ఎయిర్ బార్న్ డిసీజ్ గా కరోనా వైరస్..?

Coronavirus is airborne disease

 

కోవిడ్‌ కొత్త వేరియంట్లు గాలి ద్వారా ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని సంతరించుకుంటున్నాయి. ఈ శక్తి మరింత ఎక్కువైతే కరోనా ఎయిర్‌బార్న్‌ డిసీజ్‌ గా మారే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును..రోజుకో రూపం మార్చే కరోనా వైరస్ లాంటి ప్రమాదకారి.. ఇప్పుడు గాలి ద్వారా ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని పొందుతుందని అంటున్నారు. ఆ ఊహే భయానకంగా ఉన్నా..కానీ ఈ భయాలు నిజమయ్యే ఛాన్సులు ఇప్పుడు ఎక్కువయ్యాయి.

కరోనా వైరస్‌ గాలి తుంపరులు, సూక్ష్మ బిందువుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. కరోనా రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ దగ్గరలో ఉన్నవారికి, పక్కనే ఉండేవారికి సోకుతుంది. పక్కన ఎవరూ ఆ సమయంలో లేకపోతే.. క్రమంగా బయటి వాతావరణంలో కరోనా వైరస్‌ నిర్వీర్యం అవుతుంది. కానీ జలుబు లాంటి వైరస్‌లు గాలి ద్వారా కూడా వ్యాపిస్తాయి. వీటి గాలి తుంపరులు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. ఎక్కువకాలం గాల్లో ఉంటాయి. అందుకే ఒక సమూహంలో ఒకరికి జలుబు చేసినా ఇతరులందరికీ తొందరగా అంటుకునే అవకాశాలు ఎక్కువ.

కరోనా వైరస్‌ ప్రస్తుతం ఈ శక్తిని సాధించే పనిలో ఉంది. కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీనివల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు మరింతగా పెరుగుతాయని మేరీల్యాండ్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మరింత టైట్‌ గా ఉండే మాస్కులు ధరించడం, ఇంట్లో బాగా వెంటిలేషన్‌ ఏర్పరుచుకోవడం చేయాలని సూచించింది. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన వారు వదిలే గాలిలో వైరస్‌ ఉంటుంది. అల్ఫా వేరియంట్‌ సోకిన వారు వదిలే గాలిలో 43–100 రెట్లు అధిక వైరస్‌లోడు ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

ఇప్పటివరకు ఇవి బయట గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకడం జరగలేదు. అయితే రోజురోజుకు వాయు ప్రయాణం చేసే శక్తిని వేరియంట్లు పెంచుకుంటున్నాయని, దీనివల్ల వైరల్‌ ఏరోసాల్స్‌ పెరిగిపోతున్నాయని ఇటు సీఐడీ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది.

అల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి కలిగి ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది. ఈ వేరియంట్లు క్రమంగా గాల్లో ప్రయాణించడానికి అలవాటు చేసుకుంటున్నాయి. పూర్తిగా వాయుమార్గంలో సోకే వేరియంట్లుగా మారకుండా నిరోధించేందుకు టీకా తీసుకోవడం, టైట్‌ మాస్కులు ధరించడం, శుభ్రమైన వాతావరణంలో నివసించడం చేయాలన్నారు.

అల్ఫా కన్నా డెల్టాలో ఈ శక్తి ఎక్కువగా కనిపిస్తోంది.. దీన్నిబట్టి వైరస్‌ గాలిలో ప్రయాణం చేయడానికి అనుకూల మార్పులు పెరుగుతున్నాయి. ఇప్పటికీ మాస్కులు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయనడంలో ఎలాంటి డౌట్ అక్కరలేదు. ఎందుకంటే మాస్కుల వల్ల వైరస్‌ సోకే అవకాశాలు దాదాపు 50 శాతం తగ్గుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే లూజుగా ఉండే మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, అలాగే మాస్కులు గడ్డాలకు కాకుండా ముక్కు, నోరు కవర్ చేసేటట్టు వేసుకోవాలని హెచ్చరిస్తున్నాయి.