ట్రంప్ స్వీయ క్షమాభిక్ష ఆలోచ‌న‌పై వెన‌క్కు త‌గ్గారు

అధికారంలో ఉండ‌గా చేసిన త‌ప్పుల నుంచి త‌ప్పించుకునేందుకు అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ తెలివిగా తెర‌పైకి తెచ్చిన స్వీయ క్షమాభిక్ష ఆలోచ‌న‌పై వెన‌క్కు త‌గ్గారు. అధ్య‌క్షుడిగా త‌న‌కు ఆ అధికారం ఉందంటూ వాదించుకుంటూ వ‌చ్చిన ట్రంప్ చివ‌రికి తానే ఆ ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకున్నారు.

త‌న బృందంలోని న్యాయ నిపుణుల‌తో విస్తృత సంప్రదింపులు జ‌రిపిన త‌ర్వాత‌ ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా అంతర్జాతీయా మీడియాలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఒక‌వేళ స్వీయ‌ క్ష‌మాభిక్ష విధించుకుంటే ఇప్ప‌టిదాకా సంపాదించుకున్న పేరు, ప్ర‌తిష్ట‌ల‌కు భంగం వాటిల్ల‌డమేగాక దేశ పౌరుల నుంచి కూడా వ్యతిరేకతను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని ట్రంప్‌ను ఆయ‌న‌ స‌ల‌హాదారులు హెచ్చ‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

వీట‌న్నీటికంటే తాను త‌ప్పు చేసిన‌ట్టుగా స్వ‌యంగా ట్రంప్‌నే అంగీక‌రించిన‌ట్టు అవుతుంద‌ని వారు వివ‌రించార‌ట‌. తానే గాక‌, త‌న కుటుంబ స‌భ్యుల్లో కూడా ఎవ‌రికీ ట్రంప్ క్షమాభిక్ష పెట్టబోవ‌డం లేద‌ని తెలిసింది. ఇదిలా ఉంటే కొన్ని గంట‌ల్లోనే ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్న ట్రంప్ 100 మందికి పైగా వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించుకున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.