పవన్ అభిమానుల్లో కసి పెంచేస్తున్నారు. జనసేన కార్యకర్తల గుండెల్లో జ్వాలను రగిలిస్తున్నారు. వాళ్లు పిడికిళ్లు బిగించేసేలా చేస్తున్నారు. ఈ పవన్య కల్యాణ్ ఇంతేరా బాబూ నిలకడ లేదు అని అభిమానం ఉన్నా నీరసం వచ్చేసినవారిలో ఉత్సాహం తెప్పిస్తున్నారు. ఏంటి ఈయన రాజకీయం..ఆయనకు చేత కాదు… అని అభిమానం ఉన్నా తిట్టుకుని వదిలేసినవారు సైతం వెనక్కి తిరిగి చూసేలా చేస్తున్నారు. జగన్ అంటే చిరాకు పుట్టి.. చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారనే నిరుత్సాహంలో ఉన్నవారికి… ఊపిరి అందేలా చేస్తున్నారు. మొత్తం మీద జనమంతా పవన్ వైపు తిరిగి చూసేలా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నది ఎవరో కాదు..స్వయంగా జగన్మోహన్ రెడ్డి..ఆయన వ్యూహాలు. జగన్ తొక్కేయాలని చూస్తుంటే.. రివర్స్ లో పైకి లేస్తున్నాడు పవన్.
ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. సినీ పరిశ్రమ వ్యవహారంలో జగన్ చేస్తున్న ఆలోచనలపై ఏమనాలో అర్ధం కాక మీనమేషాలు లెక్కేస్తున్న పరిశ్రమ వర్గాలే ఆశ్చర్యపోయేలా విరుచుకుపడ్డాడు పవన్ కల్యాణ్. మీకెవరికీ చేత కాదు.. నేను చూసుకుంటా అన్న రేంజులో యుద్ధానికి ఆవేశంగా జెండా ఊపేశారు. ఇన్నాళ్లు రాజకీయాలు వదిలేసి సినిమాలు చూసుకుంటున్నాడు.. రాజకీయం అట్టట్టా చేస్తున్నాడనే విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు పవన్ ప్రసంగం కాక రేపింది. జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నా.. ఎన్ని తప్పులు చేస్తున్నా.. జనంలో బలం ఉంది అందుకే ఎక్కడా తగ్గటం లేదు.. ఎవరూ ఆపలేరా అని జనంలోని కొన్ని సెక్షన్లు ఎదురు చూస్తున్న వేళ పవన్ వారికి ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
పైగా పవన్ కు వ్యతిరేకంగా జగన్ ప్రయోగించిన అస్త్రం పోసాని కృష్ణమురళి. ఈ యుద్ధాన్ని మరింత రక్తి కట్టించారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించి.. పవన్ అభిమానులకు కోపం తెప్పించిన పోసాని… ఫోన్ కాల్స్ వేధింపులతో మరింత ఫ్రస్టేషన్ కు గురై .. సానుభూతి తెచ్చుకోవాల్సింది పోయి.. పవన్ అభిమానులను దోషులుగా నిలబెట్టాల్సింది పోయి…తానే నోరు జారి.. విపరీతమైన దుర్భాషలతో పవన్ ను పర్సనల్ గా అనటంతో.. అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పోసాని..ఆయన వెనక ఉన్న జగన్ దోషులుగా నిలబడే పరిస్ధితి వచ్చేసింది. సన్నాసి అనే పదం వాడిన పవన్ కరెక్టే అన్న వాదనలు మొదలయ్యాయి. ఎందుకంటే మంత్రులు సైతం.. అర్ధం పర్ధం లేని వాదనలతో పవన్ పై విరుచుకుపడటం కూడా..జనసేనకు ప్లస్ అయింది.
అసలు పోసాని మాటలతో రేగిన ఆవేశం .. చల్లారటం అనేది కాని పని. ఈ ఊపులోనే జనసేన కార్యకర్తలను లైన్లోకి తెచ్చి పోరాటాలు ప్రారంభిస్తే.. జనసేన బలం పెరుగుతుందనడంలో సందేహం లేదు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయంగా తప్పటడుగులు వేసింది వాస్తవం. ముందు బిజెపి,టీడీపీలకు మద్దతివ్వడం… ఆ తర్వాత వారిపై పోరాడకుండా.. ఎన్నికలకు సంవత్సరం ముందు హడావుడి చేయడం… పైగా సొంత బలాన్ని పెంచుకోకుండా తన సొంత ఇమేజ్ నే ఆధారం చేసుకుని పార్టీలతో పొత్తులు, ఫ్రెండ్ షిప్పులు చేయడం వలన 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించడం.. ఎవరిని బడితే వాళ్లను నమ్మడం వల్ల.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ఇంత జరిగినా… ఇసుక సమస్యపై గొంతెత్తగానే జనం తరలి వచ్చారు.. పవన్ బలం ఇంకా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.
అమరావతి సమస్యపైనా యాత్ర చేస్తానని ప్రకటించడంతో ఇంకా ఊపు వచ్చింది. కాని అంతలోనే సడెన్ గా డిల్లీ వెళ్లి బిజెపితో కలిసి.. అది వదిలేయటంతో జనంలో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోవటంతో అందరూ ఇదేంటి ఇలా చేస్తున్నాడని అనుకున్నారు. ఇక ఇంతేనా పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే కష్టమేనా అని చాలామంది అనుకుంటున్న వేళ… రాష్ట్రంలోని రహదారుల స్ధితిపై చేసిన ఉద్యమం కాస్త ఊరటనిచ్చింది. పర్లేదు లైనులో పడుతున్నాడా అని అనుకున్నారు.
వైసీపీ రాష్ట్రంలోని వ్యాపారాలను ఒక్కొక్కటిగా కబ్జా చేసుకుంటూ.. మరోవైపు సంక్షేమ పథకాలతో జనంలో పట్టు పెంచుకుంటూ డ్యూయెల్ రోల్ పోషిస్తోంది. వకీల్ సాబ్ తో పవన్ కల్యాణ్ క్రేజ్ ఎక్కడికీ పోలేదని అర్ధం కావడంతో… బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో మొదలెట్టిన వ్యవహారం.. చివరకు సినిమా వ్యాపారాన్నే చేతిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ ను దెబ్బతీయాలనే దాకా వచ్చింది. రివర్స్ గేర్ లో పవన్ కల్యాణ్ ఇప్పుడు రావడంతో కథ అడ్డం తిరిగింది.
ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా.. సొంత బలం పెంచుకోవడంపైనా.. క్రింది స్ధాయి వరకు పార్టీని యాక్టివేట్ చేయడంపైనా కేంద్రీకరించాలని.. అంటే ఒక పిలుపు ఇస్తే..ఏ స్ధాయిలోనైనా జనసేన కార్యకర్తలు అమలు చేసేంతగా మార్పు తెచ్చుకోవాలని.. విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. ఈ ఆవేశం ఇలాగే కంటిన్యూ చేయాలంటున్నారు.
ఒకటి మాత్రం వాస్తవం… పవన్ కల్యాణ్ వంద తప్పులు చేసినా సరే..101వ సారి రైటు చేస్తే చాలు.. అభిమానులు, జనం వెనక నిలబడతారు. వపన్ కల్యణ్ కు ఉన్న అడ్వాంటేజ్ అదే. ఏపీలో ఏ నాయకుడికి లేని అవకాశం పవన్ కే ఉంది. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో.. మరిన్ని తప్పులు చేసి వదిలేసుకుంటారో అంతా పవన్ మీదే ఉంది.