ఏపీలో కరెంటు షాక్ మీద షాక్

CM YS Jagan Giving Power Shock to AP Public

 

మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి… ఎవరో ఎందుకు…జగన్ సార్ సాక్షి పేపర్ నడుపుతున్నారు కదా.. పేపర్ రేటు 3 రూపాయలనుకోండి… సంవత్సరం తర్వాత నష్టాలు వచ్చాయని లెక్కలేసుకుని..జనానికి బిల్లులో ఇంకో రెండు రూపాయలు అదనంగా కట్టమంటే.. జనం ఏమంటారు? తిట్లదండకం ఎత్తుకుంటారు..మరి కరెంటు బిల్లులో ఇప్పుడు అదే పని చేశారు..మరి జనానికి చురుకు పుట్టిందో లేదో గాని.. కరెంట్ షాక్ మాత్రం కొట్టింది.

300, 400 వచ్చేవాళ్లకు ఒక్కసారే 1000 లకు పైగా బిల్లు రావడంతో నిజంగానే షాక్ కొట్టింది. ఏంటా అని చూస్తే… రకరకాల పేర్లతో జనం డబ్బులను దొంగతనం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అవును.. మరి ఇది దొంగతనమే…. చెప్పాపెట్టకుండా బిల్లులు ఇష్టమొచ్చినట్లు పెంచిపారేసి.. జనాన్ని కట్టమంటే అది దొంగతనమే కదా.

ఏంటీ మీకు అప్పుడెప్పుడో ఎన్నికల ముందు జగనన్న చెప్పిన డైలాగులు గుర్తొస్తున్నాయా… అవును..మొత్తం తగ్గించేస్తానని వీర లెవెల్లో చెప్పారప్పుడు..అప్పుడు కరెంటు మనది..కాని ఇప్పుడో కరెంటు ఆయనది.. ఓటేశాక..మీ కరెంటు పోయింది. అందుకే చితకబాదుతున్నారు బిల్లులతో. అయినా ఏదో ఒక పథకం పేరుతో ఎంతో కొంత క్యాష్ వస్తుందిగా… అందులోంచి తీసి కరెంట్ బిల్లు కట్టుకోండి.. సరిపోవంటారా.. అప్పుడు ఎదురేసి కట్టుకోండి. అంతేగా అంతకంటే చేసేదేమీ లేదు కదా.

అయితే ఈ పాపమంతా జగన్ దే కాదు.. ఇందులో చంద్రబాబునాయుడికి… నరేంద్ర మోదీకి కూడా వాటాలున్నాయి.. అదేంటి అనుకోకండి. ఇది నిజమే..ఓపికగా తెలుసుకోండి. అసలు బిల్లులు పెంచాలంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.. కాని చంద్రబాబుగారు ప్రపంచబ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకుని.. బిల్లులు పెంచే పని ఒకరికి..కరెంటు సప్లయ్ ఒకరికి..ఉత్పత్తి మరొకరికి అంటూ పంచిపెట్టేశారు.. అంటే బిల్లు పెంచితే రెగ్యులేటరీ కమిషన్ పెంచినట్లే గాని..ప్రభుత్వానికి సంబంధం లేదని కలరింగ్ ఇచ్చారు. మరోవైపు ప్రైవేటు పవర్ ప్రాజెక్టులకు ఫుల్లుగా సపోర్ట్ చేసి పెంచేశారు.. మన జెన్ కోను లెక్కలు చూసుకో చాలని పడుకోబెట్టారు. దీంతో పవర్ అయితే ఫుల్లు అవైలబుల్.. బిల్లు మాత్రం డబుల్.

ఇక తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డిగారు అయితే అసలు కరెంటు ఎక్కువకు కొంటున్నారు.. ఆ ఒప్పందాలు రద్దు చేయాలి… అందులో చంద్రబాబు అండ్ కో బాగా తినేశారని గొడవ గొడవ చేశారు. జగన్ ఏం చేసినా చూసీ చూడకుండా వదిలేసే కేంద్రం మాత్రం ఈ విషయంలో ఊరుకోలేదు. డైరెక్టు వార్నింగ్ ఇచ్చేశారు. విద్యుత్ కంపెనీలకు ఎలాంటి నొప్పి తగిలినా సరే..నీ సంగతి చూస్తామన్నారు. ఎందుకంటే ఆ ఒప్పందాలన్నీ ఒక పాలసీ ప్రకారం..మూకుమ్మడిగా దోచుకోవడానికే అన్నట్లు చేశారు. జగన్ ఇక వెనక్కు తగ్గక తప్పలేదు..అయితే ఆబ్లిగేషన్ గా మరో పని చేసుకున్నారు. ఈయన కూడా అదే రేట్లకు కొత్త ఒప్పందాలు చేసుకున్నారు.. మరి ఈయన కమీషన్ తీసుకున్నాడో లేదో తెలియదు మరి.

కేంద్రంలోని బిజెపి విద్యుత్ సంస్కరణలు చాలా వేగంగా అమలు చేస్తోంది. రైతులకు ఇచ్చే కరెంటుకు మీటర్లు కూడా పెట్టాలని చెప్పింది. ఈ సంస్కరణలకు అటు వైసీపీ, ఇటు టీడీపీ ఇద్దరూ మద్దతిచ్చారు.. వైసీపీకి అయితే నీకు అప్పులు కావాలంటే ఒప్పుకో అని బిజెపి డైరెక్టుగా చెప్పింది.. జగన్ బాబు అలాగే అని తలూపారు. టీఆర్ఎస్ సైతం మద్దతిచ్చింది..కాకపోతే బిజెపి తెలంగాణలో రైజ్ అవుతుండటంతో ఎదురు తిరిగి..మీటర్లు పెట్టనని చెప్పింది. ఎక్కువ రేట్లకు కొనడానికి మాత్రం ఓకె చెప్పింది. ఈ భారమంతా వేసేది జనం మీదే చివరికి.

ఏపీలో ఇప్పుడు లెక్కలేసుకుని..పోయిన సంవత్సరం నష్టాలొచ్చాయని..ట్రూ అప్ ఛార్జీలు అంటూ బిల్లులో కలిపేశారు..మొత్తం 3699 కోట్లు. అప్పటికే కస్టమర్ ఛార్జీలని వేశారు. త్వరలో సర్దుబాటు ఛార్జీలని మరో బాదుడు బాదుతారంట..చివరకు కేంద్రం విద్యుత్ సంస్కరణల దెబ్బకు.. స్లాబ్ లన్నీ ఎత్తేసి..ఒకటే శ్లాబ్ 7 రూపాయలు పెట్టి గుంజుకుంటారంట.

దీని మీద టీడీపీ పోరాటం చేయదు..ఎందుకంటే ఈ సంస్కరణలకు వారు కూడా మద్దతిచ్చారు. లేదు దమ్ముంటే మోదీని కూడా ఎదిరించి..వీటికి వ్యతిరేకమని పోరాటంలోకి దిగాలి. జనసేన సంగతి సరేసరి.. మహా అయితే పవర్ స్టార్ ఓ ట్వీట్..లేదా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారేమో..ఆయనా బిజెపికి ఫ్రెండే కదా. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్ధితి. కాంగ్రెస్ పార్టీయే ఏమన్నా అయితే గియితే రంగంలోకి దిగాలి. వారు కూడా ప్రయివేటు విద్యుత కంపెనీల లాబీయింగ్ కి లొంగిపోతే..ఆ ముచ్చట కూడా ఉండదు.

ఎందుకంటే పవర్ ప్రాజెక్టుల వారి లాబీయింగ్ పవర్ ఫుల్లుగా ఉంటుంది. వేల కోట్లు సంపాదిస్తున్నారు… వందల కోట్లు విసిరేయడానికి వెనుకాడరు.. మన రాజకీయ నేతలు అవి అందుకోవడానికి అస్సలు మొహమాటపడరు. అంటే పవర్ కంపెనీలు పెట్టి అధిక ధరలకు ప్రభుత్వాలకు నిర్బంధంగా అమ్ముతూ లాభాలు అందుకుంటారు…వారి నుంచి కమీషన్లు అందుకుని రాజకీయ నేతలు లాభపడతారు.

ఎటొచ్చీ పిచ్చిమాలోకాల్లా ఆ బిల్లులు కట్టేది జనాలు. అయితే అన్నీ మూసుకుని ఆ బిల్లులు భారమైనా ఖర్చులు తగ్గించుకుని…కళ్లు మూసుకుని కట్టేయాలి. లేదంటే చీము, నెత్తురు ఉన్నోళ్లయితే తిరగబడి రాజకీయ నాయకులను నిలదీయాలి. మరేం చేస్తారో.. చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఊరుకుంటే..రేపు కరెంటు బిల్లు కట్టడానికి లోన్లు తీసుకుని..ఈఎమ్ఐలు కట్టుకోవాల్సి ఉంటుంది. భారం మీదే..బాదుడు మీకే..నిర్ణయం మీదే.