ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్… కానీ రోగి పరిస్ధితి?

Off the record behind the success of TRS Meeting

 

  • మధిరకు కళ తెచ్చిన గులాబీదళం

  • TRS క్యాడర్‌లో హై స్పీడ్ జోష్‌

  • విరుచుకుపడిన మాజీ ఎంపీ పొంగులేటి

  • మాజీకి సిట్టింగ్‌ ఎంపీ నామా స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • పరిపక్వత నిండిన ప్రసంగంతో ఆకట్టుకున్న మంత్రి అజయ్

  • తనదైన మార్క్ చూపించిన మల్లాది వాసు

  • వికసించిన కమల్‌ రాజ్ బ్రాండ్

  • మైత్రి నిలిచేనా, విజయం దక్కేనా?

ఆఫ్‌ ది రికార్డ్ మాట్లాడుకోవాలంటే అది ఒక నియోజకవర్గ స్ధాయి సమావేశం, ఇంకా చెప్పాలంటే మమ అనిపించాల్సిన నూతన కమిటీల ప్రమాణ స్వీకారం. అధికారపార్టీ బాసూ…. ఆ మాత్రం ఉండదా అని నొసలు చిట్లిస్తారా?…. హిస్టరీని కాస్త పలుకరిస్తే ఎన్ని నియోజకవర్గ స్ధాయి సమావేశాలు, ఎన్ని నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ ఈస్ధాయిలో జరిగాయో చెక్ చేసుకుంటే సరి. దీన్ని ఉదాహరణ అనుకున్నా లేక పోలిక అనుకున్నా పర్లేదు కానీ… ఆదివారం నాడు జరిగిన TRSనియోజకవర్గ స్ధాయి సమావేశం అధికారదర్పాన్ని ప్రదర్శించింది అంతకు మించి గ్రాండ్‌ సక్సెస్‌ అయిందనేది వాస్తవం. మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీగా నామా నాగేశ్వరరావు ఇప్పటికే పలు సార్లు మధిరకు వచ్చి వెళ్లారు కానీ… నిన్న మాత్రం సమ్‌థింగ్ స్పెషల్‌. నింగిని అంటిన బాణసంచా నుంచి మార్మోగిన డప్పుల చప్పుళ్ల వరకు, గజ్జెకట్టి చిందేసిన పాదాల నుంచి ఓపెన్‌ టాప్ జీప్ నుంచి అభివాదాల వరకు, స్వాగత నృత్యాల నుంచి సింగిల్ కార్యకర్త కాలర్ ఎగరేసి మరీ ప్రదర్శించిన విజయగర్వం వరకు.. హోల్ అండ్ సోల్ సభ సక్సెస్..

#పొంగులేటి… ఇదేమిటి?

పొంగులేటి... ఇదేమిటి?
తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నించిన “పొంగులేటి”

పదవి లేకపోతే ఏమిటి? దుప్పటి కప్పుకుని పడుకోను. ప్రజల్లోనే ఉంటా, ప్రజలతోనే ఉంటా.. ఇదేదో ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న తెలుగు సినిమాలో పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్ అనుకోవద్దు.. ఇది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలియాస్‌ శీనన్నగా పిలుచుకునే సుకుమార హెచ్చరిక. శీనన్న అంటే ఒక బ్రాండ్ అంటూ జిల్లా TRS ముఖ్యుల సమక్షంలోనే అసంతృప్తి జ్వాలను వెళ్లగక్కారు పొంగులేటి . బహుశా… ఇంతకంటే మంచి తరుణం, ఇంతకు మించిన ప్లేస్‌ దొరకదు. అవకాశం దొరికినప్పుడే వాడుకోవాలని డిసైడ్ అయినట్లు ఉన్నారీ మాజీ ఎంపీ. అందుకే కాబోలు, తనకు తాను ప్రకటించుకున్నట్లుగానే శీనన్న బ్రాండ్ వేసుకునేందుకు ట్రై చేసారు. ఇదేమయినా కొత్తా అంటే అదీ కాదు… అదను దొరికినప్పుడల్లా కొన్నిసార్లు అవసరం లేకపోయినా సరే నా క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్నారు,నన్ను పట్టించుకోవట్లేదు అనేది పొంగులేటి అభ్యంతరం. ఇది ఇప్పుడు మంత్రి పువ్వాడ, ఎంపీ నామా సమక్షంలోనే వెళ్లగక్కారు. స్టేజ్‌ ఎక్కిన నాటి నుంచి పొంగులేటి ప్రేమికులంతా స్లోగన్స్‌ ఇస్తుండటంతో.. కాస్త ఉద్వేగానికి లోనై మాట్లాడారు కూడా. పొంగులేటి TRSకు దూరంగా ఉండటమో లేక పొంగులేటినే దూరంగా ఉంచడమో.. ఏ పరిణామమైనా సరే నష్టం చేసే ప్రమాదం ఉండటంతో అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్‌ కొన్ని సూచనలు చేసినట్లు టాక్. పార్టీ ఆదేశాన్ని శిరసావహించే మంత్రి పువ్వాడ అజయ్ రంగంలోకి దిగడంతోనే పొంగులేటి మధిర సభకు వచ్చినట్లు ఆఫ్ ది రికార్డ్. పోనీలే వచ్చారు కదా ఐక్యతారాగం వినిపిస్తారు అనుకుంటే టోటల్‌గా కచేరీ శృతి మాత్రమే కాదు లయ కూడా తప్పింది.. ఇలా అనటం కంటే పొంగులేటి తప్పించారు అనటం సబబేమో. మాజీ ఎంపీ స్పీచ్ ఆయన అభిమానుల్లో జోష్ నింపిందనేది వాస్తవమే కానీ…పొంగులేటి అసంతృప్తి “పరమాన్నంలో పంటికింద రాయి” అనేది రాజకీయ విశ్లేషకుల ఫీలింగ్. ఇతర నియోజకవర్గాల్లో తన క్యాడర్‌కు ఉన్న అసంతృప్తిని, వేరే ప్రాంతాల్లో నేతలపై ఉన్న అక్కసును మోసుకొచ్చి మధిరలో వెళ్లగక్కారనేది బహిరంగ రహస్యమే అయినప్పటికి…. లోగుట్టు పెరుమాళ్లకెరుక!

#నామా పెట్టిన కామా!

#నామా పెట్టిన కామా!
చురకలకు చెక్ పెట్టిన ఎంపీ “నామా”

షో స్టాపర్‌ గా షో స్టీలర్‌గా నిలిచేందుకు తీవ్రంగానే ప్రయత్నించిన మాజీ ఎంపీకి గట్టిగానే ఝలక్ ఇచ్చారు సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు. శీనన్న బ్రాండ్ అంటూ మాజీ ఎంపీ వార్నింగ్ ఇస్తే…. అంత సీన్ లేదు గురూ అంటూ గాలి తీసేసారు ఎంపీ నామా. నువ్వు కాదు నేను కాదు మరొకరు అంతకన్నా కాదు కేవలం కేసీఆర్‌ మాత్రమే బ్రాండ్ అంటూ సాగిపోయిన నామా స్పీచ్‌… పొంగులేటి వ్యాఖ్యలతో కంగుతిన్న క్యాడర్‌ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఖమ్మం జిల్లాలో ఎవరి బ్రాండ్స్‌ లేవు ఇక ముందు ఉండవు అని కుల్లం కుల్లా చెప్పటం మాత్రమేనా కేసీఆర్ ఒక్కరే బ్రాండ్ అంటూ కుండబద్దలు కొట్టేసారు ఎంపీ నామా. మాజీ ఎంపీ పొంగులేటికి సిట్టింగ్ ఎంపీ నామాకు కోల్డ్ వార్ ఉందనేది జిల్లాలో అందరికి తెలిసిన సీక్రెట్ .అయినా సరే దీన్ని కవర్ చేసుకుంటూ అధినేత కేసీఆర్‌ను ఆకాశానికెత్తేయటం నామా లౌక్యం. గతం నేర్పిన లౌక్యమో, గుణపాఠాలు ఇచ్చిన జ్ఞానమో కానీ ఎంపీ నామా మాత్రం తన మార్క్ చూపించారనటంలో రవ్వంత సందేహం లేదు.

#సాహో…. పువ్వాడ అజయ్!

#సాహో.... పువ్వాడ అజయ్!
గులాబీదళానికి మంత్రి అజయ్ దిశానిర్ధేశం

ఇతరులతో పోలిస్తే అనుభవం వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత, పొలిటికల్ పాఠాలు నేర్చుకుని తప్పటడుగులు వేసిన లీడర్స్‌ ట్రాక్‌ రికార్డ్‌ను చరిత్ర మనకు వద్దన్నా సరే చూపిస్తుంది. పువ్వాడ అజయ్ కూడా ఇదే గ్రూప్‌లో చేరిపోతారని ఖమ్మంజిల్లా మేధావులు మాత్రమే కాదు రాజకీయ ఉద్దండులు అనుకున్నారు. కానీ వాళ్ల ఆశలను అడియాశలు చేసిన ఘనత పువ్వాడ అజయ్‌దే. పోల్ మేనేజ్‌మెంట్‌లో తనకంటూ స్పెషల్ ట్రేడ్‌ మార్క్‌ సృష్టించుకున్న యంగ్ లీడర్ మినిస్టర్ పువ్వాడ అజయ్‌. ఎప్పుడు మధిర వచ్చినా సరే అజయ్‌కు టీఆరెస్ క్యాడర్ బ్రహ్మరధం పడుతుంది. అన్నింటికి మించి నిన్న మాత్రం పువ్వాడ అజయ్‌కు అఖండ స్వాగతం పలికింది టీఆరెస్‌ క్యాడర్‌. ఇలాంటి సభ ఇప్పటి వరకు మధిర నియోజకవర్గంలో మాత్రమే కాదు ఖమ్మం జిల్లాలోనే జరగలేదు అని మంత్రి అజయ్‌ సభాముఖంగా చెప్పటం మాత్రమే కాదు సన్నిహితులతో సంతోషాన్ని పంచుకున్నారు కూడా. సాధారణంగా పొంగులేటి స్పీచ్‌కు పువ్వాడ అజయ్ మరింత స్ట్రాంగ్ కౌంటర్‌ ఇస్తారని, ఇచ్చితీరాలని క్యాడర్ భావించింది. కానీ కేవలం కౌంటర్ ,ఎన్ కౌంటర్‌ మీదే ఫోకస్ పెట్టకపోవడం పువ్వాడ అజయ్ మెచ్యూరిటీకి నిదర్శనం అంటున్నారు పొలిటికల్ పండితులు. కలిసి ఉందాం, కలిసే ఉందాం అంటూనే కేటీఆర్‌ మన భవిత, కేటీఆర్ మన ఆశ అని గులాబీదళానికి దిశానిర్ధేశనం చేయటం అంటే… అధిష్ఠానానికి ఏ స్ధాయిలో మంత్రి గౌరవం ఇస్తారు, కేసీఆర్‌ విజన్‌ను నిజం చేయాలనే దానిపై ఏ రేంజ్‌లో దృష్టి పెట్టారనేది అర్ధమైపోతుందంటున్నారు మేధావులు. తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా ఇదే విజన్‌తో పువ్వాడ అజయ్ దూసుకుపోతే ముందు ముందు హై పొజిషన్‌లోకి వెళ్లటం గ్యారంటీ అట.

#కమాల్‌ కర్ దియా కమల్‌ రాజ్‌ !

#కమాల్‌ కర్ దియా కమల్‌ రాజ్‌ !
సభను సక్సెస్ చేసినందుకు కమల్ రాజ్ “అభివాదం”

వరుస పరాజయాలు వెక్కిరించినా, వాటిని సాకుగా చూపుతూ విమర్శకులు, వ్యతిరేకవర్గం వేధిస్తున్నా సరే… రెట్టించిన ఉత్సాహంతో టీఆరెస్‌ పునాదులను మధిర నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న నాయకుడు జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్. ప్రతీసారి విజయం ఖాయం అనుకున్నప్పుడల్లా ఫలితం రివర్స్‌ అవుతుండటం మైనస్ అయినప్పటికి మధిర గద్దెనెక్కాల్సిందే, గులాబీజెండా రెపరెపలాడాల్సిందే అనేది ఆయన వ్యూహం. అదే స్కెచ్‌తో విస్తరిస్తున్న కమల్‌ రాజ్ మార్క్‌… నిన్నటి సభలో స్పష్ఠంగా కనిపించింది. జనసమీకరణ నుంచి సభ గ్రాండ్ సక్సెస్ అయ్యే వరకు “కమల్‌” కమాల్ కర్ దియా అంటోంది అధికారపార్టీ క్యాడర్‌. ఎవరెంతగా చురకలు అంటించాలని చూసినా, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా సరే మంత్రి అజయ్, ఎంపీ నామాతో పాటు ఇతర టీఆరెస్ నేతల డైరెక్షన్‌లోనే నడుస్తానని, సీఎం కేసీఆర్‌ విజన్‌ను సాకారం చేసేందుకు గాను కేటీఆర్ పురుడు పోసిన రూట్‌ మ్యాప్‌.. రోడ్ మ్యాప్‌గా ఆవిష్కృతమయ్యేవరకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు కమల్‌రాజ్. నిజానికి మాజీ ఎంపీ పొంగులేటి చురకలు అంటించిన వారిలో కమల్‌రాజ్‌ కూడా ఉన్నారనేది ఓపెన్ కామెంట్. పొంగులేటి స్పీచ్‌ను, ఘాటు వ్యాఖ్యలను అసలేమాత్రం ఖాతరు చేయనట్లు వ్యవహరించటంలో కమల్‌రాజ్ సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు.

#మల్లాదివాసూ… చూపించావు గ్రేసు!

#మల్లాదివాసూ... చూపించావు గ్రేసు!
మల్లాదివాసును సన్మానించిన మంత్రి అజయ్

మధిర నియోజకవర్గంలో బలమైన “కమ్మ” సామాజిక వర్గానికి చెందిన నేత మల్లాది వాసు. గతంలో భట్టికి భుజం అందించినా సరే రాజకీయ సమీకరణలు మారటంతో హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కిన లీడర్ ఇతను. కౌన్సిలర్‌గా తనదైన ముద్ర వేసుకుంటున్న మల్లాది… నిన్నటి సభ విజయవంతం కావటంలో కాదనలేని పాత్ర పోషించారు. మంత్రి అజయ్‌కు సన్నిహితుడనే పేరు సంపాదించుకున్న వాసు.. పార్టీ ముఖ్యులకు స్వాగతం పలకటం నుంచి జనసమీకరణ వరకు ఇచ్చిన మాట తప్పలేదంటున్నాయి గులాబీదళాలు. మొన్నటి వరకు జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజ్‌కు మల్లాది వాసుకు కోల్డ్ వార్ ఉన్నదనేది ఎవరికి తెలియదు చెప్పండి. కానీ ఇప్పుడు మాత్రం వీరి దోస్తీని వర్ణిస్తూ అగ్నికి ఆజ్యం తోడైనట్లే ఉందంటున్నారు మధిర ప్రజలు. మరి ఈ మైత్రి ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదూ అంటున్నారు విమర్శకులు. అదీ నిజమే కదా?

కొన్ని అలకలు, లెక్కలేని ఆనందోత్సాహాలు. కొన్ని విరుపులు, అంతకుమించిన మెరుపులు,విమర్శలు … మొత్తానికి మధిర నియోజకవర్గ స్ధాయి సమావేశం, నూతన కమిటీల ప్రమాణస్వీకారం అట్టహాసం. మేమంతా ఒకటే అని చేతులెత్తి చాటారు సరే “ఇగో”లను విసిరేసి సక్సెస్‌ ఎవరు సొంతం చేసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ…. ఎందుకంటే “దాల్‌ మే కుచ్‌ కాలా హై” అని ఉర్దూ కవి గాలిబ్ ఊరకే అనలేదు మరి! By విజయ్ సాధు ( ఎడిటర్ ఇన్ చీఫ్‌ )