ప్రతిపక్ష సభ్యుల చర్యలు అత్యంత హేయమైనవని … ఆ రోజు నిద్ర కూడా పట్టదు : స్పీకర్ తమ్మినేని

ఏపీలో గత ఐదు రోజులుగా శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజే సమావేశాలకి చివరి రోజు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యులు 4 రోజులుగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించుకోవచ్చునని అయితే సభ నియమనిబంధనలకు లోబడి సభ సంప్రదాయాలను పాటించాలని అన్నారు.

అయితే ప్రతి రోజు సభ సజావుగా జరగకుండా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ రభస చేయడం దురదృష్టకరమని అన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యుల చర్యలు అత్యంత హేయమైనవని దీనిపై శాసనసభాపతిగా ఎంతో బాధతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తమ్మినేని చెప్పారు. సభకు సహకరించాలని ఈ విధంగా చేయడం సరికాదని ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన రోజున మనసికంగా ఎంతో బాధపడతానని నిద్ర కూడా పట్టదని చెప్పుకొచ్చారు.

కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఆ ఆలోచనే లేదని మరో ప్రత్యామ్నాయం లేకనే సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సభ సజావుగా సాగించాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో కొన్ని సవరణలు తీసుకురావాలని ఇందుకు సభా నాయకుడు సభ అనుమతించాలని స్పీకర్ తమ్మినేని అన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే రాజకీయాలు మాట్లాడతారని దీనిపై అధికారపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నయని వార్తల్లో సమ భాగం రావాలని వారు కోరుకుంటున్నారని ప్రజలు మనల్ని గమనిస్తున్నారని సరైన సమయంలో నిర్ణయాలు ప్రకటిస్తారని సభాపతి చెప్పుకొచ్చారు.