ఇప్పుడు కూడా మీ మాటే వినాలా.. గోరంట్ల ఫైర్

నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాట వినమంటే.. తప్పదు మరి వింటారు. నువ్వు వీక్ అయ్యాక కూడా నీ మాటే వినాలంటే తిక్క రేగుద్ది. ఇంత జరిగినా.. ఇప్పుడైనా తన మాట వినకుండా.. ఇంకా వారి మాటే చెల్లాలంటే.. ఇంకానా ఇకపై చెల్లదు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తేల్చి చెప్పేశారు. కాదంటే చెప్పండి.. ఇక్కడ బాముకునేదేమీ లేదు.. రెస్ట్ తీసుకుంటానంటూ మొహం మీదే చెప్పేశారు. అసలే కష్టాల్లో ఉన్న పార్టీ.. ఇలాంటి స్ట్రోక్ తగిలేసరికి.. ఒక్కసారి భ్రమల్లోంచి బయటికొచ్చి.. ఇప్పుడు ఆ పెద్దాయనను కూల్ చేయాలని చూస్తున్నారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశంలో లెజెండ్ అని చెప్పొచ్చు. అంత సీనియర్.. అన్న ఎన్టీఆర్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎత్తిన జెండా దించలేదు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా  నిలబడే ఉన్నారు. ఎదురుగాలి వీచిన మొన్నటి ఎన్నికల్లో సైతం గెలిచి అసెంబ్లీలోకి వెళ్లారు. అసెంబ్లీలో సైతం.. అచ్చెన్నాయుడిని సస్పెండ్ చేస్తే నిలబడి కలబడింది ఈయనే. అలాంటి ఆయన మాటను ఆఫ్టరాల్ రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో లెక్క చేయకపోతే మండదా మరి.ఆయన లీడర్ గా ఉన్న ఏరియాలో కూడా.. ఆయన మాట చెల్లకుండా.. వేరేవాళ్లకు ప్రయారిటీ ఇచ్చినందుకే ఇప్పుడు చౌదరిగారు అలిగినట్లు తెలుస్తోంది. నా మాటకే విలువ లేనప్పుడు.. నేనెందుకు.. ఈ పార్టీ ఎందుకు అని డైరెక్టుగానే కడిగిపారేశారట. దీంతో రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో రావటంతో.. టీడీపీ నేతలు అలర్టయ్యారు. ఇదంతా లోకేష్ వల్లేననే టాక్ వినపడుతోంది.

ఇప్పుడు పార్టీ మొత్తం మీద లోకేష్ గ్రిప్ సంపాదించే పనిలో పడ్డారు. ఎంత కాదనుకున్నా.. చంద్రబాబు ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. ఫీల్డ్ మీదకు లోకేష్ మాత్రమే వెళుతున్నారు. అలా ప్రతి చోట నిర్ణయాలు తీసుకునేది లోకేష్ మాత్రమే. లోకేష్ బలగం అంతా యువ నాయకులే. వీరంతా కలిసి సీనియర్లను పట్టించుకోకుండా వన్ సైడు నిర్ణయాలు తీసుకుంటుండంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికిది సద్దుమణిగినా.. లోకేష్ సీనియర్లకు వాల్యూ ఇవ్వకపోతే.. తర్వాత తర్వాత కష్టమే అని కామెంట్లు వినపడుతున్నాయి. సీనియారిటీ ఉన్నా, వాగ్దాటి ఉన్నా సరే.. చాలామంది నాయకులు సైలెంటుగా ఉండటానికి ఈ వాతావరణమే కారణమంటున్నారు. మరి ఇప్పటికైనా చినబాబు చక్కదిద్దుకుంటారో లేదో చూడాలి మరి.