గ్రేటర్ ఎన్నికల్లో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదం?

2019లో జరిగి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాది మంది ఆంధ్రుల నోట వినిపించిన మాట రావాలి జగన్.. కావాలి జగన్. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ గెలుపులో ఈ నినాదం ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ పాపులర్ నినాదాన్ని తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వినియోగించటం ఆసక్తికరంగా మారింది. అదెలా సాధ్యం? గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీనే చేయటం లేదు కదా? మరి.. అలాంటప్పుడు ఈ పాపులర్ నినాదాన్ని ఎలా వినియోగిస్తారు? అన్న సందేహం వచ్చిందా? అదెలానంటే..

గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్ని సొంతం చేసుకోవాలన్న టార్గెట్ పెట్టుకొని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది అధికార టీఆర్ఎస్. మూడు దఫాలుగా అభ్యర్థుల జాబితానువిడుదల చేశారు. అందులో ఒకరు కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జగద్గిరి గుట్ట డివిజన్. ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు జగన్. సదరు అభ్యర్థి పేరు జగన్.

దీంతో.. తన ప్రచార రథంపై.. ఏపీలో పాపులర్ అయిన నినాదాన్ని.. తన ప్రచారరథం మీదనే ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచార వేళ.. మిగిలిన వారికి భిన్నంగా ఈ నినాదం అందరిని ఆకర్షిస్తోంది. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ రాసి ఉన్న ప్రచార రథం మీద ఆయన చేస్తున్న ప్రచార ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చూసినంతనే ఏపీలో ఎన్నికల ప్రచారానికి వాడిన వాహనాల్ని తీసుకొచ్చినట్లుగా కనిపించక మానదు. హడావుడిలో అప్పట్టో వేసిన స్టిక్కర్ తొలగించలేదనుకునే అవకాశం ఉంది. కానీ.. అభ్యర్థి పేరు జగన్ అన్న విషయం తెలిసిన తర్వాత మాత్రం.. మనోడి తెలివిని అభినందించకుండా ఉండలేం.