కృషి చేయ‌డ‌మే తాను చేసిన త‌ప్పా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అభివృద్ధి చేసేందుకు కృషి చేయ‌డ‌మే తాను చేసిన త‌ప్పా అని ప‌శ్నించారు. అలా చేయ‌డ‌మే త‌ప్ప‌యితే త‌నను క్ష‌మించాల‌ని కోరారు. జగన్ మాట‌లు, హామీలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారన్న చంద్ర‌బాబు ఏపీకి రెండు కళ్లయిన అమరావతి, పోలవరం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నాయో చూడాల‌ని అన్నారు.

కృష్ణాజిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆయ‌న‌ వైసీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌కు సంబంధించి తీసుకొచ్చిన 5 జీవోలను చంద్రబాబు భోగిమంటల్లో వేశారు. అప్పుల పాలు చేయ‌డ‌మే కాక ప‌న్నుల భారం మోపుతోంద‌ని మండిప‌డ్డారు చంద్ర‌బాబు. రాష్ట్రంలో ప్రతి వ్య‌క్తిపై ఇప్ప‌టికే రూ.70వేల భారం ప‌డింద‌ని ఆరోపించారు.

ప‌ట్ట‌ణాల్లో ప్ర‌తీదానిపై ప‌న్ను వేస్తున్నార‌ని చివ‌రికి పెంపుడు జంతువుల‌పై కూడా వ‌సూళ్లు మొద‌లుపెట్టార‌ని మండిప‌డ్డారు. రేపో మాపో గాలిపైనా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. ఏపీలో మెగా దోపిడీ జరుగుతోందన్నారు చంద్ర‌బాబు. జగన్‌ పేదల రక్తం తాగుతున్నారని ఆయ‌న‌ విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు కాకుండా మంత్రులకు మీట‌ర్లు పెట్టాల‌న్న చంద్ర‌బాబు అప్పుడు ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో తెలుస్తుంద‌ని సెటైర్ వేశారు.