కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా? ఆగండాగండి..

karivepaku benefits in telugu

మనలో చాలా మంది కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా తీసి పక్కన పెట్టేస్తారు. కానీ దీనిలోని పోషకాల గురించి అవగాహన ఉన్నా కూడా చాలామంది పెద్దగా పట్టించుకోరు. కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిలో మెండుగా ఉంటాయని తెలిసినా అలవాటు ప్రకారం తీసి పడేస్తారు. అయితే ఇకనుంచి అలా చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూరలోనే కాదు.. వీలయితే పచ్చిగా తిన్నా బోలెడు ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు.

కరివేపాకులోని ప్రయోజనాలు..

కరివేపాకులో విటమన్‌ ఎ, సి, పొటాషియం, కాల్షియం, ఫైబర్‌, రాగి, ఐరన్‌ వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బరువును అదుపులో పెట్టడంలో, మధుమేహం నివారణలో, పేగు సంబంధిత ఆరోగ్యానికి కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది.

కొవ్వులను నిరోధించడంలో..

కొలెస్ట్రాల్‌ స్థాయి అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు పొంచి ఉ‍న్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ చైనీస్‌ మెడిసిన్‌ అధ్యనాల ప్రకారం రక్తంలోని గ్లూకోజ్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించే గుణం కరివేపాకు రసంలో పుష్కలంగా ఉందని వెల్లడించాయి. ఈ పరిశోధకులు ఎలుకలకు వరుసగా 10 రోజుల పాటు కరివేపాకు రసాన్ని ఇంట్రాపెరిటోనియల్‌ ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చారు. దీనిద్వారా వీటి రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోస్‌ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. దీంతో రోజువారి ఆహారంలో భాగంగా కరివేపాకు ఆకులను తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరాయిడ్‌ స్థాయిలు అదుపులో ఉంచడానికి తోడ్పడుతుందని తేలింది.

కరివేపాకును ఇలా తీసుకోండి..

10 కరివేపాకు రెబ్బలు, చిన్న అల్లం ముక్కను నీళ్లలో వేసి 15 నిమిషాలు మరగనివ్వాలి. దీనిపై మూతను పెట్టి 10 నిముషాలు పక్కన పెట్ట్టి.. తర్వాత వడకట్టి తాగాలి. రుచికోసం దీనికి నిమ్మరసం, తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన టీని రోజు మొత్తంలో ఎ‍ప్పుడైనా తాగవచ్చు. అలాగే వివిధ రకాల వంటకాలలో కరివేపాకును చేర్చడం ద్వారా, కరివేపాకు పచ్చడి, లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ కొన్ని కరివేపాకు రెబ్బలను నేరుగా తిన్నా మంచిదే. ఇలా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ..హెల్దీ లైఫ్ ను లీడ్ చేయండి.