అతి త్వరలో వ్యాక్సిన్.. వారికే తొలి ప్రాధాన్యం !

కరోనా వ్యాక్సిన్పై దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనదేశంలోకి రెండు లేదా మూడు నెలలలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గురువారం ఆయన ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ వెబినార్ లో ‘ది షిఫ్టింగ్ హెల్త్కేర్ పారాడిగ్మ్ డ్యూరింగ్ అండ్ పోస్ట్-కోవిడ్’ పై అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనాపై పోరాడిన వారియర్స్కి తొలి ప్రాధాన్యమిస్తారని చెప్పారు.

ఆ తర్వాత వృద్ధులు చిన్నపిల్లలకు టీకాలు వేస్తామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం ఎంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 2021 మనందరికీ మంచి సంవత్సరంగా ఉండాలని కరోనా నివారణ విషయంలో ఆశాజనకమైన ఫలితాలు రావాలని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు. 2021 జూలై-ఆగస్టు నాటికి 25-30 కోట్ల మందికి 400-500 మిలియన్ మోతాదులు అందుబాటులోకి వస్తాయన్నారు.

వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో మన ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుండే ప్రణాళికలు ప్రారంభించామని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్కులు ధరించి భౌతికదూరంగా పాటించాలని కోరారు.

ప్రస్తుతం వ్యాక్సిన్లకు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కు మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వారి వ్యాక్సిన్కు సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తీసుకురానున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా త్వరలో జరుగనున్నాయి. వీటితోపాటు బయోలాజికల్ ఈ లిమిటెడ్ తన కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. మరోవైపు అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు చూపిస్తున్నది.