వామ్మో..వాముతో ఇన్ని ఉపయోగాలా?

Health Benefits of Carom Seeds

 

వాము సాధారణంగా అందరి వంటిళ్లలో తప్పకుండా ఉంటుంది. వామును కొన్ని ప్రాంతాల్లో ‘ఓమ’ అని కూడా అంటారు. వాము ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుంది. ఆహారం అరిగించడంతో పాటు వాము అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వామును కూరలు, పరోటాలు, రొట్టెలు, పకోడీలలో వేస్తే రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వామును కొన్ని ప్రాంతాల్లో ఓమ అని కూడా అంటారు.

వాముతో ఉపయోగాలు..

అజీర్తితో బాధపడేవారు వాము, ఉప్పు, మిరియాలు ఈక్విల్ గా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే అజీర్ణం సమస్య నుంచి విముక్తి పొందుతారు. వామును నేతిలో వేయించి పటిక బెల్లంతో కలిపి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ను భోజనానికి ముందు తింటే.. అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
వయస్సు మళ్లిన తరువాత సహజంగా వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించడంలో వాము ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాము నూనెతో కీళ్లపై మర్దన చేస్తే కీళ్ల నొప్పుల నుంచి వెంటనే రిలీఫ్ దొరుకుతుంది.
వివిధ రకాల గుండెవ్యాధులు రాకుండా వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి వాము మంచి ఔషధం.

వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే జలుబు సమస్య తీరిపోతుంది.
వాము మూత్రకోశ వ్యాధులకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వామును తరచూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిలా చేయడంలో సహకరిస్తుంది.

గర్భవతులు తరచూ వాము తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాము రక్తాన్ని శుభ్రపరచటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సక్రమంగా సాగేలా సహకరిస్తుంది.

వేయించిన వామును జీలకర్ర నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే.. వాంతులకు తక్షణ మందులా పనిచేస్తుంది.వాము, జీలకర్ర, ధనియాలు ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, బెల్లం కలిపి తీసుకుంటే ఆస్తమాతో బాధపడేవారికి ఎంతో ఉపశమనం లభిస్తోంది.

వామును బుగ్గలోపల పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి తగ్గుతుంది.
మద్యం తీసుకున్న తర్వాత పొట్టలో ఏర్పడే వికారాన్ని నియంత్రించేందుకు వాము ఉపయోగపడుతుంది.
వామును కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మధ్య పెట్టుకుంటే అన్ని రకాలైన దంత సమస్యలు దూరమవుతాయి.