ఇయర్ ఫోన్స్ శుభ్రం చేయకుండా అదేపనిగా వాడేస్తున్నారా?

Do not use earphones without cleaning

 

ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ తోనే కనిపిస్తున్నారు. మంచి మ్యూజిక్ వినడానికి అయినా, మాట్లాడటానికైనా అంతా వీటిని వాడటానికే చూపిస్తున్నారు. వీటిని బ్యాగులో, ప్యాంట్‌ జేబుల్లో ఉంచడం వల్ల వీటిపై డస్ట్‌ పేరుకుపోతుంది. ఆహార పదార్థాలు, చెమట వల్ల కూడా ఇయర్‌ ఫోన్లు పాడవుతాయి. అందుకే ఎప్పటి కప్పుడు వీటిని జాగ్రత్తగా శుభ్రపరుస్తూ ఉండాలి.

ఇలా శుభ్రపరచండి..

ఇయర్‌ ఫోన్లు చెవుల లోపలికి పెడతాం కాబట్టి చెవిలోని బ్యాక్టీరియా వీటిమీద నిల్వ ఉంటుంది. ఈ దుమ్మును ఇయర్‌ బడ్‌తో లేదా మెత్తటి బట్టను శానిటైజర్‌లో ముంచి శుభ్రపరచుకోవాలి. తేమ లేని టూత్‌ బ్రష్‌తో సులువుగా ఇయర్‌ ఫోన్లలో ఉండే మట్టిని తొలగించొచ్చు. ఇక ఇయర్‌ ఫోన్‌ల మీద చెవులకు నొప్పి కలగకుండా ఉండే మెత్తని సిలికాన్‌, రబ్బరు బడ్స్‌ను తీసేయాలి. వాటిని గోరువెచ్చని నీటిలో వేసి సబ్బుతో శుభ్రపరచి ఆరబెట్టుకోవచ్చు.
హెడ్‌ ఫోన్ల విషయానికొస్తే.. మెత్తటి ఇయర్‌ ప్యాడ్స్‌ను తీసేసి వాటిని టవల్‌తో తుడిచేయాలి. లేదా మెత్తని బట్టను హ్యాండ్‌ శానిటైజర్‌లో ముంచి శుభ్రపరచాలి. ఇలా కనీసం పదిహేను రోజులకైనా ఈ పరికరాలను శుభ్రపరిస్తే చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావు.

ఇయర్ ఫోన్స్ ఇలా వాడొద్దు..

మంచి మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగించినప్పుడు ఆ ఆడియో చెవుల మీద ప్రభావం చూపుతుంది. 90 డెసిబెల్ల వాల్యూమ్ ఉంటే కనుక తీవ్రమైన వినికిడి సమస్యలు ఉంటాయి. ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు తక్కువ సౌండ్ తో సంగీతాన్ని వినాలి. అప్పుడు వినికిడి సమస్య రాకుండా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ వాడటం కారణంగా గాలి మార్గం బ్లాకింగ్ అయ్యి చెవికి ఇన్ ఫెక్షన్ వచ్చి హాని కలుగుతుంది.
వీటిని ఎక్కువగా ఉపయోగించటం వలన గులిమి ఎక్కువగా ఏర్పడి చెవి హోరుకు కారణం కావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకరు వాడినవి మరొకరు వాడకూడదు. మరొకరు వాడిన ఇయర్ ఫోన్స్ మీరు ఉపయోగించాల్సి వస్తే వాటిని శుభ్రపరచాలి.