ఆయన రూటే.. అదప్పా..

PM Modi US Visit

 

ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. పాలక పక్షంలో సైతం గుసగుసలు వినిపిస్తున్నా.. ఆయనకు డోంట్ కేర్. ఎందుకంటే ఆయనకు టూర్లు అంటే ప్రాణం.. అందులోనూ విదేశీ పర్యటనలు అంటే ఆ పెద్దాయనకు అంతకు మించి అన్నమాట. అందుకే సందు దొరికేతే చాలు సంధి కుదుర్చుకునే వంకతో.. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తాననే సాకుతో ఫారిన్ ట్రిప్ వేసేస్తారు. వందల కోట్ల ఖజానా ఖాళీ అయినా.. ఆయనకు విదేశాలకు వెళ్లి ప్రముఖులతో కెమెరామెన్లకు ఫోజులివ్వడమే అలవాటు అయిపోయింది. ఇప్పటికే ఇదంతా ఎవరి గురించనే క్లారిటీ అందరికీ వచ్చే ఉంటుంది. యస్… ఆయనే ది గ్రేట్ పీఎమ్ నరేంద్ర మోదీ.

పాపం అలాంటి మోదీకి కూడా కాలం కలసిరాలేదు. ఎవరు ఎంత ఆపినా ఆగని ఆయనను.. కరోనా కంట్రోల్ చేసేసింది. దేశం కాదు కదా.. ఢిల్లీ కూడా దాటకుండా హద్దులు పెట్టేసింది. దీంతో ఎలాగో మనసుకు నచ్చచెప్పుకున్న మోదీ.. ఇప్పుడు కోవిడ్ కాస్త కనుకరించడంతో.. వెంటనే అమెరికా టూర్ పెట్టేసుకున్నారు. ఆగమేఘాల మీద అమెరికాలో వాలిపోయారు.

ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ పర్యటనలో కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణంలోని మార్పులు, ఇతర అంశాలతో చర్చిస్తారట. అంతేకాదు అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ టూర్ ఉద్దేశమట. సాధారణంగా పీఎమ్ పీఠమెక్కిన ప్రతి ఒక్కరికీ ఇది అవసరమే. అలా అయితేనే పక్క దేశాలతో సంబంధాలు కూడా మెరుగవుతాయి. అయితే మరీ ఇన్ని పర్యటనలు చేస్తూ… కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇంతగా ఖర్చు పెడుతున్న ప్రధానిగా .. ఇప్పటికే రికార్డులు సృష్టించారు మోదీ.

2014లో భూటాన్ తో విదేశీ టూర్ స్టార్ట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్,నేపాల్, జపాన్, యుఎస్ ఏ..అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాంతాడవుతుంది లెండి. వెళ్లిన దేశాలు మళ్లీమళ్లీ వెళ్లినవి కొన్ని.. కొత్త దేశాలు మరికొన్నిటిని అలా అలా విజిట్ చేసేసారు. చివరగా 2019 నవంబర్లో థాయిలాండ్, బ్రెజిల్ పర్యటనలు చేసారు. తర్వాత కోవిడ్ ఉధృతితో ఆయన అతికష్టం మీద ఢిల్లీకే పరిమితం అయ్యారు. అయితే 2021 మార్చిలో బంగ్లాదేశ్ కు టూర్ వేసిన మోదీ.. కాస్త లాంగ్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఆయన ఫారిన్ టూర్లపై మళ్లీ పంచ్ లు మొదలయ్యాయి. ఇక మోదీని ఎవరూ ఆపలేరంటూ సోషల్ మీడియాలో సెటైర్లు షురూ అయ్యాయి. ఏది ఏమయినా… ఆయన రూటే వేరప్పా..