చినబాబు… బాగా చిక్కాడు…!

Nara Lokesh
Nara Lokesh

చినబాబు బాగా సన్నబడ్డాడు. చినబాబు అంటే ఎవరో కాదండీ… మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గతంలో కొద్దిగా బొద్దుగా ఉండే చినబాబు… ఈ మధ్యకాలంలో సన్నగా… స్లిమ్ గా కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా మొన్న జరిగిన పార్టీ సమావేశంలో కూడా వెల్లడించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆ మధ్య జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో లోకేష్ ను పార్టీ నేతలంతా అడిగారూ కూడా. ఏమిటీ సార్ బాగా తగ్గారు అంటే… అవునండీ కరోనా సమయంలో.. రోజూ బాగా ఎక్సర్ సైజ్, వాకింగ్, సైక్లింగ్ చేశానంటూ వెల్లడించారు. అందుకే పాత చొక్కాలన్నీ ఇప్పుడు బాగా వదులుగా తయారయ్యాయంటూ జోకులు కూడా వేశారు చినబాబు.

ఇది జరిగి రెండు నెలలైంది. నాటి నుంచి నేటి వరకు కూడా లోకేష్ రోజు రోజుకూ తగ్గుతూనే ఉన్నారు. తాజాగా భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న నారా లోకేష్ ను గమనించిన రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీ నేతలు కూడా చినబాబు ఈ రేంజ్ లో సన్నబడటంపై ఆశ్చర్యపోతున్నారు. అసలు మన చినబాబేనా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. బొద్దుగా ఉండే లోకేష్… ఇలా బక్కగా అయిపోవడం… అలాగే మాట తీరులో కూడా మార్పు రావడం చూసి… ఈ ఏడాదిలో బాగా కసరత్తు చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు సరికొత్త చినబాబును చూస్తున్నామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. లోకేష్ బాడీ లాంగ్వేజ్ చూసిన నేతలు… రాబోయే రోజుల్లో పాదయాత్రకు ఏమైనా సన్నద్ధమవుతున్నాడేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే ఇలా సన్నబడ్డారేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.