బెంగాల్‌పై ఈసీ స్పెషల్ ఫోకస్…!

EC special focus on Bengal

 

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ దేశంలోనే సెంటర్ ఫర్ పాలిటిక్స్‌గా మారింది. ఒకప్పుడు కమ్యునిస్టుల కంచుకోటగా ఉన్న బెంగాల్‌లో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోంది. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరాటం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శతవిధాల పోరాడుతుంటే… ప్రజా తీర్పును నిలబెట్టుకునేందుకు టీఎంసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి అక్కడ పార్టీల మధ్య గొడవలు అనే మాట కంటే… పీఎం నరేంద్ర మోదీ వర్సస్ సీఎం మమతా బెనర్జీ అంటే సరిగ్గా సరిపోతుంది. బెంగాల్‌ ఎన్నికల వేళ విజయం కోసం బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబుల్ డిజిట్ దాటి సీట్లు సాధించలేకపోయింది. అయితే టీఎంసీ సీఎం మమతా బెనర్జీని నందిగ్రామ్‌లో ఓడించిన ఆనందం మాత్రమే బీజేపీ సొంతం.

బెంగాల్‌లో ఈ నెల 30న అసెంబ్లీలోని 3 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి మమతా రంగంలోకి దిగారు. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన దీదీ… ప్రచారంలో కూడా దూకుడుగానే వ్యవహరిస్తోంది. అటు ఉప ఎన్నికల్లో ఎలాగైనా మమతా ఓడించి సీఎం కుర్చి నుంచి దించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం బలమైన ప్రియాంక టేక్రివాల్‌ను దీదీపై పోటీకి నిలబెట్టింది. ఈ ఏడాది మే నెలలో ఏడు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా హింస చెలరేగింది. ప్రచారం మొదలు… ఓటింగ్ ప్రక్రియ వరకు ఆధిపత్య పోరు సాగింది. చివరికి పోలింగ్ రోజున బాంబు పేలుళ్లతో బెంగాల్ దద్దరిల్లింది. ఇక ఫలితాల తర్వాత బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఎంసీ నేతలు తరిమి తరిమి కొట్టారు. ఈ గొడవల్లో దాదాపు 10 మందికి వరకు మృతి చెందారు.

దీంతో ఇప్పుడు జరుగుతున్న భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి గొడవలు జరగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై రెండు సార్లు బాంబు దాడి జరిగిన నేపథ్యంలో… కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది ఈసీ. ఈ ఉపఎన్నిక కోసం ఏకంగా 52 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతోంది ఈసీ. ఇప్పటి 15 కంపెనీల బలగాలను బెంగాల్‌లో సిద్ధం చేసింది. ప్రధానంగా మమతా పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. బెంగాల్ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ కఠినంగా వ్యవహరించనుంది.