రాముడు రావాల్సిందేనా..!

తాత పోలికలున్నోడు.. తాతలా అనర్గళంగా మాట్లాడగలడు.. తాత తర్వాత అంతటి స్టార్ డమ్ అందుకున్న నందమూరి వారసుడు. ఒకప్పుడు తాతలా ఖాకీ డ్రెస్ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించాడు. ఆ తర్వాత ఎందుకో దూరమైపోయాడు. దగ్గరకు రానందుకు సినిమాలను పనిగట్టుకుని ఫ్లాప్ కూడా చేయించారు. అప్పటి నుంచి రాజకీయాలకే దూరమైపోయాడు. నేను నా కెరీర్ అంతే అన్నట్లు వెళ్లిపోయాడు. తండ్రి వైసీపీ వైపు చూశారు… అయినా అడుగులు వేయలేదు. పిల్లనిచ్చిన మామ అయితే ఏకంగా వైసీపీ జెండా పట్టుకుని జగన్ కు జై కొట్టారు. అయినా ఏమీ మాట్లాడలేదు. జాన్ జిగరీ కొడాలి నాని టీడీపీని వదిలేసి వైసీపీలోకి వెళ్లటమే కాక.. చంద్రబాబుపై నిప్పులు కక్కుతూ ఉన్నాడు. మరో దోస్త్ వంశీ సైతం అదే దారి పట్టాడు.

అయినా ఎక్కడా నోరు మెదపలేదు. తాను మాత్రం తెలుగుదేశం పార్టీయేనని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. రాజకీయాల్లోకి ఎప్పుడు అంటే ఇంకా టైముంది అన్నారు.. ఇంకోసారి ఇది సమయం కాదు అన్నారు. అంటే రావాలని మనసులో ఉన్నా..సరైన సమయం కోసమే వేచి చూస్తున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశానికి ఉందా? లేదా?
ఇదే చర్చ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో జరుగుతోంది. మొదట కుప్పంలో ఆ తర్వాత మచిలీపట్నంలో చంద్రబాబు ఎదుటే తారక్ బొమ్మ చూపించి.. రావాలని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేశారు. మొదట ఎవరో కావాలని చేయిస్తున్నారనుకున్నారు.

కాని ఆ ట్రెండ్ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఈసారి ఏకంగా సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు కూడా వినిపించాయి. ఇన్నిజరిగినా చంద్రబాబు నోరు విప్పలేదు. ఈ పరిణామాలతో ఇప్పుడిప్పుడే కాస్త రాటుదేలుతున్నాడని చెప్పుకుంటున్న లోకేష్ కు ఇబ్బంది మొదలైంది. లోకేషా, ఎన్టీఆర్ ఎవరు బెటర్ అనే చర్చ మొదలైంది. పార్టీలో ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నవారేమో ఎన్టీఆర్ రావొచ్చు కాని.. లోకేష్ కు పోటీ కాదు అనే కామెంట్ చేస్తున్నారు. కిందిస్థాయిలో ఉన్న కార్యకర్తలు, పార్టీకి ఎన్టీఆర్ టైమ్ నుంచి సంప్రదాయకంగా మద్దతిస్తున్న కుటుంబాలు మాత్రం ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు.
లోకేష్ కు మాట్లాడటం సరిగా రాదు కాని.. తక్కువోడు కాదనేది ఆయన సన్నిహితుల వాదన. అయితే జనానికి ఇవన్నీ పట్టవు కదా.

తెలుగుదేశానికి ఉన్న ఏకైక దిక్కు ప్రస్తుతానికి చంద్రబాబే. అనుభవం ఉన్నా, మేధావి అయినా.. ప్రస్తుతానికి ఆయన పని అయిపోయిందనే మాటలు వినబడుతున్నాయి. ఒకవైపు అన్నివైపులా జగన్ ముట్టడించి మరీ దెబ్బలు కొడుతుంటే.. ఎదుర్కునే స్దితిలో పార్టీ లేదని అనిపిస్తోంది. అమరావతి లాంటి పెద్ద ఇష్యూ వచ్చినా..దానిని రైతులకే పరిమితం చేసి వ్యూహాత్మక తప్పిదం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కొక్కరు జారుకుంటుంటే ఏమీ చేయలేకపోతున్నారు. మరోవైపు నరేంద్రమోదీని ఏమీ అనకుండా..పైగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపిని నెత్తిన పెట్టుకునే ప్రయత్నం నడుస్తోంది. దీనిపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లోకేష్ గతంలో కంటే చురుగ్గా ఉన్నప్పటికీ… అవసరమైన యాక్షన్ ప్లాన్ అయితే లేదంటున్నారు. దూకుడు లేకపోతే ఈ రాజకీయ దునియాలో దున్నలేరని అనుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ వస్తే.. నీరసంగా ఉన్న పార్టీకి ఊపు వస్తుందని.. భవిష్యత్ కు ఒక నాయకుడున్నాడనే భరోసా కార్యకర్తలకు వస్తుందని.. పూర్వ వైభవం తెలుగుదేశానికి వస్తుందని.. ఆయన రావాలని కోరుకునేవారు వాదిస్తున్నారు.

అంతేకాదు.. నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్ కు మద్దతిస్తారంటున్నారు. బాలకృష్ణకు మాత్రం ఈ పరిణామాలు రుచించడం లేదనేది వాస్తవం. ఒక ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్సే చేశారు. పైగా సినిమాల్లోనూ బాలకృష్ణను ఎన్టీఆర్ ఎప్పుడో దాటేశాడు. బాలకృష్ణకు మాత్రం పార్టీ నడిపేంత సీన్ లేదని కూడా టీడీపీలో అనుకుంటున్నారు. వైసీపీలోకి వెళ్లి మళ్లీ వచ్చేసి సైలెంటుగా ఉన్నదగ్గుబాటి, బిజెపిలో ఉన్నా ప్రాధాన్యత లేక సైలెంటుగా ఉన్న పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ వస్తే… తెలుగుదేశంలోకి వచ్చేస్తారంటున్నారు. అలా అందరూ ఒక దగ్గరికి చేరతారని.. తెలుగుదేశం జెండాను ఎగరేస్తారని..ఎన్టీఆర్ అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. కాని తారక్ మనసులో ఏముందో తెలియడం లేదు. కాకపోతే రావడమైతే పక్కా.. ఎప్పుడనేదే సస్పెన్స్ అంటున్నారు.