మధిరపై “మత్తు మాత్ర”… యువతకు ఇది “మృత్యుయాత్ర”

The Brutalattack of ganja on Madhira

 

  • దయలేకుండా విరుచుకుపడుతున్న గంజాయి

  • మాదకద్రవ్యాల మత్తులో నవభారత నిర్మాతలు

  • 10ఏళ్లవాడి నుంచి 50ఏళ్ల వరకు మత్తు బానిసలే

  • ఖాకీల కళ్లు గప్పి కదంతొక్కుతున్న మాదక ద్రవ్యాలు

  • పేగుబంధం నాశనమవుతుంటే కుమిలిపోతున్న కన్నపేగు

  • మధిర గుండెల్లో మత్తుకత్తిని దించిన దుర్మార్గమెవరిదో తెలుసా?

ఎగపీల్చే శ్వాసలు, ఎగసిపడే గుండెలు, కమ్మేస్తున్న పొగమేఘాలు, తూలిపోతున్న దేహాలు… చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పోలికలు, ఉదాహరణలు. మస్తిష్కాన్ని చుట్టుముట్టిన మత్తు, నరాల్లోకి మెల్లగా పాకి ఆపై శరీరమంతా ప్రవహించి, రాక్షసత్వానికి ఊపిరి అందిస్తే అది కిరణజన్య సంయోగ క్రియో లేక పరపరాగ సంపర్కమో కాదు..అది గంజాయి మత్తు.అది ముమ్మాటికి గంజాయి మత్తే. నేడు మధిర నియోజకవర్గాన్ని ముంచెత్తుతున్న గంజాయి కొన్నాళ్ల క్రితం వరకు నిర్మానుష్య ప్రదేశాల్లో భయం భయంగా బతుకీడ్చింది. కాని నేడు నడివీధుల్లో నిర్భయంగా నిల్చుని మూడోకన్నును నిలదీస్తోంది. నన్నెవరు ఆపగలరు? నన్ను ఎవరు ఏం చేయగలరు అంటూ సమాజానికి సవాలు విసురుతోంది. రూపాలను మార్చుకున్న మాయదారి గంజాయి… మహమ్మారి అవతారమెత్తి వినాశనానికి రహదారులు ఎలా వేస్తుందంటే….!

మత్తు అంటే ఎందుకంత ప్రేమ?
మత్తు అంటే ఎందుకంత ప్రేమ?

#ఇందుకలదని అందులేదు..ఎందెందు వెతికినా..?

ఈ ఫోటోను పదిసార్లు చూడనక్కర్లేదు. అనుమానపు పుసులను పక్కకు నెట్టేసి తేరిపారా చూస్తే చాలు….వెన్నులో వణుకు పుట్టించే చేదువాస్తవం కనుపాపల్లో ముద్రించుకుంటుంది. ఎందుకంటే అది పవిత్రతకు చిహ్నంగా నిలిచే తులసి మొక్కకాదు, సుకుమారాన్ని చిగురింపచేసే పూలమొక్క అంతకన్నా కాదు ఇది మత్తు మహమ్మారి, పండంటి జీవితాన్నినిషాలోకంలోకి నెట్టేసే మాయదారి. ఇదెక్కడో విశాఖ ఏజెన్సీలోనో, ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లోనో దిగిన ఫోటో కాదు. మధిర నడిబొడ్డులో మొలిచిన…కాదు కాదు మొలిపించిన గంజాయి మొక్కతో ఒక యువకుడు దిగిన ఫోటో. అసలు గంజాయి మొక్క ఇక్కడ ఎలా, ఇక్కడ ఎందుకు తలెత్తుకుంది అనే ప్రశ్నలకు సమాధానాలు రెండు క్షణాల్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తే చాలు. సెకనులో వందో వంతులో అవగతమైపోతుంది. మధిరలో గంజాయికి ఎంత డిమాండ్ ఉందో, మత్తుకోసం మధిర యువత ఎలాంటి కుయుక్తులకు ప్రాణం పోస్తుందో అర్ధమైపోతుంది. దమ్ మారో దమ్‌ అంటూ ముక్కుపుటాలు ఎలా ఎగపీల్చుకుంటాయో, ధారాళంగా ప్రవహించే పొగధారలు ఎలా మత్తులో కూరుకుపోయాయో ఇట్టే తెలిసిపోతుంది.

"గాంజా గ్యాంగ్"కు ఇంత దమ్ము ఎక్కడిది?
“గాంజా గ్యాంగ్”కు ఇంత దమ్ము ఎక్కడిది?

#నిఘా నిద్రపోతోందా లేక అరాచకం విర్రవీగుతోందా?

ఈ ప్రశ్నకు బదులు దొరకాలంటే రెండేళ్లు వెనక్కు వెళదాం. క్రైమ్ రికార్డ్‌ను పలుకరిద్దాం. మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో ఎంతమొత్తంలో గంజాయి దొరికిందో తెలుసుకుంటే చాలు మత్తు ఏ స్ధాయిలో కమ్మేసిందో అర్ధం అవుతుంది. సరే, రెండేళ్లు వెనక్కు వెళ్లే ఓపిక లేదు అనుకుంటే నిన్న దొరికిన గంజాయి బండిల్స్‌ బరువు తెలుసుకుంటే చాలు. ఆటోలో దర్జాగా రవాణా అవుతున్న మాయదారి మత్తును, 160 కేజీల గంజాయిని ఆత్కూరు రింగ్‌ రోడ్డులో చిత్తు చేసారు మధిర పోలీసులు. నన్నెవరు అడ్డుకుంటారులే, నాదే రాజ్యం అంటూ విర్రవీగుతున్న గాంజా గ్యాంగ్ స్పీడ్‌కు బ్రేక్ వేసారు మధిర ఖాకీలు. ఇంతవరకు ఒకే కానీ… కొన్ని భేతాళ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అత్యవసర పరిస్ధితి ఇది.

#మోతుగూడెం-మధిరకు మధ్య ఉన్న దూరం 200 కిలోమీటర్లకు పైనే. అక్కడి నుంచి మధిరకు గంజాయి రవాణా అంటే అనుకున్నంత సులువుకాదు. ఎన్నో నిఘా నేత్రాలను తప్పించుకోవాలి, మరెన్నో మూడోకన్నులను మేనేజ్ చేయాలి. ఇలా చేయగలిగినప్పుడే అంతమొత్తంలో రవాణా సాధ్యమవుతుంది. ఇంత టాప్ మోస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఆ గ్యాంగ్ ఏది?

#మధిర మీదుగా ఆంధ్రాకు రవాణా అవుతుందని చెప్పుకుంటున్న ఆ గంజాయి పుట్టుక ఎక్కడిది? అసలు మధిర మీదుగా రవాణా చేయాలనే ఆలోచన ఎవరిది?

#మధిర నుంచి ఆంధ్రా ప్రాంతానికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తే కంప్లీట్ సేఫ్‌ అనే భరోసా ఎవరు ఇచ్చారు? 160కేజీల గంజాయిలో మధిర వాటా ఎంత? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కచ్చితంగా సమాధానాలు వెతుక్కోవాల్సిందే. ఆ బదులు సంపాదించుకున్నప్పుడే “సేఫ్ మధిర” సాధ్యమవుతుందనే నిజం ఎవ్వరూ మర్చిపోకూడదు.

నగదుకాదు..వెలకట్టలేని ప్రోత్సాహకం
నగదుకాదు..వెలకట్టలేని ప్రోత్సాహకం

#సాక్ష్యాలు ఇంతేనా,మరేమిలేవా?

కొన్నిపడికట్టు పదాలను ఒక చోట చేర్చి, వాటన్నింటిని వాక్యంగా మలిచి ఒక ఘటనను వార్తగా మలచవచ్చు. ఇదంతా ఎందుకు బాస్‌? News as it isగా రాసేసి వృత్తి ధర్మాన్ని నిర్వహించి మమ అనిపించుకోవచ్చు. కానీ…కొన్ని నిజాలు రాయాలంటే మనలో మనమే,మనతో మనమే యుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వేధింపులను, విమర్శలను, అనవసరపు విషప్రచారాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. వీటన్నింటిని పట్టించుకోకుండా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ఆధారాలతో బదులు ఇవ్వాలి. JOURNO TEAM ఇప్పటి వరకు చేసింది అదే, చేస్తున్నది అదే, ఇకముందు చేయబోయేది అదే. ప్రశాంతతకు నిలయమైన మధిరను గంజాయి కమ్మేస్తుందని కొన్ని నెలల నుంచి ప్రజాస్వామిక వాదులు,శాంతికాముకులు మొత్తుకుంటున్నా “కొందరు” పట్టించుకోలేదు. పైగా అలా విచారం వ్యక్తం చేసిన వారిపై నిందలు వేసారు. ఎవడో ఒక్కడు గంజాయి తాగుతుంటే ఊరి మొత్తానికి ఆపాదిస్తారా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. అలా నిష్ఠురాలు ఆడిన వారే ఇప్పుడు మధిరలో గంజాయి పట్టుపడుతుంటే, కంటికి కునుకు దూరం చేసుకుని పోలీసులు సోదాలు నిర్వహిస్తుంటే ఏమి పట్టనట్లు నటిస్తున్నారు. JOURNO TEAM వద్ద కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాల్లో గంజాయికి బానిసగా మారిన వ్యధలు, మధిరను గంజాయికి అడ్డాగా మార్చిన కొందరి పేర్లు, మత్తులో చిత్తవుతున్న దృశ్యాలు, కాపాడండి మహాప్రభో అనే వేడుకునే తల్లితండ్రుల ఆవేదనలు ఉన్నాయి. వీటన్నింటిని వీక్షించేందుకు కొన్నిగంటలు నిరీక్షించండి చాలు. పచ్చటి బతుకుల్లో గంజాయి మహమ్మారి ఎలా చీకట్లు నింపుతోందో తెలుసుకోవాలంటే…. వెలుగులు విరజిమ్మే దీపావళి వరకు ఆగండి. వెన్నులో వణుకుపుట్టే సాక్ష్యాలను మీ కళ్ల వాకిళ్లలోకి తీసుకొస్తాం. BY విజయ్ సాధు ( Editor In Chief)