కులం వద్దు,మతం వద్దు…మానవత్వమే ముద్దు

Join your hands to clap for this Humanity

 

  • ఆత్మీయత నింపుకున్న స్వాగతం, చిరునవ్వుతో ఆహ్వానం

  • పచ్చని చెట్ల నీడలో నులివెచ్చని పలకరింపులు

  • ప్రకృతి సాక్షిగా పరవశించిన హృదయాంతరాలు

  • కన్నులపండువగా స్విమ్మర్స్ అసోషియేషన్ వనసమారాధన

  • అబ్బురపరచిన టూవీలర్‌ మెకానిక్స్ అసోషియేషన్‌ సమ్మేళనం

ఐకమత్యమే మా మహాబలం
ఐకమత్యమే మా మహాబలం

భక్తి శ్రద్ధలను పోగేసుకున్న “కార్తీకమాసం” శరణుకోరిన వారికి వరాలను అనుగ్రహిస్తూ వీడ్కోలు తీసుకుంది. బలవంతంగా కులాన్ని పులుముకున్న “వనసమారాధన” మౌనంగానే జాడ్యాన్ని భరిస్తూ వెళ్లిపోయింది. ఇదేమి ప్రత్యేకం కాదు, కొన్నాళ్ల నుంచి నడుస్తున్నదే కనుక అంతకు మించిన విభిన్నత సెలవు తీసుకున్నదానిలోనూ లేదు. ఇంతటి నిస్తేజం ఆవరించినప్పుడు ఇక దేనిగురించి మాట్లాడుకోవాలి అని నిలదీస్తే… మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకుని తీరాలి. పరిమళించిన మానవత్వం గురించి, వెల్లివిరిసిన సోదరభావం గురించి, నీరెండలో వికసించిన అలయ్ భలయ్ గురించి మాట్లాడి తీరాల్సిందే. అలా మాట్లాడుకునేలా చేసిన ఘనత ఎవరిదో తెలుసా..? మధిర స్విమ్మర్స్ అసోషియేషన్‌, మధిర టూవీలర్ మెకానిక్స్ అసోషియేషన్ నిర్వహించిన ఆత్మీయ వనసమారాధనదే!

బంధం ముందు కులం,మతం ఏపాటిది?
బంధం ముందు కులం,మతం ఏపాటిది?

#అరమరికలు లేవు,అపార్థాలు లేవు…అక్కడంతా ఆత్మీయతే!

కార్తీకమాసం అయిపోయిన తర్వాత వనభోజనాలు ఏమిటో? అయినా ఈతకొట్టే వాళ్లంతా భోజనాలు చేస్తే అది వనసమారాధన అయిపోతుందా? ఒకటా రెండా ఎన్నో విమర్శలు. వనసమారాధన అని మధిర స్విమ్శర్స్ అసోషియేషన్ ఎక్కడా ప్రకటించకపోయినప్పటికి, ప్రచారం చేసుకోనప్పటికి ఆత్మీయ సమ్మేళనంపై విరుపులు ఎన్నో ఎన్నెన్నో. అయినా సరే నొసటి విరుపులను ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్లు. విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయలేదు వాళ్లు. ఆహ్వానాన్ని అందుకుని విచ్చేసిన వారందరికి ఆత్మీయ స్వాగతం పలికారు స్విమ్మర్స్ అసోషియేషన్ సభ్యులు.కడుపులో కుట్రలేదు, కళ్లల్లో కుళ్లు లేదు. కులాల కంపు లేదు. మతాల మంట లేదు. 15 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా మధిర స్విమ్మర్స్ అసోషియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయత, అనురాగాలు వెల్లివిరిసాయి. అరమరికలు లేకుండా కలిసిపోయిన సబ్బండవర్ణాలను చూసి “పచ్చనిదనం” కుళ్లుకుంది. కుటుంబాల కలయికను చూసి ఆహ్లాద వాతావరణం పొంగిపోయింది. చిన్నారుల కేరింతలు, యువతి యువకుల సందడి చేసి కిలకిలరావాలు మౌనవ్రతాన్ని పాటించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మధిర స్విమ్మర్స్ అసోషియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం…అద్భుతం.

ప్రేమతో రంగరించిన అరిటాకు భోజనం ( స్విమ్మర్స్ అసోషియేషన్ )
ప్రేమతో రంగరించిన అరిటాకు భోజనం ( స్విమ్మర్స్ అసోషియేషన్ )
ప్రేమతో రంగరించిన అరిటాకు భోజనం ( స్విమ్మర్స్ అసోషియేషన్ )
ప్రేమతో రంగరించిన అరిటాకు భోజనం ( స్విమ్మర్స్ అసోషియేషన్ )

#ఆహా…ఏమి రుచి! అన్నారంతా మైమరిచి!

కొందరు ఒంటరిగా వచ్చారు. దాదాపు అంతా కుటుంబంతో కలిసి వచ్చారు. ఎలా వస్తే ఏమిటి, ఎప్పుడు వస్తే ఏమిటి? వచ్చిన వాళ్లంతా కలిసిపోయారు. ఆడారు, పాడారు, సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. పరిచయం లేని వారిని కలుపుకున్నారు. పోల్చుకోలేని వారి పేర్లు అడిగి మరీ… మనసువిప్పి మాట్లాడుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే…. అరిటాకులో భోజనం మరొక ఎత్తు. కడుపునిండా తినాలన్నా, కడుపునిండిపోయేలా వడ్డించాలన్నా సరే పెద్ద మనసు ఉండాలి. ఆ విశాలహృదయానికి ఏమాత్రం తీసిపోయేది లేదని నిరూపించారు మధిర స్విమ్మర్స్ అసోషియేషన్‌ సభ్యులు. ఆకాశమంత అరిటాకు వేసి నోటి తీపితో ప్రారంభించిన వడ్డన…కమనీయతను పంచే కమ్మటి పెరుగు వరకు వచ్చి ఆగింది. నోరూరించే బెల్లం జిలేబికి జతగా వేడి వేడి పకోడి కలిసి వచ్చి డ్యూయెట్ పాడింది. అతిధులకు ఏమాత్రం తక్కువ చేయలేదు. తక్కువ తింటే ఊరుకోలేదు. కొసరి కొసరి వడ్డించారు. కడుపునిండా తింటుంటే సంబురపడిపోయారు. ముందే చెప్పుకున్నట్లు.. కడుపునిండా తినాలన్నా, కడుపు నిండా వడ్డించాలన్నా సరే కల్మషం ఉండకూడదు అని…ఎక్కడైనా సరే తగ్గేదేలే అంటూ….. మామిడితోటలో మాధుర్యాన్ని పంచారు 15 వసంతాలు దాటుకున్న మధిర స్విమ్మర్స్ అసోషియేషన్ సభ్యులు.

కులాలు,మతాలు వేరైనా మేమంతా ఒక్కటే
కులాలు,మతాలు వేరైనా మేమంతా ఒక్కటే
సమాజహితమే మా ధ్యేయం,ఆశయం
సమాజహితమే మా ధ్యేయం,ఆశయం

#రిపేర్లు మాత్రమేనా లోపాలను సరిచేసిన మధిర టూవీలర్స్ మెకానిక్స్!

కులానికొక కలయిక, మతానికొక కూడిక ఉండే కార్తీకమాసం రోజుల్లో….అసమానతలను తీసేసిన క్రెడిట్ మధిర స్విమ్మర్స్ అసోషియేషన్‌కు మాత్రమే కాదు మధిర టూవీలర్స్ అసోషియేషన్‌కు దక్కితీరుతుంది. సాధారణంగా “బైక్‌ మెకానిక్స్” అంటే మెజారిటీ సమూహానికి ఒక చిన్నచూపు, గ్రీజు అంటిన చేతులు, ఆయిల్ ను ఆలింగనం చేసుకున్న దుస్తులు…మనం బండ్లు రిపేర్‌కు ఇవ్వకపోతే వాళ్లకు బతుకెక్కడ అనే ఇగో కొంతమందికి. ఎవరు ఏమి అనుకుంటే ఏమిటి? ఎలా అనుకుంటే ఏమిటి? మేము మాత్రం మనుషులం, మనసున్న మనుషులం అంటూ నిరూపించుకున్నారు మధిర టూవీలర్స్ మెకానిక్స్. కులాలకు, మతాలకు, వర్ణాలకు,వర్గాలకు అతీతంగా అంతా ఒక్కటై కదిలారు. తలో కొంతా వేసుకున్నారు. ఉన్నంతలో అత్యంత ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. పచ్చని వనాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తామంతా ఒక్కటేనని నిరూపించుకున్నారు. సమస్య వస్తే కలిసి పోరాడదాం ఆపద వస్తే కలిసి ముందుకు సాగుదామని నిండుమనస్సుతో ప్రతిజ్ఞ చేసుకున్నారు. వాహనాలకు మాత్రమే కాదు సమాజంలో అసమానతలను రూపుమాపే దిశగా మానవత్వంతో రిపేర్లు చేయాలని నిశ్చయించుకున్నారు మధిర టూవీలర్‌ బైక్ మెకానిక్స్‌ అసోషియేషన్ సభ్యులు. ఆత్మీయ సమ్మేళనంతో కల్మషం లేని కలువ పువ్వుల్లా వికసించారు.

#ముగింపు కాదు ఆరంభం కావాలి!

15ఏళ్లను ఎదురీదుకుని దూసుకుపోతున్న మధిర స్విమ్మర్స్ అసోషియేషన్, ఆత్మీయ సమ్మేళనంతో సౌభ్రాతృత్వాన్ని చాటుకున్న మధిర టూ వీలర్స్ మెకానిక్స్ అసోషియేషన్‌ మీకు తప్పకుండా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. కులాల కుంపట్లను ఎడమకాలితో తొక్కి మేమంతా ఒక్కటే అని చాటినందుకు మిమ్మల్ని తప్పకుండా అభినందించాల్సిందే. మీరు పంచిన ఈ స్ఫూర్తి పాఠాన్ని, సామరస్యగీతాన్ని ఎలుగెత్తి పాడాల్సిందే.. జీతే రహో..Vijaysadhu ( ఎడిటర్ ఇన్ చీఫ్‌ )