రైతు దగా ప్రభుత్వం

East Godavari Latest news

వైయస్ జగన్ ప్రభుత్వం లో రైతులు పూర్తిగా దివాళా తీసే అధ్వాన స్థితికి చేరుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇంచార్జి ఆధ్వర్యంలో రైతుల కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ర్యాలీలు ధర్నాలు చేపట్టారు అధికారులకు వినతి పత్రం అందజేశారు. దేశానికి వెన్నెముకగా కీర్తించబడుతున్న రైతన్నలు నేడు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు వలస కూలీలుగా మారుతున్నారని ఆయా నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు ఆరోపించారు. రైతులకు అండగా ఉంటామని, రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పి ప్రకటనలకే పరిమితం చేశారని ఆరోపించారు.జిల్లా అంత పార్టీ ఆద్వర్యంలో భారీ ఎత్తున పసుపు సైన్యం ధర్నాలు, ర్యాలీలు చేసింది. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు పై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాడు చంద్రబాబు ప్రత్యేక పథకాలు అమలు చేసి రైతులకు బాసటగా నిలిచారన్నారు. రైతన్నల కష్టాలను దృష్టిలో ఉంచుకొనే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేశారన్నారు. అంతేకాకుండా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీలతో అందించి రైతన్నలకు తోడుగా నిలిచారన్నారు. అయితే నేడు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటోందని, రైతులకు ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదన్నారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు.

ఈ నియోజకవర్గంలో వరి పంటను ఎక్కువమంది రైతులు సాగు చేస్తున్న సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రతి ఏడు రైతన్నలు నష్టాలతో రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతులు ఈ దుస్థితి నుండి బయటపడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రైతుల ఆత్మహత్యలకు వైసిపి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు, ఎస్ వి ఎస్ ఎన్ వర్మ దాట్ల బుచ్చిబాబు, జెడ్ పి మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, పలువురు అగ్రనాయకులు పాల్గొన్నారు.