నెంబర్ వన్ కంత్రీగాళ్లు…ఈ క్రికెట్ బుకీలు

Dark face of Madhira Cricket Betting Mafiya-02

 

  • బుకీలుగా మాజీ ప్రజాప్రతినిధి భర్త, పరాయి రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి

  • కాళ్లు పట్టుకున్నా కనికరించరు, వేడుకున్నా దయ చూపరు

  • జీవితాలు నాశనమవుతున్నా సరే ధనార్జనే కేటుగాళ్ల ధ్యేయం

  • డిప్రెషన్‌లో కూరుకుపోయిన వందలాది బాధితులు

  • మధిర పోలీసులు పట్టించుకోకుంటే పెను ప్రమాదమే

IPL సీజన్ స్టార్ట్ అయింది. 27 రోజుల పాటు జరగబోయే 31 మ్యాచ్‌లను క్యాష్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసారు ఖమ్మం జిల్లా మధిరలోని క్రికెట్ బుకీలు. IPL ముగిసేలోపు లక్షలు సంపాదించాలి, నిండు ప్రాణాలు పోయినా సరే, పండంటి జీవితాలు బూడిద అవుతున్నాసరే… కనికరం చూపకూడదనే టార్గెట్ పెట్టుకున్న కొందరు కేటుగాళ్లు వికృతరూపం చూపనున్నారు. ఎప్పుడో తప్పితే వార్తల్లో నిలవని ఖమ్మంజిల్లా మధిరలో… ఈ రేంజ్‌లో క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నోళ్లు ఉన్నారా అనే అనుమానం రావటంలో తప్పులేదు. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం వరకు మధిర అంటే సేఫ్ జోన్, కానీ ఇప్పుడు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డా,అసాంఘిక శక్తులకు హైడింగ్ జోన్. మాయదారి క్రికెట్ బుకీల విషయానికి వస్తే… ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి మధిరలో నివాసముంటున్న ఒక వ్యాపారి, ఒక చిన్నహోటల్ నిర్వహించే వ్యక్తి…వీరంతా అత్యంత కీలకమైన క్రికెట్ బుకీలు. భౌగోళికంగా మధిర “తెలంగాణ” అయినప్పటికి…ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఉంటుందనేది జగద్వితితమే. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వేలాదిమంది నిత్యం మధిరకు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ బంధం బలపడింది. దీన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు క్రిమినల్ క్రికెట్ బుకీలు. మధిర నియోజకవర్గంలోని అమాయకులను బుట్టలో వేసుకోవటం మాత్రమే కాకుండా ఆంధ్రాకు చెందిన వారిని కూడా ఈ జూదంలోకి లాగి నాశనం చేస్తున్నారు.

మధిర మండలంలోని ఒక గ్రామానికి చెందిన రాకేష్‌ ( పేరు మార్చాము) అనే వ్యక్తి ప్రస్తుతం పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం రాకముందు ఇతని దందా అంతా బెట్టింగ్. మధిర బుకీలలో నేటికి.. అతనిది చెక్కు చెదరని స్ధానమే. బుకీగా ఉండి, బెట్టింగ్‌లు వేయించడంతో పాటు పందెం కమీషన్ల ద్వారా ఇతను దాదాపు 20 లక్షలరూపాయలు సంపాదించడంటే అతిశయోక్తి కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే కూడాను. ఇలా చెప్పుకుంటూ పోతే యువతను నాశనం చేస్తున్న క్రికెట్ బుకీలు పదుల సంఖ్యలో ఉన్నారు. చెరువులో గుర్రపుడెక్క పాతుకుపోయినట్లుగా క్రికెట్ బెట్టింగ్ బంగార్రాజులు వేలసంఖ్యలోనే మధిర నియోజకవర్గంలో ఉన్నారు. డబ్బు ఆశతో క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడుతున్నారు. నష్టపోయాక, బుకీలు, వసూలు చేసే గ్యాంగ్‌లు వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేదనను అనుభవిస్తున్నారు. డబ్బు కట్టలేక,బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక సూసైడల్ టెండన్సీలో మగ్గిపోతున్నారు.

#బెట్టింగ్ జరిగే తీరు, బుకీల భాష ఇదే!

ముందుగా చెప్పుకున్నట్లు బుకీల నుంచి బెట్టింగ్‌లోకి దిగాలంటే కనీసం 10వేలు డిపాజిట్ చేయాలి. ఆన్‌లైన్‌ అయితే ఎంట్రీ ఫీజుల్లో తేడా ఉంటుంది కానీ ఆఫ్‌లైన్‌కు మాత్రం తెలియని వారు 10వేలు కట్టాల్సిందే. తెలిసిన వారు అయితే కనీసం 5వేలు తప్పనిసరి. టాస్ నుంచి చివరి బాల్ వరకు బెట్టింగ్ నడుస్తుంటుంది. టాస్ ఎవరు గెలుస్తారు? టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ ఎంచుంటారా లేదా? ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎవరు గ్రౌండ్‌లోకి దిగుతారు? తొలి బాల్ పెవిలియన్‌ను ముద్దాడుతుందా లేదా? ఈ ఓవర్‌లో ఎన్ని పరుగులు వరదలై పారుతాయి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో ట్విస్టులతో బెట్టింగ్ సాగుతుంది. మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగే కొలది బెట్టింగ్ రూపం మార్చుకుంటుంది. వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షల రూపాయల వరకు పందెంరాయుళ్లు రెచ్చిపోతారు. వెయ్యి రూపాయలను “ఒక పాయింట్‌”గా పిలుస్తారు. ఎన్ని వేల రూపాయలు అయితే అన్ని పాయింట్లు అనమాట. తలపడే టీమ్‌లను బట్టి పాయింట్లు పరవళ్లు తొక్కుతాయి. బెట్టింగ్ బంగార్రాజుల నుంచి పాయింట్లను తెచ్చుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్‌ను బట్టి కమీషన్లు తీసుకుంటారు బుకీలు. పందెం వేసిన తర్వాత నగదు ఇవ్వకపోతే నరకం చూపిస్తారు. కాల్స్‌ చేసి బూతులతో విరుచుకుపడతారు. అప్పు తీసుకుని ఇవ్వట్లేదు అని కలరింగ్ ఇచ్చి బాధితులను వెంటాడుతారు. ఎవరైనా తిరగబడితే చల్లగా జారుకుంటారు. అదే బాధితులు అమాయకులు అయితే ముక్కు నేలకు రాయించి మరీ వసూలు చేసే టెర్రిఫిక్ గ్యాంగ్ ఈ బుకీలు….

#బుకీగా అవతరించిన ఆ మాజీ ప్రజాప్రతినిధి భర్త ఎవరో తెలుసా?

ఆయన్ను చూస్తే భక్తిలో మునిగితేలిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే బొట్టు, చేతికి ఉంగరాలే ప్రధాన ఆకర్షణ. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో నడుస్తాడేమోఅనుకోవచ్చు. మాటలను కోటలు దాటిస్తాడు.అరచేతిలో స్వర్గం చూపిస్తాడు. గతంలో ఆయన భార్య ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు హవా అంతా ఈయనగారిదే. పబ్లిసిటీ అంటే పడిచచ్చిపోయే ఈ సార్ ఒకనాటి..షాడో బాస్. పేరుకు అధికారం ఆమెది కానీ అంతా ఆయనే చూసుకునేవాడు. అధికారుల సభలు జరిగినప్పుడు నిరసనల నుంచి నినాదాల వరకు సర్వం ఆయనే మరి. అంతకుముందు వ్యాపారం కూడా చేసాడు కానీ కొన్ని తప్పిదాల వల్ల షట్టర్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. కొంతకాలం రియల్ ఎస్టేట్ అంటూ హల్ చల్ చేసాడు. కానీ క్రికెట్ బుకీగా మారితే లక్షలు దండుకోవచ్చనే అడ్డదారిని ఎంచుకున్నాడు. లేటేందుకు అనుకున్నాడో ఏమో వెంటనే తనకున్న పరిచయాలను వాడుకుని క్రికెట్ బుకీగా అవతారమెత్తాడు. మధిర నియోజకవర్గంలో ఉన్న అమాయకులను మాత్రమే కాదు ఆంధ్రా ప్రాంతానికి చెందిన తన స్నేహితులను, సన్నిహితులను కూడా ఈ జూదంలోకి దింపాడు. బెట్టింగ్ ఆడేవారికి ఇతని పేరు నాలుక మీదే ఆడుతుంది. క్రికెట్ బెట్టింగ్ వేసేందుకు ఎవరైనా సరే ఇతన్ని కాంటాక్ట్ చేయవచ్చు. అయితే అలా సంప్రదించిన వారికి వెంటనే ఎంట్రీ పాస్ ఇవ్వడు. ముందు కంప్లీట్‌గా ఎంక్వైరీ చేయిస్తాడు. అంతా సేఫ్ అనుకుంటేనే 10వేలు రూపాయలు కట్టించుకుని ఎంట్రీ కార్డ్ ఇస్తాడీ కేటుగాడు. ఊరించి, ఆడించి సాఫీగా సాగిపోయే అమాయకుల జీవితాలను నట్టేట ముంచేస్తాడీ క్రిమినల్ బుకీ.

#IPL సీజన్ లేకున్నాలక్షల్లో బెట్టింగ్ వేయించే ఘనుడు ఇతడు!

ఆ సామాజికవర్గానికి చెందిన మిగతావారిలానే ఇతను కూడా వ్యాపారం కోసం మధిరకు విచ్చేసాడు. ఎడారి రాష్ట్రానికి చెందిన ఇతడు పొట్ట చేతపట్టుకుని వచ్చేసరికి మిగతావారిని చూసుకున్నట్లుగానే మధిర ఇతగాడిని కూడా కంటికి రెప్పలానే కాపాడుకుంది. బిజినెస్ చేస్తే మధిర ప్రజలు బాగానే ఆదరించారు. కష్టపడి పనిచేస్తే కిక్ ఏముందని అనుకున్నాడో ఏమో కానీ క్రికెట్ బుకీగా అవతారమెత్తాడు. IPL సీజన్ లేకున్నా సరే సర్వసాధారణ మ్యాచ్‌లకు కూడా బెట్టింగ్ వేయించడం ఇతని స్పెషాలిటీ. పాయింట్ల ప్రకారం వేల రూపాయలను కలెక్ట్ చేసుకుని గల్లా నింపేసుకుంటాడు. అన్ సీజన్‌ నుంచి ప్రో కబడ్డీ వరకు ఈ నాన్ తెలుగు బుకీ దందా కొనసాగుతుంది. బెట్టింగ్‌లో కూరుకుపోయిన వారికి ఇతను చాలా సుపరిచితుడు. అత్యంత సన్నిహితులతో మాత్రమే బెట్టింగ్ నిర్వహించటంలో ఇతను దిట్ట. విందులు వినోదాలకు ఆమడ దూరంలో ఉంటాడు కానీ బెట్టింగ్‌ వేసే వారికోసం మాత్రం తన షాప్ తలుపులు తెరిచే పెడతాడు. పరాయి రాష్ట్రం వాడైనా సరే క్రికెట్ బెట్టింగ్‌ బుకీగా మారి ఈ స్ధాయిలో పాతుకు పోయాడంటే నెట్‌వర్క్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోండి మరి.

#టాస్‌కు మాత్రమే వేలల్లో పందెం వేసే భాయ్‌జాన్‌!

ఇతడికి చేతినిండా డబ్బులే. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. అయినా సరే సరిపెట్టుకోలేదు, సరిపుచ్చుకోలేదు. షార్ట్ కట్‌లో కాసులు సంపాదించాలనే కోరిక బలీయంగా ఉండటంతో బెట్టింగ్ బాట పట్టాడు. మొదట్లో టోటల్‌ మ్యాచ్‌లో లీనమయ్యేవాడు. బాల్ టూ బాల్ , రన్‌ టూ రన్ బెట్టింగ్ వేసే వాడు. కోరుకున్నంత కాసులు చేతిలో ఉన్నాయి కదా అందుకే పందెం వేసేందుకు వెనుకాడే వాడు కాదు. కాకుంటే ఇతనికి ఓపిక తక్కువ. బెట్టింగ్ మీద ఫోకస్ పెట్టడంతో బిజినెస్‌ దెబ్బతిన్నది. ఎంతసేపని గుమస్తాలు చూసుకుంటారు అందుకే కొన్నాళ్లు తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులతో బెట్టింగ్ వేయించేవాడు. బుకీలకు నేరుగా కాల్‌ చేసి తన తరపున ఎన్ని పాయింట్లు వేయాలనేది చెప్పేవాడు. మళ్లీ రూట్ మార్చాడు మ్యాచ్ అంతా ఎవరు ఉంటారు, ఆ టెన్షన్‌ను ఎవరు తట్టుకుంటారని కేవలం టాస్‌కు మాత్రమే పందెం వేస్తాడు. టాస్ ఎవరు గెలుస్తారనే దానిపై.. కనీసం 20 నుంచి 50వేల రూపాయలు పందెం కాస్తాడు. ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు తన సన్నిహితుల ద్వారా మాత్రమే పందెం కాసి చేతులు కాల్చుకుంటున్నాడీ భాయ్‌జాన్!

#ఇంతజరుగుతున్నా పోలీసులు పట్టించుకోరా?

కొన్నేళ్లకు ముందు ఇలాగే క్రికెట్ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఒక ముఠా ఆటకట్టించారు మధిర సర్కిల్ పోలీసులు. ఎర్రుపాలెం మండలంలో క్రికెట్ బెట్టింగ్ వేస్తూ డబ్బులు దండుకుంటున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ షాక్‌తో కొంతకాలం బుకీలు అంతా రూట్ మార్చుకున్నప్పటికీ… కొంతకాలం నుంచి యాక్టివేట్ అయ్యారు. ఖాకీల కళ్లుగప్పి టెక్నాలజీని వినియోగించుకుంటూ లక్షల్లో బెట్టింగులు నిర్వహిస్తున్నారు. బాధితులు బయటకు చెప్పుకోలేరనే ధీమాతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు గ్యాంగ్‌మెంబర్స్.. అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, అసాంఘిక శక్తులుగా అవతరిస్తే, క్రికెట్ బెట్టింగ్ వేసి అమాయకుల జీవితాలు నాశనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు మధిర సర్కిల్ ఇన్స్‌పెక్టర్ O.మురళి. చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తే ఎంతటివారినైనా వదిలేది లేదని తేల్చి చెప్పారు. క్రికెట్ బుకీలు వేధిస్తున్నా, ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం ఉంటే తనను సంప్రదించవచ్చన్నారు. బాధితులు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. తనకు లేదా మధిర టౌన్‌, మధిర రూరల్, బోనకల్లు, ఎర్రుపాలెం సబ్‌ ఇన్స్‌పెక్టర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు మధిర CI మురళి.

#ఇది “ముగింపు” కానే కాదు “ఆరంభం”

మధిరలో మాయదారి క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఏ స్ధాయిలో వేళ్లూనుకుపోయిందో, బుకీలు అమాయకుల జీవితాలను ఏ స్ధాయిలో నాశనం చేస్తున్నారో అర్ధం అయింది కదా…ఈ బెట్టింగ్ బంగార్రాజుల భాగోతాలను, బుకీల నీచవ్యక్తిత్వాలను బయటికి తీసుకొస్తున్నామని తెలుసుకున్న కొందరు బుకీలు పరోక్షంగా బెదిరించేందుకు ప్రయత్నించారు. అది కుదరదని తెలుసుకున్నాక బతిమిలాడుకునేందుకు, ప్రలోభానికి గురిచేసేందుకు వెనుకాడలేదు. అయినా సరే Journo Team రాజీ పడలేదు, తలవంచదుకూడా. జర్నలిజం అంటే బాకా ఊదడం కాదు…ప్రజల తరపున నిలబడటమే అసలు సిసలైన జర్నలిజం నమ్ముతున్నాం కనుకే జనగళమై అవినీతి, అక్రమాలపై అక్షర సమరం చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తామని హామీ ఇస్తున్నాం…….. విజయ్ సాధు ( Editor in Chief )