రుద్రం రౌద్రం రవీంద్రం

East Godavari SP Ravindranath Babu

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఎం రవీంద్రనాథ్ బాబు విధుల్లో చేరి నెల రోజులు దాటింది. సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నం గా మారారు.అలాగే ఇటు విధులకు హాజరు కాకుండా తిరిగే పోలీసులు,, సివిల్ డ్రస్ లో పైరవీలు చేసేవారికి కంటగింపుగా మారారు. ఏరోజు, ఏ ప్రాంతంలో ఏ పోలీస్ స్టేషన్ తనిఖీ చేస్తారో ఎవరికీ తెలియదు. చివరికీ ఆయన వాహన డ్రైవర్ కి కూడా తెలియనివ్వరు. ఎస్ పి రవీంద్రనాధ్ బాబు గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించడంతో ఈ ముఠా కొత్త పథకానికి తెరదీసింది. గంజాయిని లిక్విడ్ రూపంలో తయారు చేసి సరఫరా చేస్తోంది. ఆ ముఠా గుట్టు కూడా రేటు చేశారు.

మరోపక్క కొందరు పోలీసు అధికారులు జిల్లాలోనే పాతుకుపోయారు. ఎస్ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు ఇదే జిల్లాలో పనిచేస్తున్న అధికారులు కొందరు ఉన్నారు. ఇలా ఉన్న వారిలో కొందరు పోలీస్ స్టేషన్లలో సివిల్ కేసులు, సెటిల్మెంట్లు చేయడం, పూర్తిగా ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎఫ్.ఐ.ఆర్ లు వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో పరిపాలనా విభాగం సిబ్బంది ఏళ్ళతరబడి అక్కడే ఉన్నారు. వారు ఆడింది ఆట.. పాడిందే పాటగా నడుస్తున్నాయి.దీంతో ఆయన వచ్చి రావడంతోనే తన కార్యాలయాన్ని ప్రక్షాళన చేశారు.

అనంతరం పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేపట్టారు జిల్లాలో ఎక్కడ కూడా గంజాయి, మత్తుమందు సరఫరా, తయారీ వంటి కార్యక్రమాలు జరగకూడదని ఆదేశించారు. మరోపక్క వారానికి రెండు రోజులు నో.. యాక్సిడెంట్ డే నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజులు కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు రోడ్లపైన ఉండి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి గమనించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం, రాత్రివేళ వాహనాలు నడిపే వారు మద్యం సేవించారా గుర్తించి చర్యలు తీసుకోవడం, నిద్రమత్తులో ఉన్న వారిని టీ, మంచినీళ్లు ఇచ్చి కొద్ది సేపు అక్కడే రెస్ట్ తీసుకుని ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా మంచి గుర్తింపు పొందారు.

ఇక జిల్లావ్యాప్తంగా అక్రమ మద్యం రవాణా, సరఫరా చేసేవారు తమ వాహనాలపై పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. దీని పై మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇలా నకిలీ స్టిక్కర్లతో తిరుగుతున్న 136 మంది ని గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు .ఇక నుంచి ఎవరైనా ప్రెస్ ,పోలీస్, గవర్నమెంట్ వెహికల్ అని తమ వాహనాలపై పెట్టుకుని తిరిగితే పోలీసులు ఆపినప్పుడు కచ్చితంగా గుర్తింపు కార్డులు చూపించాలని, లేనిపక్షంలో ఆ వాహనం సీజ్ చేసి, వారిపై క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు. దీంతో బుధవారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వాహనాలపై ఉన్న ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు తొలగిపోయాయి. కాగా కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు పని చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఎస్ పి రవీంద్ర బాబు ప్రతి సోమవారం తన కార్యాలయంలో స్పందన వ్రీవెండి నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. వెంటనే అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్సు లో సదరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను లైన్ లో తీసుకుని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, బాధితుల పక్షాన ఎందుకు నిలబడ లేదంటూ క్లాస్ తీసుకుంటున్నారు. అలాగే జిల్లాలో రెండు సంవత్సరాలు దాటి పనిచేస్తున్న ఎస్ఐలు సిఐల వివరాలు సేకరించారు. త్వరలోనే వారిని జిల్లా నుంచి పంపించేందుకు ట్రాన్స్ఫర్ ఫైలు సిద్ధం చేశారు.

ఎస్ పి రవీంద్ర బాబు విధుల్లో చేరిన తర్వాత దాదాపు 10 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పై సస్పెన్షన్ వేటు వేశారు. ఏజెన్సీలో ఓ వాహనాన్ని సీజ్ చేసిన సిఐ స్థాయి అధికారి ఆవాహనం టైర్లు తన వాహనానికి మార్చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గంట వ్యవధిలో ఆ సి ఐ ని సస్పెండ్ చేసారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తూ, అదే సమయంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇంతకాలం జిల్లాలో పైరవీల ద్వారా తిష్టవేసి సెటిల్మెంట్లు, రాజకీయ నాయకుల వందిమాగదులు గా మారిన పోలీసు సిబ్బందిపై ప్రస్తుతం దృష్టి సారించారు.

మరో పక్క పేకాట, గుండాటలు, కోడిపందాల శిబిరాలపై దాడులకు ఆదేశించారు .దీంతో పోలీసుల్లో భయం పట్టుకుంది. ఎవరూ ఫిర్యాదు చేస్తారో, తమ పై విచారణకు ఆదేశాలు వస్తాయి అన్న ఆందోళనతో పోలీసు యంత్రాంగం లో పట్టుకుంది. పోలీస్ స్టేషన్లల కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎస్పి రవీంద్రనాథ్ బాబు గురించి ప్రజలు, అధికారులు, పోలీసులు, నాయకులు చర్చించుకుంటున్నారు. ఇంతకాలానికి ప్రజల పక్షాన పని చేసే ఎస్ పి వచ్చరంటూ సామాన్య ప్రజలు ఆయనకు సలాం కొడుతున్నారు.