కొందరిది “కాసులవేట”…మరికొందరిది “ఆరోగ్య బాట”

Repercussions of RMP References

 

  • గ్రామాల్లో అందుబాటులో ఉండే “వైద్యుడు” RMP

  • సుస్తీ చేస్తే చాలు పిలుపుకు దగ్గర్లో ఉండే ఆపద్భాంధవుడు

  • రోగుల నమ్మకాన్ని దండుకుంటున్న కొందరు RMPలు

  • ప్రాణం మీదకు తెస్తున్న RMPల రిఫరెన్స్‌లు

  • ఆరోగ్యాలతో ఆడుకుంటున్న మధిర “మున్నాభాయ్‌ MBBS”

  • బతికి బట్టకట్టాలంటే “శంకర్‌దాదా MBBS”కు నో చెప్పాల్సిందే!

  • నమ్మిన పాపానికి నట్టేట మునిగిన ఒక “మహిళ వ్యధ” ఇది!

రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌…ఇలా చెబితే ఎవరికి అర్ధం కాకపోవచ్చు కానీ RMPఅంటే మాత్రం తెలియని వాళ్లు ఉండరు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కునారిల్లే చోట, సదుపాయాల లేమితో రోగులను వెక్కిరించే చోట… ఆపద్భాంధవుడిలా కన్పించే వ్యక్తులే RMPలు. ఇంకా చెప్పాలంటే డాక్టర్లు కాని డాక్టర్లు. కొన్ని సార్లు MBBSలు చదువుకున్న వాళ్లే కడుపులో కత్తెరలు,దూది కట్టలు పెట్టి మర్చిపోయే చోట, తప్పు బయట పడ్డాక సిగ్గులేకుండా బాధితులు అమ్ముడుపోయారు అంటూ నిందలు వేసే నీచులు ఉన్న చోట RMPలే ఆరోగ్యాన్ని ఇచ్చే దాతలు. ఇప్పుడు RMPల గురించి, వారి ప్రాక్టీస్‌ గురించి, వాళ్ల రిఫరెన్స్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో తెలుసుకోవాలంటే….. ఈ వ్యధ చదవండి.

ఈ "కన్నీటి కానుక" మధిర మున్నాభాయ్ చలవే!
ఈ “కన్నీటి కానుక” మధిర మున్నాభాయ్ చలవే!

#ఆంధ్రా RMPనమ్మాడు…మధిర మున్నాభాయ్‌ ముంచాడు

అది 2021 ఏప్రిల్ నెల, అంటే నేటికి 7నెలల క్రితం. కృష్ణా జిల్లా తాళ్లూరుకు చెందిన మహిళ, అనారోగ్య సమస్యతో అదే గ్రామానికి చెందిన RMPవద్దకు వెళ్లింది. రెండు రోజులు ట్యాబ్లెట్లు వాడమని చెప్పాడు. అయినా సరే తగ్గలేదు. నమ్మకంతో వచ్చిన ఆమెను అనారోగ్యం నుంచి బయటపడేయాలనే ఆశయంతో లాభాపేక్ష ఎరుగని ఆ RMP,ఖమ్మం జిల్లా మధిరలోని KVRఎమర్జెన్సీ హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు.ఆ మహిళా రోగిని పరీక్షించిన డాక్టర్ కోటా రాంబాబు… బ్లీడింగ్ కనుమరుగు కావాలంటే ఆపరేషన్ చేయాలంటూ చెప్పాడు. ఆపరేషన్‌ రెండు విధాలుగా చెయ్యవచ్చు ఒకటి కడుపు కోయటం రెండవది లాప్రోస్కోపిక్ విధానం. రెండింటిలో ఏది కావాలో డిసైడ్ చేసుకోమంటూనే లాప్రోస్కోపిక్‌ అయితే మంచిది అంటూ సలహా ఇచ్చిపారేసారు. డాక్టర్ గారు ఇంతబాగా చెబుతున్నారు, ఇంకెంత బాగా ఆపరేషన్‌ చేస్తారోనని రోగితో పాటు ఆమె కుటుంబ సభ్యులు,RMPనమ్మేసారు.దాదాపు 40వేల రూపాయలు తీసుకుని లాప్రోస్కోపిక్ పద్దతిలో ఆపరేషన్ చేసి 6రోజులు హాస్పిటల్‌లో ఉంచుకుని పంపించేసారు. అంతా బాగానే ఉంది,అంతా బాగైపోయిందని నమ్మిన ఆ నిరుపేద కుటుంబం వెళ్లేటప్పుడు..కృతజ్ఞతతో KVRఎమర్జెన్సీ హాస్పిటల్‌ అధినేత కోటారాంబాబుకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్లిపోయారు.

ఆ "నరకయాతనను" వివరిస్తున్న బాధితురాలి సోదరుడు
ఆ “నరకయాతనను” వివరిస్తున్న బాధితురాలి సోదరుడు

#ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కానీ రోగి?

స్వస్ధలం కృష్ణాజిల్లా తాళ్లూరు అయినప్పటికి ఖమ్మంజిల్లా మధిరమండలం సిరిపురం గ్రామంలో నివాసం ఉంటుంది ఆ మహిళా రోగి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరు కూలీకి వెళితే తప్పితే నడవని బతుకు బండి. ఈ మాయదారి అనారోగ్యం తగ్గిపోతే…మళ్లీ కూలీ చేసుకుని తమకున్న ఇద్దరు బిడ్డలను చదివించుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆయనగారి “హస్తవాసి” అలా ప్రశాంతంగా ఉండనిస్తుందా? ఆపరేషన్ జరిగిన 10రోజులకు అసలు సమస్య ప్రారంభం అయింది. బ్లీడింగ్ తో పాటు మూత్రం అడ్డు అదుపులేకుండా పోతోంది. అసలు మూత్రం ఎప్పుడు వస్తుందో, తన నియంత్రణ లేకుండా ఎలా పడిపోతుందో కూడా తెలియని దుస్దితికి ఆమెను తీసుకువచ్చింది డాక్టర్ కోటా రాంబాబు అరకొర వైద్యం. అంతులేని భయంతో మళ్లీ మధిర KVRఎమర్జెన్సీ హాస్పిటల్‌ కు వెళ్లారు. ఇది చాలా చిన్న సమస్య తగ్గిపోతుంది, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పాడట డాక్టర్ కోటా రాంబాబు. నలుగురిలో ఉండలేని, పదిమంది మధ్యలో ఉండలేని దుస్ధితిని ఇంత లైట్‌గా తీసుకున్నాడేంటని…ఇక్కడకు రిఫర్‌ చేసిన తాళ్లూరు RMPకి తమ బాధను వివరించారు బాధితులు. ఆపరేషన్‌లో లోపాన్ని గుర్తించిన ఆ RMPనేరుగా వచ్చి డాక్టర్‌ కోటా రాంబాబును నిలదీసాడు.మరొకసారి ఆపరేషన్ చేద్దాం అంటూ చెప్పుకోలేని చోట కుట్లు వేసాడట “మధిర మున్నాభాయ్ MBBS”డాక్టర్ కోటా రాంబాబు.అయినా సరే ఫలితం లేదు. మూత్రం ఆగటం లేదు. ఎప్పుడు పడిపోతుందో, ఎలా పడిపోతుందో పాపం ఆ అభాగ్యురాలికి తెలియదు. ఇక ఉపేక్షిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన తాళ్లూరు RMP,బాధితులతో కలిసి డాక్టర్ కోటారాంబాబును నిలదీస్తే… నేను చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. నా వల్లే తప్పు జరిగింది అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు. ప్రాణాపాయం అంటూ ఖమ్మం డాక్టర్లు చెబుతుంటే.. ఇప్పుడు తప్పు ఒప్పుకుంటే ఏం ప్రయోజనం అంటూ ఆ తాళ్లూరు RMPనిప్పులు చెరిగారు. ఇక తప్పించుకునే ఛాన్స్ లేకపోవడంతో…. ఖమ్మంలో ఒక వైద్య నిపుణుడి వద్ద మళ్లీ ఆ మహిళకు ఆపరేషన్ చేయించాడు డాక్టర్ కోటా రాంబాబు. కేవలం ఆపరేషన్ ఖర్చు మాత్రమే డాక్టర్ కోటా రాంబాబు భరించాడు కానీ…..ట్యాబ్లెట్లు, స్కానింగ్స్, ఇతర పరీక్షలు అంటూ ఇప్పటి వరకు ఆ నిరుపేద కుటుంబానికి లక్ష రూపాయలకు పైనే ఖర్చు అయ్యాయి. అయినా సరే నేటికి ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఆర్ధిక సహాయం ఆమె సోదరుడు అందించటం వల్ల, ఇంటి పనుల్లో తన ఇద్దరు బిడ్డలు అండగా ఉండటం వల్ల రోజు గడుస్తోంది. ఆమె భర్త రెక్కలను ముక్కలు చేసుకోవటం వల్ల కుటుంబం గడుస్తోంది.

అయ్యా...మీ వైద్యానికో దండం సామీ!
అయ్యా…మీ వైద్యానికో దండం సామీ!

#వచ్చి రానీ వైద్యం…రోగులకు ప్రాణసంకటం!

“మధిర మున్నాభాయ్ MBBS”డాక్టర్ కోటారాంబాబు “హస్తవాసి” అంతచిన్నదేం కాదు. మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన “తిరుపతిరావు” చేతికి ఆపరేషన్ చేస్తే, నరాలు తెగిపోయి చచ్చుబడిపోయింది. 50వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు కానీ మళ్లీ తన చేతిని యధాస్ధితికి తెచ్చుకోవడానికి తిరుపతిరావుకు దాదాపు 3లక్షలు ఖర్చు అయ్యాయి. బోనకల్లు మండలం కలకోట గ్రామానికి చెందిన “షేక్ మోయిన్‌” అనే యువకుడికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తే.. అది వికటించి పెద్దపేగు తీసేయాల్సి వచ్చింది. నేటికీ బాధితుడు మోయిన్ జీవచ్ఛవంగానే బతుకుతున్నాడు. ఇక ఎర్రుపాలెం గ్రామానికి చెందిన పంబి సాంబశివరావు అనే వ్యక్తి భార్యకు ఆపరేషన్ చేసి..కడుపులో దూది కట్ట పెట్టి మర్చిపోయాడు. అది కాస్తా ఇన్‌ఫెక్షన్ అయి ఆమెకు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా ఆమె కుట్లు రసికారుతూ ఉంటాయి. చెప్పుకోలేని తీవ్ర వేదన ఆమెది. ఇప్పుడు ఈ మహిళ… చెప్పుకుంటూ పోతే చాంతాడంత. పాపం, పెద్ద డాక్టర్ వద్దకు వెళితే ఆరోగ్యం కుదుటపడుతుందనే కొండంత నమ్మకంతో ఆ తాళ్లూరు RMP,KVRఎమర్జెన్సీ హాస్పిటల్‌ కోటారాంబాబు వద్దకు తీసుకువచ్చాడు. పాపం మన “మున్నాభాయ్ MBBS” ట్రాక్ రికార్డ్ ఆయనకు గానీ, బాధితురాలి కుటుంబానికి గానీ తెలియదు. ఆ తెలుసుకోలేని తనానికి చెప్పుకోలేని నరకాన్ని నేటికి అనుభవిస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

#ఇదంతా నిజం కాదు అనే దమ్ము ఉందా?

ఇది రాజకీయకుట్ర, ఇది నా ఎదుగుదలను ఓర్వలేని వారి విషప్రచారం, ఆపరేషన్లు అన్నతర్వాత మెడికల్ కాంప్లికేషన్లు వస్తాయి, అది సహజం.. చిన్నదాన్ని ఇలా భూతద్దంలో పెట్టి చూపిస్తే ఎలా? ఇలాంటి డైలాగులు కాస్త పక్కనపెట్టి… తిరుగులేని ఆధారాలు లేకపోతే జర్నోటీమ్‌ రంగంలోకి దిగదు, కళ్లు బైర్లు కమ్మే సాక్షాలు లేకపోతే జర్నోటీమ్ వార్తను ప్రసారం చేయదు అని ఎప్పటికి మర్చిపోవద్దు. ధర్నాలు చేస్తే, చేయిస్తే బెదిరిపోతారు, తప్పుడు కేసుల్లో ఇరికిస్తే తట్టా బుట్టా సర్ధుకుంటారు, సోషల్ మీడియాల్లో విషప్రచారం చేస్తే వచ్చి కాళ్ల మీద పడతారు అనుకోవటం కొందరి మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఇంకెందుకు ఆలస్యం? ఇదంతా పచ్చి అబద్దం.. బాధితురాలిని కొనేసారు. బాధితురాలి కుటుంబం డబ్బుకు అమ్ముడుపోయింది అనే విషపు రాతలను, ప్రచారాలను “జర్నోటీమ్‌” మీద చేయించే అలవాటు ఉంది కదా, కానివ్వండి. కడుపులో దూదిపెట్టి కుట్టేసి, ఎర్రుపాలెం గ్రామానికి చెందిన పంబి సాంబశివరావు భార్యకు మధిర మున్నాభాయ్ MBBS డాక్టర్ కోటారాంబాబు ఎలా నరకం చూపించాడో, పంబిసాంబశివరావు “వ్యక్తిత్వాన్ని” దిగజార్చేలా డాక్టర్ కోటా రాంబాబు ఎలా మాట్లాడాడో, మధిర మున్నాభాయ్ MBBS అడుగులకు మడుగులు ఒత్తే “మధిర రచ్చబండ” ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్‌… పంబి సాంబశివరావు కుటుంబ పరువును బజారుకు ఈడ్చేలా ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నాడో.. వీటి అన్నింటికి తిరుగులేని ఆధారాలతో, కాదనలేని సాక్ష్యాలు చూపిస్తాం. ఇది మాత్రమే కాదు నేపాల్‌లో కేవలం MBBS పూర్తి చేసిన ఒక యువ మహిళా వైద్యురాలిని తీసుకువచ్చి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామినేషన్‌ (FMGE)లో రెండు సార్లు ఫెయిల్ అయిన అదే యువ వైద్యురాలితో కృష్ణాజిల్లా వత్సవాయిలో చట్టవిరుద్ధంగా “అరుణ హాస్పిటల్” నడిపించిన తీరు, 4నెలల క్రితం ఆమె “అనుమానాస్పద మరణం” వరకు ప్రతిదాన్నీ ప్రజలముందుకు తీసుకువస్తాం. గెట్ రెడీ.

#ఆర్‌ఎంపీలు కాస్త ఆలోచించండి!

ముందే చెప్పుకున్నట్లు కొందరు RMPలు “కమీషన్లు” దండుకోవటం కోసమే ఉన్నారు. తమకు తెలిసిన పేషేంట్లను మధిర, ఖమ్మం, విజయవాడలోని హాస్పిటల్స్‌కు రిఫర్‌ చేస్తూ, పేషెంట్లను వెంటపెట్టుకుని వెళుతూ జేబులు నింపుకుంటున్నారనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ RMPలు అందరూ అలా కాదు. తమను నమ్ముకున్న పేషేంట్ల కోసం నిలబడతారు, పోరాడతారు. నష్టపోయిన బాధితుల తరపున గొంతుకగా ఉంటారు. ఇందుకు వారిని ఎంతగా ప్రశంసించినా తక్కువే కానీ… పెద్దవాళ్లు చెప్పినట్లు అడుసుతొక్కనేల, కాలు కడగనేల? నిజం చెప్పాలంటే RMPలకు డబ్బు ఆశ చూపించింది పెద్ద డాక్టర్లే. పేషేంట్‌కు ఇంత కమీషన్ ఇస్తాం అంటూ ఎర వేసింది కొందరు డాక్టర్లే. ఆ దుర్మార్గం నేటికి కొనసాగుతుండటం విచారకరం. అందుకే RMPలకు ఒక విన్నపం. మీరు రిఫర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆ డాక్టర్‌ ట్రాక్ రికార్డ్ చెక్‌ చేసుకోండి. రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని “మున్నాభాయ్‌ MBBS”లకు దూరంగా ఉండండి. డాక్టర్లు ఇచ్చే కమీషన్లు, బహుమానాలు కేవలం తాత్కాలికం.. మిమ్మల్ని నమ్ముకున్న రోగుల బంగారు భవిష్యత్తు మీకు అత్యంత ప్రధానం అనే నిజాన్ని కలలో కూడా మర్చిపోవద్దని అభ్యర్ధన. Vijaysadhu (ఎడిటర్ ఇన్ చీఫ్‌)