తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూర్తి అభద్రతా భావంతో ఉన్నారని, మహిళా మేయర్ కు భయపడుతున్నారని కాకినాడ నగర మేయర్ సుంకర పావని ఆరోపించారు. మేయర్ పావని పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి, టిడిపి రెబల్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అక్టోబరు 5వ తేదీన దీనిపై చర్చకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ పావని బుధవారం కాకినాడలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల పాటు ప్రజలకు సంపూర్ణ, పారదర్శక సేవలు అందించానని అది తనకు పూర్తి సంతృప్తిని ఇస్తోంది అన్నారు. అవిశ్వాసానికి భయపడి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం తన ఏడాది పదవీ కాలాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నారు.