయో లేదో తేలకుండానే మౌనికారెడ్డి డెడ్‌బాడీని ఎందుకు లేకుండా చేసారు. ఎవరి ప్రోద్బలంతో బూడిద చేసారు అనేది తప్పక తేలాల్సిన ప్రశ్న!

#మౌనికారెడ్డి మరణానికి కారణమైన ఆ “అదృశ్యశక్తి” ఎవరంటే..?

భీమనాధం మౌనికారెడ్డి మరణవార్త విన్న ఆమె కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఉత్సాహానికి,ఉత్తేజానికి మారుపేరుగా ఉండే మౌనికారెడ్డి ఆత్మహత్య చేసుకుని మరణించింది అనే చేదునిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.ఇది ఆత్మహత్య కాదు కచ్చితంగా హత్యే అని ఆమె కుటుంబసభ్యులు సన్నిహితులతో వాపోయారట.ఈ క్రమంలోనే ఒక “క్రిమినల్ మాస్టర్‌ మైండ్‌” పై వారికి అనుమానం కలిగిందనేది విశ్వసనీయ సమాచారం. మౌనికారెడ్డిని చంపేసి ఆత్మహత్యగా ఆ ” క్రిమినల్ మాస్టర్‌మైండ్” చిత్రీకరించి ఉండాలి లేదా తన భవిష్యత్తుకు ముప్పు రాకుండా ఉండేందుకు “మౌనికారెడ్డి”ని అడ్డుతొలగించుకునేందుకు గాను ఆమె “ఆత్మహత్య” చేసుకునేంతగా వెంటాడి వేధించి ఉంటారనే గట్టి నమ్మకానికి వచ్చినట్లు తెలిసింది. ఆ అదృశ్యశక్తే…మౌనికారెడ్డి మరణానికి కారణం అని నిశ్చయించుకున్నారట. యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి విషయాన్ని తెలుసుకున్న కొందరు పెద్దలు,మహిళా సంఘాల నేతలు ఆమె కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసారు. కానీ ఇక్కడే ఆ “అదృశ్య శక్తి”, ఆ “క్రిమినల్‌ మాస్టర్ మైండ్” చక్రం తిప్పింది. మౌనికారెడ్డి డెత్ మిస్టరీని చేధించాలని డిసైడ్ అయిన ఆమె “కుటుంబ సభ్యులను” బెదిరించినట్లు తెలుస్తోంది.కేసులు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు,కోర్టుల చుట్టూ తిరగటం వల్ల చనిపోయిన “మౌనికారెడ్డి” తిరిగి వస్తుందా?అసలే ఆమె ఆత్మహత్యతో మీ కుటుంబం పరువు మొత్తం గంగలో కలిసిపోయింది.ఇక కేసులు, కోర్టులు అని కూర్చుంటే మీరు సమాజంలో తల ఎత్తుకుని తిరగగలరా అనే ప్రశ్నలతో వారి ఫ్యామిలిని వేధించినట్లు జర్నోటీమ్‌ తెలుసుకుంది. ఆ “అదృశ్యశక్తి” బెదిరింపులకు, ఎమోషనల్ బ్లాక్‌ మెయిలింగ్‌కు తలవంచిన భీమనాధం మౌనికారెడ్డి కుటుంబసభ్యులు కేసుల జోలికి పోలేదట.అంతేకాదు ఇక ఏ సాక్ష్యం మిగలకుండా , మిగల్చకుండా ఆఘామేఘాల మీద ఆమె మృతదేహాన్ని బూడిద చేసేసారు. తెలిసో తెలియకో మౌనికారెడ్డి అనుమానాస్పద మరణానికి కారణం తెలియనివ్వకుండా , ఆత్మహత్య అని ముద్ర వేస్తూ ఆమె శవాన్ని కాల్చి బూడిద చేసేసారు.

#మౌనికారెడ్డి డెత్‌ మిస్టరీ ఇక కాలగర్భంలో కలిసిపోయినట్లేనా?

13-08-2021నాడు భీమనాధం మౌనికారెడ్డి మరణించిన నాటి నుంచి ఆమె శవం కాలిబూడిదయ్యే వరకు ఆమె కుటుంబసభ్యులు ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. ఒక “అదృశ్యశక్తి” వారిని మీడియాతో మాట్లాడనివ్వలేదనేది అసలు నిజం. మున్ముందు ఎక్కడా ఆధారాలు దొరకకుండా మౌనికారెడ్డి డెడ్ బాడీని కాల్చి బూడిద చేసేవరకు ఆ “అదృశ్యశక్తి” తన క్రిమినల్ మాస్టర్ మైండ్‌తో కుటుంబసభ్యులకు ఊపిరి ఆడనివ్వలేదని విశ్వసనీయవర్గాలు జర్నోటీమ్‌కు తెలిపాయి. ఇదంతా తెలుసుకున్న “జర్నోటీమ్‌” ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడింది.మౌనికారెడ్డి శవాన్ని పూడ్చిపెట్టలేదు, దహనం చేసామని ఆమె తండ్రి ధృవీకరిస్తే…మరో ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రం మౌనికారెడ్డి పేరు ఎత్తితేనే విరుచుకుపడ్డారు. ఎందుకు ఆమె డెడ్‌బాడీని దహనం చేసారు? తొలుత అనుమానం వ్యక్తం చేసిన మీరే అనుమానాస్పదంగా ఎందుకు సమాధానాలు చెబుతున్నారని ప్రశ్నిస్తే…కాల్ కట్ చేసారు. ఆ కాల్‌రికార్డ్స్‌తో పాటు మౌనికారెడ్డితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ఆమె వ్యక్తిత్వాన్ని ఎరిగిన వారి సాక్ష్యాలు జర్నోటీమ్‌ వద్ద భద్రంగా ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలిస్తే…ఆ “అదృశ్యశక్తి” బెదిరింపులకు ఆ కుటుంబం భయపడిపోయిందా?లేక పరువు పోతుందని మిన్నకుండిపోయిందా?ఆ క్రమంలోనే మౌనికారెడ్డి డెత్‌ మిస్టరీ వీడకుండా పోయిందా అనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.

మూగబోయిన నవ్వుల సెలయేరు "మౌనికారెడ్డి"
మూగబోయిన నవ్వుల సెలయేరు “మౌనికారెడ్డి”

#మౌనికారెడ్డి మరణంపై డాక్టర్ కోటా రాంబాబు మౌనం ఎందుకు?

ఇవన్నీ అపోహలే, అనుమానాలే,మౌనికారెడ్డిది ఆత్మహత్యే ,ఆమె ఆత్మహత్యకు ఇదే కారణం అంటూ మీడియా ముందుకు రావాల్సిన వారు ఆమె కుటుంబసభ్యులే. వీళ్లు మాత్రమే కాదు FMGE పరీక్ష పాస్‌ కాకుండా ఆమెను వైద్యురాలిగా “అరుణ హాస్పిటల్” యజమానులు
ఎలా నియమించుకున్నారు? ఇది చట్టానికి తూట్లు పొడవటం కాదా? ఇలా నియమనిబంధనలను కాలరాయటం ప్రభుత్వాలు, అధికారులను అవమానించటం కాదా? ఇంతకీ తన హాస్పిటల్‌లో అనుమానాస్పదంగా మరణించిన “మౌనికారెడ్డి అస్తమయంపై” డాక్టర్‌ కోటారాంబాబు స్పందన ఏమిటి? తన కుటుంబంలో ఒక సభ్యురాలిగా మెలిగిన మౌనికారెడ్డి మరణిస్తే మౌనం ఎందుకు? అసలు ఆమెకు ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సిన అవసరం ఏమిటి? ఆమెను ఆత్మహత్య దిశగా ప్రేరేపించిన శక్తుల గురించి తనకు ఏమైనా తెలుసా లేదా? తెలిసినా సరే కావాలనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? నోరు విప్పితే మౌనికారెడ్డి మరణం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అని సైలెంట్ మోడ్‌లో ఉన్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు డాక్టర్‌ కోటారాంబాబు బదులు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్ధితి ఇది. ఇక ఆమె కుటుంబ సభ్యుల విషయానికి వస్తే….మాకు ఎవరి మీద అనుమానం లేదు, మేము ఎవరిమీదా అనుమానం వ్యక్తం చేయలేదు. మరే ఇతర “అదృశ్యశక్తి” మమ్మల్ని బెదిరించలేదు అని మీడియా ముందుకు వచ్చి కుండబద్దలు కొట్టాల్సిన వారు మౌనికారెడ్డి కుటుంబసభ్యులే. అలా వాళ్లు వచ్చినప్పుడు…ఒక నిండు జీవితాన్ని అర్ధాంతరంగా బలి తీసుకున్న ఆ “క్రిమినల్ మాస్టర్ మైండ్‌” తాట తీసేందుకు అండగా నిలవాల్సింది ఈ సమాజమే. ఒక వేళ వాళ్లు రాకపోయినా,వారిని రానివ్వకుండా ఆ “అదృశ్యశక్తి” కులంతోనో, మతంతోనో, కండబలంతోనో, అంగబలంతోనో బెదిరించినా……మౌనికారెడ్డి డెత్‌ మిస్టరీని తేల్చే బాధ్యత జర్నోటీమ్‌ తీసుకుంటుంది. ఈ బాధ్యత జర్నోటీమ్‌ తీసుకుంటుందనే భయంతోనే విషప్రచారాలు, మకిలిరాతలు రాయించి అలసిపోయారు. అయినా సరే రాజీ పడేది లేదు, “మౌనికారెడ్డి డెత్ మిస్టరీ” తేలేంత వరకు,తేల్చేంత వరకు పోరాటం ఆపేది లేదు. Vijaysadhu (Editor in chief)