సీజేఐ వ్యాఖ్యలు… అధికారుల్లో గుబులు…

CJI NV Ramana Comments

 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటకు ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మాట చెప్పినా… ఒక తీర్పు ఇచ్చినా… అది ఎంతో దూరం వెళ్తుంది. ఆయన చెప్పిన మాటకు తిరుగు ఉండదు. సీజేఐ ఇచ్చిన తీర్పుకు ఎదురు ఉండదు. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్‌వీ.రమణ ఓ కేసు విచారణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో సస్పెండైన ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి గుర్ణీందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వి.రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ గుర్ణీందర్ పాల్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.

గుర్ణీందర్ పాల్ సింగ్ పిటిషన్‌పై విచారించిన సుప్రీం ధర్మాసనం… దానిని కొట్టివేసింది. ఇదే సమయంలో జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడిన అధికారులు జైలుకు వెళ్లాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ప్రభుత్వంతో కుమ్మకైన పోలీసు అధికారులను రక్షణ కల్పించలేమని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులను తప్పకుండా జైలుకు పంపాల్సిందే అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలతో అనుకూలంగా ఉంటూ దోపిడికి పాల్పడ్డారన్న సీజేఐ…. అవినీతితో అక్రమార్జనకు పాల్పడితే… జైలు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో ఇదో కొత్త ధోరణ కనిపిస్తోందని… అలాంటి అధికారులకు ఎందుకు రక్షణ కల్పించాలని సీజేఐ ప్రశ్నించారు.

ప్రస్తుతం సీజేఐ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఎంతో మంది అధికారులు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కోర్టు వాయిదాలకు కూడా హాజరవుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో కీలక శాఖలు నిర్వహించిన కొంత మంది అధికారులు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీగా వ్యవహరించిన వెంకటేశ్వరరావు కూడా ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జగన్ సర్కార్‌లో కూడా ప్రస్తుతం కీలక శాఖలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మన్మోహన్ సింగ్ కూడా జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులగా ఉన్నారు. ఇక ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రస్తుత సీజేఐ కామెంట్లతో హడలెత్తిపోతున్నారు.