నాలుగో రోజు ఢిల్లీ పర్యటనలో కేసీఆర్

KCR Delhi Tour

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాలుగోరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులను 139 నుంచి 194కి పెంచాలని అమిత్ షాను కేసీఆర్‌ కోరనున్నారు. మొత్తం కేడర్‌ బలాన్ని సాధారణంగా అనుమతి ఇచ్చే 5శాతం పెంపునకు పరిమితం చేయకుండా 40శాతం మేర పెంచాలని విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ పోలీస్‌ కేడర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం పంపించింది. ఐపీఎస్‌ కేడర్‌ పోస్టుల కేటాయింపులు జరిపితే ఐపీఎస్‌ అధికారులను కమిషనర్లు, ఎస్పీలు, జోనల్‌ డీఐజీ, మల్టీజోనల్‌ ఐజీపీలుగా నియమించడానికి వీలవుతుందని అమిత్ షా దృష్టికి కేసీఆర్‌ తీసుకెళ్లనున్నారు. ఐపీఎస్‌ కేడర్‌ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించి ఆమోదముద్ర వేయాలని కూడా కోరనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, కృష్ణా నీటిలో తెలంగాణ వాటా, కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాలపై గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు.