చాక్లెట్స్, టీ, ఫిష్… మీకు చాలా ఇష్టమా?

Do you like chocolates, tea, fish

 

చాలామంది చాక్లెట్లు, టీ, ఫిష్ అంటే చాలా ఇష్టపడతారు. కొంతమంది అయితే చిన్నపిల్లలతో పోటీపడి మరి చాక్లెట్లు తింటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే టీని ఎనర్జీ డ్రింక్ గా ఫీలవుతూ ఉంటారు. ఇక నాన్ వెజ్ ప్రియులయితే చికెన్ , మటన్ కంటే ఫిష్ నే తెగ లాగించేస్తుంటారు. అయితే వీటిని తరచూ తీసుకోవడం వల్ల చెడు కంటే మంచే జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెయిన్ పనితీరును మెరుగుపరచి మరింత చురుగ్గా ఉండేటట్లు చేస్తాయంటున్నాయి.

చాక్లెట్స్‌

చాక్లెట్స్‌ బ్రెయిన్‌ హెల్త్‌కు మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కోకో బీన్స్‌లో ఫ్లేవనాల్ అని పిలువబడే కొన్ని చిన్న అణువులు ఉంటాయి. ఈ అణువులు మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక తెలియజేసింది. ఇంకా చెప్పాలంటే మామూలు చాక్లెట్ల కంటే డార్క్‌ చాక్లెట్లలో ఫ్లావోనాయిడ్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుందని, ఇవి మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

టీ

టీ లో అల్లం, మిరియాలు వంటివి యాడ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. ఐతే అదనంగా మెదడు పనితీరుకు టీ ప్రయోజనకరమని తేలింది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన మెదడు నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తాగని వారితో పోల్చితే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో ప్రయోజనాలు ఎక్కువగా కనిపించాయట.

చేపలు

గుండె ఆరోగ్యం నుంచి చర్మం, జుట్టు సమస్యల నివారణకు చేపలు మంచివని అందరికీ తెలుసు. చేపలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు చెప్పాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెల్పింది. దీనిలోని విటమిన్-ఇతో పాటు, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు డైమెన్షియా ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి.

ఆకు కూరలు

బ్రకోలి, కాలె, పాలకూర వంటి ఆకుకూరలు కాగ్నిటివ్‌ డామేజ్‌ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ది ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సొసైటీస్‌ ఫర్‌ ఎక్స్‌పరిమెంటల్‌ బయోలజీ ప్రకారం ఆకుకూరల్లో విటమిన్‌ ‘కె’, బేటా కెరోటిన్‌, లూటిన్‌, ఫోలెట్‌ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

నారింజ పండ్లు

ఆరెంజ్‌ లో కూడా ఫ్లావోనాయిడ్స్‌ అధికంగానే ఉంటాయి. రోజూ గ్లాస్‌ నారింజ రసం తీసుకోవడం వల్ల కాగ్నిటివ్ పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ నూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనాలు చెబుతున్నాయి.