ఆఫ్గాన్లకు ఆహార కొరత..!

ఆఫ్గాన్లకు ఆహార కొరత..!
Afghanistan Latest News

తాలిబన్ల చేతుల్లో బంధీలుగా ఉన్న అఫ్గాన్లకు మరో పెద్ద సమస్య వెంటాడుతోంది. అదే ఆకలి. అమెరికా దళాలు అర్థాంతరంగా వెనుతిరగడంతో… తాలిబన్లు చెలరేగిపోయారు. వెంటనే అఫ్గానిస్తాన్ ను చేజిక్కుంచుకున్నారు. ఇప్పటికే కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమెరికా దళాలు ఖాళీ చేయడంతో… దానిని కూడా ఆక్రమించారు తాలిబన్లు. దీంతో చెట్టుకోకరు, పుట్టకొకరు అన్నట్లుగా ఆఫ్గాన్లు పారిపోతున్నారు. భవిష్యత్తు భరోసా లేకపోవడంతో… దిక్కున్న చోట తలదాచుకునేందుకు పారిపోతున్నారు. తమకేమైనా పర్లేదు… తమ వారసులైనా బతికుంటే చాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆఫ్గాన్ల ఆశలపై ఆర్థిక పరిస్థితి నీళ్లు చల్లుతోంది.

పేద దేశాల జాబితాలో ఉన్న ఆఫ్గానిస్తాన్ లో అత్యధికుల రోజువారీ ఆదాయం కేవలం 150 రూపాయలు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పేద దేశంపై ఇప్పటికే కరోనా వైరస్ పెను ప్రభావం చూపింది. వైరస్ కారణంగా… ఇప్పటికే ఆఫ్గాన్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దాదాపు ఏడాది కాలంగా ఈ నిరుపేద దేశానికి ఆహారం, వ్యాక్సిన్ తో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాయి సంపన్న దేశాలు. ఇందుకు ఐక్య రాజ్య సమితి తన వంతు సాయం చేస్తోంది కూడా.

అయితే ఇప్పుడు తాలిబన్ల వశమైన ఆఫ్గానిస్థాన్ లో ఇప్పుడు ఆహార సంక్షోభం జడలు విప్పుతోంది. ఇప్పటికే ఆక్కడ ప్రజలు ఆహారం దొరక్క… ఉన్నదానితో సరిపెట్టుకుంటున్నారు. ఇక చిన్నారులు అయితే పౌష్టికాహార లోపం ఉన్నారని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది కూడా. దేశంలోని 4 కోట్ల జనాభాలో దాదాపు సగం మంది పైగా ఆకలితో అల్లాడుతున్నారని… వీరికి ఆహార సాయం అత్యవసరమని ఇప్పటికే అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. ప్రజలంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

తాలిబన్ల భయంతో కనీసం బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. అసలే అంతంత మాత్రం ఆదాయం ఉన్న దేశంలో ప్రస్తుత మరింత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్యాంకులు మూతపడటంతో… నగదు చలామణి స్తంభించిపోయింది. ఇక ఆఫ్గాన్ తాలిబన్ల చేతిలో పోవడంతో… ఆ దేశానికి ఆర్థిక సాయం అందించేందుకు ఏ దేశం ముందుకు రావడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఇక జీతాలు లేక ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పరిపాలనపై ఏ మాత్రం అనుభవం లేని తాలిబన్ల ఏలుబడిలో…. ఆఫ్గానిస్తాన్ భవిష్యత్తు నడి సంద్రంలో నావలా మారింది.