టీడీపీ అధ్యక్ష మార్పు తప్పదా..?

TDP think change the president

 

ఏపీ తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడా.. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడును తప్పిస్తున్నారా..‌ అంటే.. అవుననే అంటున్నారు పార్టీ నేతలు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు. వారిలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ కు మద్దతు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అటు మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

2019 ఎన్నికల‌ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తిరిగి మరో బీసీ వర్గానికి చెందిన నేతగా… దూకుడుగా వ్యవహరించే కింజరాపు అచ్చెన్నాయుడుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. మొదట్లో అధికార పార్టీ పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు అచ్చెన్నాయుడు. అయితే ప్రస్తుతం మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు ప్రధానంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో అచ్చెన్న చేసిన వ్యాఖ్యలే కారణం.

ఎన్నికల తరువాత పార్టీ ఉండదంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో పాటు అచ్చెన్నాయుడు సారధ్యంలో నిర్వహించిన అన్ని ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే… కనీసం ఒక్క స్థానం కూడా టీడీపీకి దక్కలేదు. దీంతో అధ్యక్షుడిని మార్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.