జబ్బుల కోసం ఇంటర్నెట్లో వెతుకుతున్నారా? అస్సలు వద్దండీ..

ఒకప్పుడు ఆరోగ్యంలో కాస్త తేడా అనిపిస్తే పెరటి వైద్యాన్ని ఆశ్రయించడమో.. తెలిసిన డాక్టర్ దగ్గరకో వెళ్లడమో చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది టెక్నాలజీ పెరిగింది. ఇంటర్నెట్ సౌకర్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో.. అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్న తలనొప్పి వచ్చినా మొబైల్ లోనే జవాబును వెతుక్కుంటున్నారు. అయితే ఈ అలవాటును వెంటనే మానుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవగాహనా లోపంలో చేసే పొరపాట్లకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

చాలామంది తమకున్న వ్యాధులు, లక్షణాలు, ఇతర సమస్యల గురించి కూడా నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని చాలామందికి తెలియదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఎవరైనా తమ సమస్యను ఇంటర్నెట్ లో వెతికే లక్షణాన్ని సైబర్‌కాండ్రియా అంటారు. నెట్ లో వ్యాధుల గురించి వెతకడం వల్ల ఒక్కోసారి తప్పుడు సమాచారం లభించవచ్చు. అందుకే మనం వెతుకున్న ఇన్ఫర్మేషన్.. కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని ఫాలో అయితే మరింత అనారోగ్యం బారినపడే అవకాశముంది.

ఉదాహరణకు, తలనొప్పి నివారణ కోసం మనం నెట్ లో సెర్చ్ చేస్తే.. అలసట నుంచి బ్రెయిన్ ట్యూమర్ వరకు ప్రతిదీ అందులో చూపిస్తుంది. పొరపాటున తనకున్న లక్షణాలను ట్యూమర్ గా భావిస్తే తీవ్ర సమస్యలు వస్తాయి. తనకు ట్యూమర్ సమస్య ఉందేమోననే కారణంగా టెన్షన్ మొదలయి సరిగా నిద్ర ఉండదు. దాంతో సాధారణ సమస్య కాస్తా మరింత తీవ్రమవుతుంది. తనకున్న సాధారణ దగ్గు లేదా తలనొప్పి, ఇతర లక్షణాలను తీవ్రమైన అనారోగ్యంగా భావించి డాక్టర్ ను సంప్రదిస్తాడు. దాంతో డాక్టర్లు అనవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు.

గ్యాస్ వల్ల ఛాతీ మంట వస్తే.. డాక్టర్ దానిని గుండెపోటు లక్షణంగా భావించి.. అనవసరంగా ECG, ఎకో వంటి పరీక్షలు రాస్తారు. దాంతో రోగికి ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది. ఇలా జరగడానికి కారణం కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణమవుతుంటారు. వీటన్నింటి వల్ల ఇంకా భయం వచ్చి ఆందోళనకు గురవుతాడు.

సైబర్‌కాండ్రియాను ఎలా ఎదుర్కోవాలంటే..

అనవసరమైన భయం నుంచి రక్షించుకోవడానికి.. ఇంటర్నెట్‌లో లభించే సమాచారాన్ని ఫైనల్ గా పరిగణించవద్దు. నిపుణుల నుంచి సమాచారాన్ని తీసుకొని అందుబాటులో ఉండే వెబ్‌సైట్‌లలో మాత్రమే సమాచారాన్ని చూడాలి. డాక్టర్ అనుమతి లేకుండా ఇంటర్నెట్ లో చూసి సొంత వైద్యం చేసుకోవద్దు. మీకు ఏదైనా వ్యాధి లేదా లక్షణాలు ఉంటే నేరుగా డాక్టర్‌ని సంప్రదించడం మేలు. చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే అనవసరంగా ఆందోళన చెందకూడదు. అలాగే మరీ తేలికగా తీసుకోకూడదు.