రజనీ పొలిటికల్ ఎంట్రీపై మన దగ్గరా చర్చ

ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల్లో ఏమి జరిగినా రెండు చోట్లా ప్రభావం పడుతుంది. అలాగే రెండు రాష్ట్రాల్లోను స్పందనలు తప్పనిసరి అయిపోయింది. తాజాగా తమిళనాడులో సంచలనమైన రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఇపుడు ఏపిలో కూడా తీవ్ర చర్చనీయాంశమైపోయింది. చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళు రజనీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటమే ఇందుకు నిదర్శనం.

చంద్రబాబు మాట్లాడుతు రజనీ తనకు బాగా సన్నిహితుడని చెప్పుకున్నారు. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై సంతోషించాలన్నారు. విశేషమైన అభిమానులున్న రజనీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని తీసుకున్న నిర్ణయం స్వాగతించాలన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు రాజకీయ పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్ కు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. జనబలం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని భావించారు. జనబలం ఉన్నవాళ్ళు అంటే తన గురించి కూడా కలిపే చెప్పకున్నట్లే అనిపిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమిళనాడు-ఏపిలు రాష్ట్రాలుగా రెండు వేర్వేరు అయినా మిగిలిన విషయాల్లో అంతా ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రం ప్రభావం మరొక రాష్ట్రంపై పడుతునే ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య చిత్తూరు నెల్లూరు జల్లాల సరిహద్దులున్న విషయం తెలిసిందే. అలాగే చెన్నైతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు లక్షలాది మందున్నారు. చెన్నైలోని సగం జనాభా తెలుగు వాళ్ళే అని చెప్పుకుంటారు.

విద్యా వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తుల పరంగా తెలుగువాళ్ళకి తమిళనాడుతో విడదీయరాని బంధం ఉంది. ఈ కారణంగానే తమిళనాడులో జరిగే ప్రతి డెవలప్మెంట్ మీద తెలుగువాళ్ళకు చాలా ఆసక్తి ప్రభావం ఉంటుంది. రజనీకాంత్ సినిమాలు తెలుగురాష్ట్రాల్లో కూడా ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చిత్తూరు జిల్లాలోని నగిరి పుత్తూరు చిత్తూరు ప్రాంతాల్లో అయితే డిఎంకె ఏఐఏడిఎంకె పార్టీల కార్యక్రమాలు కూడా రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఎందుకంటే పై ప్రాంతాల్లో తమిళం మాట్లాడే జనాలు వేలల్లో ఉన్నారు.