ఆంధ్రా ఓటర్లు టీఆర్ఎస్ తోనే ఉన్నారా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో వెనుకబడ్డ టీఆర్ఎస్ సాధారణ ప్రజల ఓట్ల వరకు వచ్చేసరికి దూసుకుపోతోంది.ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే టీఆర్ఎస్ కే హైదరాబాద్ ప్రజలు పట్టం కట్టినట్టు తెలుస్తోంది.

పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే మెట్టుగూడలో టీఆర్ఎస్ తొలి విజయం అందుకుంది. దాదాపు 70 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక మంత్రి తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది.

ఇక ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి సర్కిల్ లో తెలంగాణ ఇంటిపార్టీ అధికార టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం విశేషంగా మారింది. కూకట్ పల్లి పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి బాలానగర్ కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీ హైదర్ నగర్ అల్విన్ కాలనీలో టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది.

దీన్ని ఈసారి హైదరాబాద్ లోని ఆంధ్రా ఓటర్లు అందరూ టీఆర్ఎస్ కు పట్టం కట్టినట్టు అర్థమవుతోంది. బీజేపీ ఎంత ప్రచారం చేసినా కూడా హైదరాబాదీలు ఆ పార్టీని నమ్మలేదని.. అధికార పార్టీ వైపే చూశారని ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది.