రీమేక్ విషయమై క్లారిటీ ఇచ్చిన సుజీత్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో చత్రపతి రీమేక్ తెరకెక్కబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్ కు సాహోతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఆయన సన్నిహితులు స్పందించి రీమేక్ కు ఆయన దర్శకత్వం వహించడం లేదని యూవీ క్రియేషన్స్ లోనే ఆయన మూడవ సినిమా ఉంటుందని అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా దర్శకుడు సుజీత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

తాను ఏ రీమేక్ చేయడం లేదు అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అతడు చత్రపతి రీమేక్ విషయమై ఆసక్తిగా లేడని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక సుజీత్ ఒక కథను సిద్దం చేసుకుని స్టార్ హీరోకు వినిపించేందుకు వెయిట్ చేస్తున్నాడు. సాహో సినిమా ఇక్కడ కాస్త నిరాశ పర్చడం వల్ల ఈయనకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు.

దానికి తోడు ఈయన లూసీఫర్ రీమేక్ కు ఎంపిక అయినట్లే అయ్యి అవకాశం కోల్పోవడం వల్ల కూడా ఈయన పై సినీ వర్గాల్లో అపనమ్మకం అనేది ఏర్పడింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో సుజీత్ ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఖచ్చితంగా స్టార్స్ ఈయన వద్ద క్యూ కడతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.