సూపర్‌స్టార్‌ ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమె కోరుకుంటున్నారా..?

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవ‌ల ఆందోళ‌న నిర్వ‌హించారు. అయితే, ఈ ఆందోళ‌న‌కు ప‌రోక్షంగా ఆయ‌న స‌తీమ‌ణి లత రజనీకాంత్‌ స‌హ‌కారం ఉంద‌ని అభిమాన సంఘం నిర్వాహకుడు సంచలనాత్మక ఆడియో విడుదల చేశారు.

స్థానిక తిరువాన్మియూర్‌ రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి భాస్కర్‌ విడుదల చేసిన ఆడియోలో రజనీ రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తార‌ని ఊహించామ‌ని, కానీ ఆయ‌న నో చెప్ప‌టం అంద‌ర్నీ నిరాశ ప‌ర్చింద‌న్నారు. నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టం సమీపంలో భారీస్థాయిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి అవసరమైన వేదిక, 500 వాటర్‌ క్యాన్లు, మొబైల్‌ టాయ్‌లెట్ల‌ను లత ర‌జినీకాంత్ పరోక్షంగా అందించారని, ఆమె అసిస్టెంట్‌ సంతోష్‌ కూడా వీటిని పరిశీలించి వెళ్లారని భాస్కర్‌ తన ఆడియోలో ప్ర‌స్తావించారు.

రజనీ మక్కల్‌ మండ్రం ప్రకటించిన ఆందోళనకు అనుమతి జారీ చేయరాదని మక్కల్‌ మండ్రం జిల్లా కార్యదర్శి ఏవీకే రాజా పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానిని వాపసు తీసుకొనేలా చేసింది ఎవరనేది కూడా ఆడియో సంభాషణలో ప్ర‌స్తావించ‌లేదు.