కోయకుండానే ఉల్లి రైతుకు కన్నీళ్లు..!

Kurnool Onion Framers Cry with No Price for Crop

ఉల్లి రైతు లబోదిబోమంటున్నాడు. ఓ వైపు బహిరంగ మార్కెట్‌లో ధరలు మండిపోతుంటే… రైతుకు మాత్రం కనీస ధర రావడం లేదు. అసలు పంట కోయాలో వద్దో అని రైతులు మదన పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అలా వదిలేయలేక… నష్టానికి అమ్మలేక ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు…. కానీ ఈ ఏడాది రైతుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఓ వైపు భారీ వర్షాలతో ఉల్లి పంట దిగుబడి తగ్గినప్పటికీ… రైతుకు మాత్రం ఏ మాత్రం రాబడి కనిపించడం లేదు. ఉల్లి సాగు చేసిన రైతులకు ప్రస్తుతం కోత కూలీలు కూడా దక్కడం లేదు.

ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ సమయంలో లాభం వస్తుందని గంపెడాశ పెట్టుకున్న రైతుకు మాత్రం ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగు ఎక్కువగా కర్నూలు జిల్లాలో సాగు చేస్తారు. అలాగే తాడేపల్లిగూడెం మార్కెట్‌ అంటే ఉల్లి మార్కెట్ గానే పేరు. పంట దిగుబడి తగ్గడంతో.. ప్రస్తుతం ఉల్లి ధర కిలో 30 నుంచి 40 రూపాయల మధ్య పలుకుతోంది. రాబోయే రోజుల్లో ఈ రేటు 50 కూడా దాటవచ్చని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు ఆకాశాన్ని తాకడంతో… కొనుగోలుదారులు బాబోయ్ అంటున్నారు. అయితే రైతులు మాత్రం దళారుల చేతుల్లో నిలువునా మోసపోతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి. కోసిన పంటను యార్డుకు తీసుకువచ్చిన రైతులకు దళారులు చెబుతున్న మాటలతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. కిలో ఉల్లికి కేవలం 3 నుంచి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దళారులు. ఇక క్వింటాల్ ఉల్లి అయితే 400 రూపాయల కంటే తక్కువే. అదేమంటే… డిమాండ్ లేదు అంటున్నారు. అలా అని పంటను నిల్వ చేసి ధర వచ్చినప్పుడు అమ్ముదామనుకున్న రైతులకు సరైన గిడ్డంగులు కూడా అందుబాటులో లేవు.

మార్కెట్ యార్డులో మాత్రమే నిల్వ ఉంచాల్సి వస్తుంది. వర్షాలకు కోసిన పంట పాడవుతుంది. తేమ శాతం ఎక్కువగా ఉందని… ఇచ్చే ధరలో కూడా కోత పెడుతున్నారు దళారులు. దీంతో కష్టించి పండించిన ఉల్లి పంటకు కనీసం దారి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎకరా ఉల్లి సాగుకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు రైతులు. కానీ గిట్టుబాటు ధర లేకపోవడంతో… ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అప్పులు చేసి సాగు చేసిన పంటకు ధర రాకపోవడంతో… అప్పుల వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. పెట్టుబడిలో సగానికి సగం కూడా రాకపోవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.