తెలుగు రాష్ట్రాలకు సెమీ హైస్పీడ్ రైళ్లు

vande Bharath semi high speed trains in telugu states

 

ప్రస్తుతం భారతీయ రైల్వే పరుగులు పెడుతోంది. ఇంత కాలం నువ్వు రావాల్సిన రైలు జీవిత కాలం లేటు అనే చెడ్డ పేరు సంపాదించుకున్న ఇండియన్ రైల్వే శాఖ… ప్రస్తుతం కాలంతో పరుగులు పెడుతోంది. దాదాపు అన్ని రైళ్లు కూడా సమయ పాలనలో పోటీపడుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు లేకపోవడంతో… సూపర్ ఫాస్ట్ రైళ్లు అయితే… ఫుల్ స్పీడ్‌తో నడుస్తున్నాయి. రావాల్సిన సమయం కంటే ముందే గమ్యాన్ని చేరుకుంటున్నాయి కూడా. గతంలో గంటకు యావరేజ్‌గా 50 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టిన రైళ్లు… ఇప్పుడు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల వచ్చిన వెసులుబాటుతో ట్రాక్‌లను మరింత ఆధునీకరించారు. ఇక అన్ని మార్గాలను కూడా విద్యుదీకరణ చేసేస్తున్నారు. దీంతో అన్ని రైళ్లు కూడా సాఫీగా నడుస్తున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ – ముంబై మధ్య బుల్లెట్ రైలు తిరిగేందుకు భారత సర్కార్ పనులు ప్రారంభించింది. ఇప్పటికే సర్వే పనులు పూర్తిచేసి.. భూ సేకరణ ప్రక్రియను కూడా దాదాపు ముగింపు దశకు తీసుకువచ్చింది. ఇదే సమయంలో సాధారణ ప్రయాణీకులకు కూడా బుల్లెట్‌తో సమానమైన రైలు ప్రయాణాన్ని అందిస్తోంది. మేకిన్ ఇండియాలో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ విజయవంతంగా నడుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ – వారణాసి మధ్య పరుగులు పెడుతున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు…

ఇకపై దేశంలోని ప్రధాన మార్గాల్లో కూడా ప్రయాణించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే వందకు పైగా వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రయాణీకుల కోసం రెడీ చేస్తోంది పెరంబూరు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. అత్యాధునిక వసతులతో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే సామర్థ్యం ఉన్న ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు… మెట్రో రైలును మించిన సదుపాయాలతో ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్లు, వైఫై సదుపాయం, పూర్తి ఏసీ బోగీలు, బయో టాయిలెట్లు ఈ రైళ్లలో ఉన్నాయి.

వీటిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో తిప్పేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. రద్దీ అధికంగా ఉంటే విజయవాడ – విశాఖపట్నం, విజయవాడ – తిరుపతి, విజయవాడ – సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు 6 గంటలుగా ఉన్న ప్రయాణం… ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల వల్ల 4 గంటల్లోనే పూర్తి కానుంది.