‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేయనున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. 3డీ లో రూపొందే ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు లంకేష్ గా నటించనున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్టుగా ఆదిపురుష్ విడుదల తేదీని ప్రకటించాడు ప్రభాస్. ఆదిపురుష్ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న (11-08-2022) రిలీజ్ చేయనున్నట్లు డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారంటే పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తైన వెంటనే ఆదిపురుష్ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ మూవీ కావడంతో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ మలయాళ కన్నడ భాషలలో రిలీజ్ చేస్తారు. ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు విదేశీ భాషల్లోకి కూడా అనువాదం చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.