సిని ‘మా’ రాజకీయాలు..!

Cine 'MAA' politics

 

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం ఏం కాదు… కానీ రాజకీయ నేతలు సినిమా పరిశ్రమపై పెత్తనం చేయడం మాత్రం కాస్త విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇదే జరుగుతుంది. గతంలో పూర్తి ఏకగ్రీవంగా సాగిన మా ఎన్నికలు… ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికలను కూడా మించిపోయాయి. ఇంకా చెప్పాలంటే… ఐ సినిమాలో చెప్పినట్లు… అంతకు మించి.. సాగుతున్నాయి. రెండేళ్ల పదవి కాలం.. వెయ్యి మంది కూడా లేని ఓటర్లు… అయినా సరే… సార్వత్రిక ఎన్నికలను మించిన స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇప్పుడు ఎవరు పోటీ చేసినా కూడా..‌ అజెండా ఒక్కటే. ఇచ్చే హామీ అదే. కొత్తగా ఏం చెప్పటం లేదు. మా అసోసియేషన్ కోసం శాశ్వత భవనం నిర్మిస్తాం. పేద కళాకారులకు పెన్షన్, ఇల్లు అందిస్తాం. ఇవే మాటలు చెప్తున్నారు తప్ప… కొత్తగా చెప్పేందుకు ప్రయత్నం చేయటం లేదు.

గతంలో జరిగిన ఎన్నికల కంటే కూడా ఈసారి మాత్రం మరో అంశం ఆసక్తికరంగా మారింది. అదే లోకల్, నాన్ లోకల్ అనే మాట. సాధారణంగా సినీ పరిశ్రమకు హద్దులు ఉండవు. నటనకు పరిధి కూడా ఉండదు. అందరూ కళామతల్లి ముద్దుబిడ్డలే అని చెప్పుకుంటారు కూడా. కానీ ప్రస్తుతం మాత్రం 500కు పైగా సినిమాల్లో నటించి.. నంది అవార్డులు, జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు పొందిన ప్రకాశ్ రాజ్ మాత్రం రాత్రికి రాత్రే పరాయి వాడు అయ్యాడు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లలో సింహభాగం ఇతర భాషాప్రవీణులే. ఇంకా చెప్పాలంటే.. తెలుగు అక్షరం ముక్క కూడా రాని వాళ్లే. అప్పుడు లేని పరాయి మాత్రం ఇప్పుడు వచ్చింది.

ఇక అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుత మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం. అభ్యర్థుల గెలుపు కోసం జాతీయ స్థాయి పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బంధువు. వైఎస్ఆర్ సోదరుని కుమార్తెను విష్ణు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఏపీ సీఎం జగన్ కు విష్ణు బావ. అలాగే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం వైసీపీలో సభ్యులు కూడా. దీనికి తోడు విష్ణు ప్యానల్ లో ఉన్న పృథ్వీరాజ్ బాల్ రెడ్డి అయితే జగన్ వీరాభిమాని. అందుకే మా ఎన్నికల్లో విష్ణు ప్యానల్ కు తన ఓటు అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా బహిరంగంగా ప్రకటించారు.

ఇక ప్రకాశ్ రాజ్ ఓటమి కోసం భారతీయ జనతా పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోడీ సర్కార్ పై ప్రకాశ్ రాజ్ ఎన్నో ఆరోపణలు చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. దీంతో ప్రస్తుత మా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకాశ్ రాజ్ ను ఓడించాలనేది కమలం పార్టీ నేతల ప్రయత్నం.

ఏది ఏమైనా.. సినిమా ఎన్నికలు కాస్తా.. రాజకీయ రంగు పులుముకున్నాయి.