డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, తరుణ్ లకు క్లీన్ చిట్

Clean chit to Puri Jagannadh and Tarun in drugs case

 

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో రోజుకో మలుపు తిరుగుతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు రోజుకొకర్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నవదీప్, తనీష్, తరుణ్ లను విచారించిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఓ కీలక విషయం బయటకు వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్ లకు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. 2017 లో వీరిద్దరూ ఇచ్చిన గోళ్ళు, వెంట్రుకలు, రక్తం శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎలాంటి ప్రూఫ్ లు లభించలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పింది.

ముఖ్యంగా 2017 లో జులైలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్ ల నుండి ఎక్సైజ్ శాఖ కొన్ని కీలక నమూనాల్ని సేకరించింది. ఈ విషయాన్ని స్వయంగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. అలాగే గతేడాది డిసెంబర్ 8 న ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా సమర్పించారు. ఈ నమూనాలతో పాటుగా కెల్విన్ పై ఉన్న ఛార్జ్ షీట్ ను ఎఫ్ఎస్ఎల్ నివేదిక వివరాల్ని కోర్టుకు సబ్ మిట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు సమాచారం అందించారు. దీంతో పాటుగా డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అందించిన ఆధారాలతో పాటుగా సెలెబ్రిటీల పేర్లు కూడా వివరించడంతో ఈడీ అధికారులు వారిని విచారిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా ట్రాన్సాక్షన్లతో పాటుగా మరికొన్ని వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.